కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ యుద్ధం ప్రకటించింది. ఇకపై కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై అడుగడుగునా ప్రశ్నిస్తాం, నిలదీస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యాసంగిలో వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నేతృత్వంలో ధర్నాలు నిర్వహించారు.
ఇందులో భాగంగా సిరిసిల్లలో స్థానిక ఎమ్మెల్యే, తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు కేంద్ర ప్రభుత్వంపై తనదైన శైలిలో పంచ్‌లు విసిరారు. బీజేపీ నేత బండి సంజయ్ కాదు తొండి సంజయ్ అని వెటకరించారు. యాసంగిలో వరి వేయండని తొండి సంజయ్ పిలుపునిచ్చారన్నారు.
బండి సంజయ్‌ను గెలిపించినోళ్లకి ఓ దండమన్నారు. ఇలాంటి పిచ్చోళ్లని పార్లమెంట్‌కి పంపించారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ-ముస్లిం పేరుతో ఆగం చేయటమే బీజేపీ పని అని తూర్పార పట్టారు. రైతు ఏడిస్తే రాజ్యం బాగుపడదని మంత్రి హెచ్చరించారు. లాల్‌బహదూర్ శాస్త్రి జై జవాన్-జై కిసాన్ అని అంటే… నేడు కేంద్ర ప్రభుత్వం నై కిసాన్ అంటోందని ఎద్దేవా చేశారు.
అన్నీ అమ్మటమే ప్రధాని మోదీ ఆలోచన అని కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరమని ఆయన పేర్కొన్నారు. డెల్టాలో కనిపించే పరిస్థితులు తెలంగాణలో కనిపిస్తున్నాయన్నారు. ఆకలి సమస్య ఎదుర్కొంటున్న దేశాలలో ముందంజలో భారత్ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది మోడీ సర్కార్ ఘనతగా ఆయన విమర్శించారు.