టీటీడీ చైర్మన్‌గా భూమన కరుణాకరరెడ్డి తనదైన ముద్ర వేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో వైఎస్సార్ హయాంలో రెండేళ్ల పాటు భూమన టీటీడీ చైర్మన్‌గా చిరస్మరణీయ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో దళిత గోవిందం, కళ్యాణమస్తు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, వృద్ధులకు ప్రత్యేక దర్శనం, అలాగే తిరుమలకు వెళ్లే ప్రతి భక్తుడికి శ్రీవారి దర్శనంతో సంబంధం లేకుండా అన్న ప్రసాదం అందజేయడం తదితర ఎన్నో గొప్ప నిర్ణయాలు తీసుకుని, వాటిని అమలు చేసిన ఘనత భూమనకు దక్కుతుంది.
తాజాగా ఇవాళ భూమన నేతృత్వంలో మొదటి పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 25 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన యువతీ, యవకులు రామకోటి తరహాలో గోవిందకోటిని రాస్తే…..వారి కుటుంభ సభ్యులకు వీఐపీ బ్రేక్ దర్శన భాగ్యం కల్పించాలని బోర్డు నిర్ణయించింది. 10 లక్షల వెయ్యి 116 సార్లు గోవిందనామాలు రాసిన వారికి దర్శన భాగ్యం కల్పించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ కరుణాకరరెడ్డి తెలిపారు.
ముంబయిలోని బాంద్రాలో 5.35 కోట్లతో టీటీడీ సమాచార కేంద్రం, 1.65 కోట్లతో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపడతారు. 2 కోట్ల వ్యయంతో చంద్రగిరి మూలస్థాన ఆలయ పున:నిర్మాణం, రూ.49.5 కోట్లతో టీటీడీ ఉద్యోగుల క్వార్టర్స్ మరమ్మతు పనులు చేస్తారు. టీటీడీ పోటులో 413 పోస్టులు భర్తీకి ప్రభుత్వ అనుమతికి విజ్ఞప్తి. అలాగే టీటీడీ ఆధ్వర్యంలోని వేదపాఠశాలలో 47 అధ్యాపకుల పోస్టుల భర్తీకి నిర్ణయించారు. వడమాలపేట వద్ద టీటీడీ ఉద్యోగులుకు ఇంటి స్థలాల వద్ద అభివృద్ధి పనులకు రూ.33 కోట్లు కేటాయించారు.
తిరుపతిలోని పురాతనమైన 2,3 సత్రాల స్థానంలో 600 కోట్ల రూపాయల వ్యయంతో అచ్యుతం, శ్రీపఠం వసతుల సముదాయాలను నిర్మించాలని ఈ సమావేశంలో తీర్మానించారు.