వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసుల నుంచి విముక్తులవుదామని ఆశించిన అధికార పార్టీ ఎమ్మెల్యేలకు నిరాశే ఎదురవు తోంది. ఎమ్మెల్యేలు ఆశించినట్టు ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటున్నా న్యాయస్థానం మాత్రం అందుకు అంగీకరించడం లేదు. దీంతో ఇదెక్కడి గొడవరా బాబు అని వైసీపీ ఎమ్మెల్యేలు తలలు పట్టుకోవాల్సి వస్తోంది.
తాజాగా జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు హైకోర్టులో చుక్కెదురైంది. సామినేని ఉదయభానుపై పది కేసులను ఉపసంహరించుకుంటూ ఏపీ ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఈ జీవో జారీని జర్నలిస్టు నాయకుడు చెవుల ఆంజనేయులు సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది జడ శ్రవణ్ వాదించారు.
ఒకే ఒక్క జీవోతో 10 కేసులు ఎలా ఉపసంహరించుకుంటారు? ఎందుకు ఉపసంహరించుకుంటారని హైకోర్టు గట్టిగా నిలదీసింది. అసలు ప్రభుత్వం కేసులు ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించింది. దీంతో సామినేని ఉదయభానుకు చిక్కులు తప్పలేదు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉదయభాను,హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మూడువారాల్లో కౌంటర్ వేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరి ప్రభుత్వం కేసుల ఉపసంహరణను ఎలా సమర్థించుకుంటుందో చూడాలి.