ప్రపంచం మొత్తం మీదే బతకనేర్చిన వ్యక్తుల జాబితా తీస్తే అందులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పేరు కచ్చితంగా వుంటుంది. అందుకే వర్మకు ఎప్పటికీ నిర్మాతల కొదవ వుండదు. లైఫ్ రన్నింగ్ కు ఢోకా వుండదు. అలాంటి రామ్ గోపాల్ వర్మ ఈ మధ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జనాలతో రాసుకుపూసుకు తిరిగేస్తున్నారు.
ఇప్పటికే జగన్ మీద ఓ సినిమాను ఎంపీ మిధున్ రెడ్డి, టీటీడీ బోర్డ్ మెంబర్ దాసరి కిరణ్ కుమార్ లతో కలిసి నిర్మించే ప్రయత్నాల్లో వున్నారు. మరోపక్క నిత్యం పవన్..చంద్రబాబు బంధాన్ని ఎండగడుతున్నారు. పనిలో పనిగా నాగబాబును కూడా ఓ చూపు చూస్తున్నారు.
ఇప్పుడు లేటెస్ట్ గా ఆంధ్రలో పండగ టూర్ కూడా మొదలెట్టేసారు. ఎలాగూ భీమవరం మూలాలు వున్నాయి కదా. సంక్రాంతి టైమ్ లో భీమవరం, కాకినాడ ఇలా ఓ రౌండ్ వేస్తున్నారు. కుదరితే వైకాపా జనాల ఇళ్లలో ముచ్చట్లు పెడుతున్నారు. సినిమా సెలబ్రిటీలు అంటే సహజంగా వుండే మోజు, సరదాతో వాళ్లు కూడా వర్మకు స్వాగతం పలికి, సకల మర్యాదలు చేస్తున్నారు.
కానీ ఇది వైకాపాకు నెగిటివ్ అవుతుంది తప్ప పాజిటివ్ కాదు అన్నది వాస్తవం. జగన్ కు తప్పలేదు కనుక ఓ అరగంట అపాయింట్ మెంట్ ఇచ్చాడు వర్మకు. తన సహచరుల రికమెండేషన్, తన మీద సినిమా తీస్తా అంటున్నాడు. కలిసినా తీస్తాడు..కలవకున్నా తీస్తాడు.ఎందుకు వచ్చిన తలనొప్పి ఓ సారి కలిసేస్తే పోయే అన్నట్లు కలిసారు జగన్.
ఇక అక్కడి నుంచి, వర్మ వైకాపా తరపున వకాల్తా తీసుకుంటున్నట్లు కమ్మ-కాపు బంధంపై మాటల తూటాలు విసురుతున్నాడు. మరోపక్క వైకాపా జనాలతో భుజం భుజం కలుపుతున్నారు. ఇప్పుడు జనాల్లోకి ఏం వెళ్తుంది. వైకాపా వెనుక వుండి వర్మను ముందుకు తోస్తోందని, ఈ కారణంగానే ఆయన విమర్శలు చేస్తున్నారని జనం అనుకోవడం తప్ప మరేం వుంటుంది.
పోనీ అలా అని వర్మ ఏమైనా విశ్వసనీయమైన వ్యక్తా? ఎప్పుడూ ఓ పద్దతిగా..సిద్దాంతాలు, ఇతరత్రా వ్యవహారాలకు కట్టుబడి వుండే వ్యక్తా? ఆయన ధోరణి ఆయనదే తప్ప వేరు కాదు. అందువల్ల వైకాపా జనాలు వర్మతో ఎంత జాగ్రత్తగా వుంటే అంత మంచింది.