రాను రాను తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతోంది. యువరక్తం వచ్చి కొత్త కొత్త సినిమాలు, కొత్త కొత్త స్క్రీన్ ప్లే విధానాలు, కొత్త అయిడియాలు ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది. మరో పక్క డిజిటల్ కంటెంట్ కు ఆదరణ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సినిమాల ప్రచారానికి కూడా కొత్త పద్దతులు అవసరం పడుతున్నాయి. సాంప్రదాయ విధానాలైన ప్రెస్ మీట్ లు, సక్సెస్ మీట్ లు, వంటి వాటికి కాలం చెల్లుతోంది.
ఇలాంటి నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు-అనిల్ రావిపూడి కాంబినేషన్ లోని సరిలేరు నీకెవ్వరు సినిమాకు ఔత్సాహిక ప్రచారకర్తలు కావాలంటే ప్రకటన వెలువడింది. ఈమేరకు సినిమా నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర ఓ ట్వీట్ వేసారు. వాస్తవానికి ఇప్పటికే టాలీవుడ్ లో ప్రచారానికి సంబంధించి పలు సంస్థలు వున్నాయి.
అయితే ఈ సంస్థలు అన్నీ కంటెంట్ మాత్రమే అందిస్తాయి. పబ్లిసిటీ సంగతులు మాత్రం నిర్మాతలు, వాటి టీమ్ మాత్రమే చూసుకుంటున్నాయి. ఇప్పుడు ఈ విధంగా ఔత్సాహికులను ఆ పనికి కూడా పరిచయం చేయబోతున్నారన్న మాట.