చంద్రబాబునాయుడికి ఐటీ నోటీసులు ఇవ్వడాన్ని రాజకీయంగా ఉపయోగించుకునేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఐటీ నోటీసులతో బాబును రాజకీయంగా ఆత్మరక్షణలో పడేసేందుకు వైసీపీ తీవ్రస్థాయిలో ఎటాక్ చేస్తోంది. రూ.118 కోట్లకు సంబంధించి ముడుపులు అందాయని, ఇది తీగ మాత్రమే అని, అసలు డొంక మున్ముందు కదిలే రోజు దగ్గర్లోనే వుందని వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఐటీ నోటీసులపై నోరు తెరవాల్సిందే అని చంద్రబాబుపై వైసీపీ ఒత్తిడి చేస్తోంది.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. బాబుకు ఐటీ నోటీసులు అందడంపై దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ కనీసం ట్విటర్ ద్వారా అయినా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. అలాగే ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఎందుకు నోరు మెదపలేదని అడిగారు. బంధు ప్రీతా? మరిది ప్రీతా? అని మాజీ మంత్రి అనిల్ నిలదీయడం గమనార్హం.
ఊర్లు పట్టుకుని తిరగే పులకేశి కూడా స్పందించడం లేదని నారా లోకేశ్‌పై సెటైర్ విసిరారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లడం వెనుక ఐటీ నోటీసుల మతలబు వుందని ఆయన అన్నారు. ఈ ముడుపుల్లో పవన్‌కల్యాణ్‌కు వాటా వుందా? అని ఆయన ప్రశ్నించారు. వామపక్ష నేతలు నారాయణ, రామకృష్ణ ఎందుకు నోరు మెదపడం లేదో అర్థం కావడం లేదన్నారు.
చంద్రబాబు కప్పను మింగిన పాములాగా వ్యవహరిస్తున్నాడని ఆయన విమర్శించారు. ప్రధాని మోదీతో సీఎం జగన్ సమావేశం అయితే చంద్రబాబు మీడియా ప్యాంట్లు తడుస్తున్నాయా? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు ఐటీ నోటీసులపై ఎందుకు వార్తలు రాయడం లేదని ఆయన నిలదీశారు. చంద్రబాబుకు శక్తి, వయసు అయిపోయాయన్నారు. చేసిన పాపానికి పరిహారం చెల్లించాల్సిన సమయం మాత్రం మిగిలి వుందని ఆయన అన్నారు.