దిల్‌రాజుకి తన మీద నమ్మకం ఎక్కువ. సక్సెస్ఫుల్ నిర్మాతగా అది కర్ణుడికి కవచ కుండలాలంత సహజం. అయితే ఆయన జడ్జిమెంట్ నమ్మి సినిమాకి వెళ్లాలంటే కొంచెం ఆలోచించాలి. గతంలో శ్రీనివాస కల్యాణం అనే చిత్ర రాజాన్ని అద్భుతమని పొగిడాడు. నిజమే అనుకుని వెళ్లిన కొంత మంది రెండు రోజులు సెలైన్ పెట్టుకుని బతికి బయటపడ్డారు, ఇప్పుడు వారసుడు వదిలాడు. దీనికి సెలైన్ అక్కర్లేదు కానీ, రెండు తలనొప్పి మాత్రలు గ్యారెంటీగా అవసరం.
అయితే పండగ రేస్‌లో నిలబడాల్సిన సినిమా, మంచి ఫొటోగ్రఫీ, సినిమాలో రిచ్‌నెస్, వంశీ పైడిపల్లి టేకింగ్‌లో ప్రెష్‌నెస్, ది బెస్ట్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, ఒక హిట్ సాంగ్, సెన్సిబుల్ డైలాగ్స్ అన్నీ వున్నాయి. లేనిది కథ, కథనంలోని కొత్తదనం. ముక్కిపోయిన బియ్యంతో ఎన్ని మసాలా దినుసులు వేసినా, బిర్యాని చెడిపోతుంది. మురిగిపోయి, అరిగిపోయిన కథతో బాలకృష్ణ, చిరంజీవితో పోటీ దిగాలనుకోవడం “దిల్” ధైర్యం. ఫ్యామిలీ కథలు పాతవే అయినా ఎమోషన్ కనెక్ట్ అయితే ఆడుతాయి. ఇది నిజం కూడా. విషయం ఏమంటే మనం చరిత్ర చెప్పేటప్పుడు స్వాతంత్ర్యానికి ముందు, అనంతరం అని చెప్పినట్టు ప్రేక్షకుల్ని కరోనాకి ముందు, తర్వాత అని చెప్పుకోవాలి.
లాక్డౌన్ అతని ప్రపంచాన్ని మార్చేసింది. అతనిప్పుడు తెలుగు, తమిళ, హిందీ ప్రేక్షకుడు కాదు. ప్రపంచ ప్రేక్షకుడు. మూస ధోరణిలో కథ చెప్పి, రెండు పాటలు, నాలుగు ఫైట్స్, మూడు ట్విస్టులు, నాలుగు ఎమోషనల్ సీన్స్ కలిపి అతుకులేస్తే థియేటర్ మొహం చూడ్డానికి కూడా ఇష్టం పడడం లేదు. ఇది అర్థం కాక హిందీ సినిమాలు మునిగిపోతున్నాయి. సగటు రొడ్డ కొట్టుడు సినిమాలకి అలవాటు పడిన హిందీ ప్రేక్షకులు (నార్త్ ఇండియన్) కూడా మారిపోయారు. మామూలుగా అయితే వారం రోజులు ఆడని తెలుగు, కన్నడ డబ్బింగ్ సినిమాలు ఢిల్లీలో ఆడుతున్నాయి. బీహార్ బెల్ట్‌లోకి ఎంటర్ కూడా కాని మన సినిమాలు హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టుకుంటున్నాయి. కారణం కొత్తదనం.
సరే ఇప్పుడు వారసుడు గురించి మాట్లాడుకుందాం. దీనికి కొడుకు దిద్దిన కాపురం లేదా కొడుకు దిద్దిన వ్యాపారం అని పెట్టాల్సింది. కుటుంబం కష్టాల్లో వున్నప్పుడు ఆ ఇంట్లోని మనిషి లేదా బయట వ్యక్తి వచ్చి అన్నీ చక్కదిద్దడం సినిమా పుట్టినప్పటి నుంచి వున్న జానర్. కరెక్ట్‌గా కుదిరితే వర్కౌట్ అవుతుంది. లేదంటే మునిగిపోతుంది.
కోడలు దిద్దిన కాపురం (1970)లో సావిత్రి వచ్చి అస్తవ్యస్తంగా ఉన్న ఇంటిని బాగు చేస్తుంది. మరిది (ఎన్టీఆర్) సాయంతో భర్తని, అత్తమామల్ని మార్చి , ఇంట్లో తిష్టవేసిన స్వామీజీని వెళ్లగొడుతుంది. దేవుడు చేసిన మనుషులు (1973)లో ఎన్టీఆర్ వచ్చి దారి తప్పిన తమ్ముడు (కృష్ణ) చెల్లి (కాంచన)ని సరి చేస్తాడు. ఎన్టీఆర్ తన కొడుకని తండ్రి ఎస్వీఆర్‌కి తెలియదు. ఇదే కథని కొంచెం ట్విస్ట్ చేస్తే “అలవైకుంఠపురంలో”.
పిల్లలు చిన్నప్పుడు మారిపోవడం ఇదే వేరే జానర్. ఇంటిగుట్టు (1958) బేసిక్ లైన్ నుంచి అలవైకుంఠపురం పుట్టింది. కన్న కొడుకు (1973) కూడా ఇదే. కొడుకుగా ఉండాల్సిన ఏఎన్నార్ సొంత ఇంట్లో కారు డ్రైవర్‌గా వుంటాడు. అజ్ఞాతవాసి, అత్తారింటికి దారేది కూడా ఒక వ్యక్తి వచ్చి ఆ ఇంటిని లేదా వ్యాపారంలోని ప్రత్యర్థుల్ని ఎదుర్కొని సరిచేయడం.
హీరో వచ్చి అస్తవ్యస్తతని సరి చేయడం ప్రపంచ వ్యాప్తంగా ఇష్టమైన కథ. భారతంలో పాండవుల అజ్ఞాత వాసం వల్లే కీచకుడి పీడ వదులుతుంది. సాధారణంగా కనిపించే వ్యక్తి సామాన్యుడు కాదనిపించడం పెద్ద థ్రిల్. హీరో వచ్చి సరిచేయడం ఒక లైన్ అయితే హీరో ప్లేస్‌లో అదే రూపంలో వ్యక్తి రావడం ఇంకో లైన్. దీన్నే డబుల్ యాక్షన్ అంటారు.
లండన్‌లోని రాజకుమారులు తారుమారైతే ఏం జరుగుతుందో మార్క్‌ట్వయిన్ కింగ్ అండ్ పాపర్ నవల రాసాడు. దీన్నే రాజు-పేద (1954)గా తీశారు. ఎన్టీఆర్ మురికిగా వుండే డిగ్లామర్ పాత్ర వేశాడు. నచ్చితే ఇమేజ్ లెక్క చేయకుండా సినిమా చేయడం ఎన్టీఆర్ గొప్పతనం. భీష్మ, బడిపంతులు, గుడి గంటలు ఇలా చాలా చెప్పొచ్చు.
ఒకే రూపంలో ఇద్దరు వుండడం షేక్స్పియర్కి ఇష్టం. కామెడీ ఆఫ్ ఎర్రర్స్‌ని ఎంత మంది కాపీ కొట్టారో లెక్కలేదు. కథ తమదీ అని వేసుకున్న వాళ్లు వున్నారు. ఇది షేక్స్పియర్ కథ అని తెలియక రైట్స్ కొని తమ భాషల్లో తీసిన వాళ్లున్నారు. “ట్వల్ఫ్త్నైట్” ఆయన పిచ్చికి పరాకాష్ట. కవల చెల్లి, అన్న (ఒకే రూపంలో ఉన్న వయోలా, సెబాస్టియన్) కథ ఇది.
రాముడు- భీముడు (1964)లో కూడా రఫ్‌గా వుండే హీరో వెళ్లి తన కుటుంబాన్ని చక్కదిద్దడం. స్కేప్ గోట్ ఇంగ్లీష్ నవల దీనికి ఆధారం. Daphne du Maurier అనే ఆవిడ రాసారు. హిచ్‌కాక్‌కి ఇష్టమైన రచయిత్రి. ఆయన ఇంగ్లీష్‌లో తీస్తే, చాలా మంది ఆయనతో సంబంధం లేకుండా తమ భాషలో తీసుకుని పేరు పెట్టేసుకున్నారు. అలెగ్జాండర్ డ్యూమా కథకి కూడా తెలుగులో తమ యూనిట్ పేరు పెట్టుకున్న వాళ్లు ఉన్నారు.
తవ్వుకుంటూ పోతే చాలా బయటికొస్తాయి. కథల్ని కాపీ కొట్టడం ఒక ప్రాథమిక హక్కు. దాన్ని మనం గౌరవించాలి. సరే, అది వేరే టాపిక్.
చాలా మందిలా కాకుండా, విషయం ఉన్న వంశీ పైడిపల్లి ముతక వాసనొచ్చే వారసుడు జోలికి ఎందుకెళ్లాడో తెలియదు. ఒకవేళ వెళ్లినా కొత్తగా చెప్పాడా అంటే అదీ లేదు. మొదటి 15 నిమిషాల్లోనే సినిమా క్లైమాక్స్ కూడా అర్థమైతే ఇక చూడ్డానికి ఏముంది? వ్యాపారపు ఎత్తుగడలు అయినా కొత్తగా ఉన్నాయా? అంటే అవి ఇంకా ఘోరం. 1978లో వచ్చిన త్రిశూల్‌ని వంశీ చూసి వుంటే కొంచెం బాగా తీసేవాడు. ఇక రష్మిక ఎందుకుందో ఆమెకి కూడా తెలియదు. ప్రకాశ్‌రాజ్ ఎందుకురా నాకీ టార్చర్ అన్నట్టు చూస్తూ వుంటాడు. హీరోకి కండబలం ఎలాగూ వుంటుంది. తప్పదు, భరిస్తాం. బుద్ధి బలం కూడా వుంటే ప్రేక్షకుడికి కొంచెం ఆరోగ్యం కదా!
ఏ సినిమాకి వెళ్లినా ఇనుపరాడ్డుతో తంతూ వుంటే ఎలా బతకాలి సార్? సినిమా పిచ్చోళ్లం చూడకపోతే బతకలేం. చూస్తే మీరు బతకనివ్వరు. ప్రేక్షకున్ని వెతుక్కుంటూ ఆయుధం దానంతట అదే వస్తే ఎలా?
జీఆర్ మహర్షి