సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లో కూడా టైమ్, టైమింగ్ అన్నవి చూడాల్సిందే. లేకపోతే వాటి పవర్ పోతుంది. ఇపుడు ఏపీలో అమరావతి రాజధాని మీద రైతులు పాదయాత్ర చేస్తున్నారు. అమరావతి ఏకైక రాజధాని అన్న సెంటిమెంట్ ని ఏపీ మొత్తం కనెక్ట్ అయ్యేలా చూడాలన్నదే పాదయాత్ర వెనక అసలైన ఉద్దేశ్యం అని చెబుతున్నారు.
ఒక విధంగా పాదయాత్ర తరువాత మూడు రాజధానుల అంశం మరింతగా చర్చకు వస్తోంది. అది అలాగే ఉంది అన్నట్లుగా వైసీపీ నేతలు తరచూ చెబుతున్నారు. జగన్ కుడి భుజం లాంటి ఎంపీ విజయసాయిరెడ్డి ఈ విషయంలో అయితే సంచలన ప్రకటనే తాజాగా చేశారు. త్వరలోనే విశాఖ నుంచి పాలన మొదలవుతుంది అని ఆయన బల్ల గుద్ది మరీ చెబుతున్నారు.
విశాఖలో పాలనా రాజధాని, కర్నూల్ న్యాయ రాజధానిగా తొందరలోనే కార్యకలాపాలు మొదలవుతాయని కూడా ఆయన అంటున్నారు. వైసీపీ పాలనలోనే మూడు రాజధానుల ప్రతిపాదన సాకారం అవుతుంది అని కూడా గట్టిగానే చెబుతున్నారు.
విశాఖలో ఇప్పటికే తెలుగు అకాడమీని మార్చడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. అలాగే భోగాపురం విమానాశ్రయాన్ని త్వరలో పూర్తి చేస్తామని, విశాఖ టూ భోగాపురానికి ఆరు లైన్ల రోడ్లు కూడా వస్తాయని చెప్పుకొచ్చారు.
మొత్తానికి విశాఖ అభివృద్ధి విషయంలో వైసీపీ అన్ని రకాల చర్యలూ తీసుకుంటోందని, రాజధానిగా విశాఖ వెలిగిపోవడం ఖాయమని భారీ భరోసాను విజయసాయిరెడ్డి ఇస్తున్నారు. కరెక్ట్ టైమ్ లో టైమింగ్ తో వచ్చిన ప్రకటనగానే దీన్ని అంతా చూస్తున్నారు.