ఆలు లేదు, చూలు లేదు…కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ఉంది జనసేనాని పవన్‌కల్యాణ్ వ్యవహారం. ఒక్కోసారి ఒక్కో విధంగా ప్రకటనలు ఇవ్వడం పవన్‌కల్యాణ్‌కే చెల్లింది. కనీసం మిత్రపక్షమైన బీజేపీని కూడా ఆయన కలుపుకుని మాట్లాడ్డం లేదు. ఢిల్లీలో బీజేపీ మిత్రపక్షాల సమావేశంలో పాల్గొని వచ్చిన తర్వాత మాత్రం… ఏపీలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు.
తాజాగా గురువుల దినాన్ని పురస్కరించుకుని పవన్ విడుదల చేసిన ప్రకటనలో జనసేన ప్రభుత్వం అని ప్రస్తావించడం విశేషం. టీచర్స్ డే నాటికి కూడా ఉపాధ్యాయులకు వైసీపీ ప్రభుత్వం జీతాలు వేయకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ ధర్మాగ్రహాన్ని అర్థం చేసుకోవాల్సిందే. ఉపాధ్యాయులతో జగన్ ప్రభుత్వం శత్రు వైఖరితో వ్యవహరిస్తోందన్న విమర్శలున్నాయి.
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువులకు పవన్ శుభాకాంక్షలు చెప్పారు. తల్లిదండ్రుల తర్వాత అంతటి ఆప్యాయత, వాత్సల్యం లభించేది గురు దేవుళ్ల దగ్గరే అని ఆయన పేర్కొన్నారు. ఏ మాత్రం ప్రతిఫలం ఆశించకుండా విజ్ఞానాన్ని పంచి, తమ శిష్యుల విజయాలను తమవిగా గురువులు భావిస్తారని ఆయన ప్రశంసించారు. ఉపాధ్యాయుల విషయంలో ఏపీ ప్రభుత్వం, ఉన్నతాధికారులు అనుసరిస్తున్న తీరు తరచూ విమర్శలకు గురి అవుతోందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ మాట అన్నట్టు అర్థం చేసుకోవాల్సి వుంటుంది.
ఉపాధ్యాయ వర్గంపై కక్ష సాధింపుతో ప్రభుత్వం వ్యవహరిస్తోందనేందుకు నిదర్శనాలున్నాయని ఆయన తెలిపారు. బోధనేతర విధులతో టీచర్స్‌ను ఇబ్బందులపాలు చేస్తున్నారని ఆయన వాపోయారు. అలాగే నాడు-నేడు పనుల్లో అధికార పార్టీ తప్పిదాలకు హెచ్ఎమ్‌లను బలి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
మరీ ముఖ్యంగా సకాలంలో జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని ఆయన విమర్శించారు. పదోన్నతులు పొందిన, బదిలీ అయిన సుమారు 30 వేల మంది ఉపాధ్యాయులకు కొన్ని నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని పవన్ పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం చేసుకొనే ఈ సమయంలో వారికి ఇంకా జీతం చెల్లించలేదంటే ఈ ప్రభుత్వానికి గురు దేవుళ్ల విషయంలో ఎలాంటి అభిప్రాయం వుందో అర్థమవుతోందని పవన్ విమర్శించారు.
జనసేన ప్రభుత్వం కచ్చితంగా బోధన వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరి గౌరవ మర్యాదలను కాపాడుతుందని పవన్ హామీ ఇవ్వడం విశేషం. జనసేన ప్రభుత్వం వచ్చేది లేదు, ఏ ఒక్కరి సమస్యలు పరిష్కారానికి నోచుకునేది లేదనే సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి.