ముందుంది ముస‌ళ్ల పండుగ‌!

బీజేపీకి ముందుంది ముస‌ళ్ల పండుగ‌ని తెలంగాణ మంత్రి హ‌రీష్‌రావు హెచ్చ‌రించారు. యాసంగిలో వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం…

బీజేపీకి ముందుంది ముస‌ళ్ల పండుగ‌ని తెలంగాణ మంత్రి హ‌రీష్‌రావు హెచ్చ‌రించారు. యాసంగిలో వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా రైతు ధ‌ర్నాలు నిర్వ‌హించారు.  

రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్, సిద్దిపేట జిల్లాలో హ‌రీష్‌రావు, ఖ‌మ్మంలో పువ్వాడ అజ‌య్, నిర్మ‌ల్‌లో ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, సూర్యాపేట‌లో జ‌గ‌దీశ్ రెడ్డి, వ‌న‌ప‌ర్తిలో నిరంజ‌న్ రెడ్డి, హైద‌రాబాద్‌లో త‌ల‌సాని శ్రీనివాస్ యాదవ్, మ‌హ‌ముద్ అలీ, వ‌రంగ‌ల్‌లో ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పాల్గొని నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

సిద్దిపేట ధర్నాలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై  పోరాటం ఇప్పుడే మొదలైందన్నారు. ఇది ఆరంభం మాత్ర‌మే అన్నారు. మున్ముందు మరింత ఉదృతం చేస్తామని మంత్రి హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ అసమంజస విధానాలు తెలంగాణ రైతుల పాలిట శాపంగా మారుతున్నాయని మండిపడ్డారు.  

రైతులు జర బాగుపడుతుంటే కేంద్రం యాసంగిలో వడ్లు కొనమంటున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. యాసంగిలో తెలంగాణలో దొడ్డు వడ్లు పండుతాయ‌ని, అవి బాయిల్డ్ రైస్‌కే పనికి వస్తాయన్నారు. పంజాబ్‌లో మొత్తం వడ్లు మొత్తం ఎలా కొంటారని ప్ర‌శ్నించారు. తెలంగాణలో ఎందుకు కొనరని నిల‌దీశారు. దేశంలో రైతుకు పెట్టుబడి సాయం, బీమా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు.  

ఇప్పటికైనా కేంద్రం పద్ధతి మార్చుకోకపోతే.. రైతుల కోపాగ్నికి కమలం వాడిపోక తప్పద‌ని హెచ్చ‌రించారు. ప్రశ్నించే రైతులపై ఉగ్రవాద ముద్ర వేస్తున్నారన్నారు. గాంధీని చంపిన గాడ్సేను దేశభక్తుడని అనడం దేశభక్తా?  అని  హరీష్ మండిపడ్డారు. వడ్లు కొనాలని రైతులు.. ప్రధాని మోదీకి ట్వీట్లు చేయాలని హరీష్ సూచించారు.