ఎవరైనా ఒత్తిడి తీసుకోవద్దని చెబుతారు. టెన్షన్ పడితే షుగర్, బీపీ లాంటి సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ప్రస్తుతం యూత్ తో పాటు చాలామందిని వేధిస్తున్న సమస్య ఇదే. అయితే టెన్షన్ కూడా మంచిదే అంటున్నారు సైంటిస్టులు. కాకపోతే అది మోతాదుకు మించి ఉండకూడదని హెచ్చరిస్తున్నారు.
చిన్నపాటి ఒత్తిడిని తీసుకోవడం మంచిదంటున్నారు సైంటిస్టులు. ఇది మనస్సును యవ్వనంగా ఉంచుతుంది. ఇది మాత్రమే కాదు, వృద్ధాప్యాన్ని వాయిదా వేయడానికి చిన్నపాటి ఒత్తిడి సహకరిస్తుంది. తాజా పరిశోధనల్లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. న్యూయార్క్‌లోని రాక్‌ఫెల్లర్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకుడితో కలిసి మొదటిసారిగా, ఫిర్దౌస్ దభార్ అనే అమెరికన్ సైకియాట్రిస్ట్ దీనిపై అధ్యయనం చేశాడు. మంచి ఫలితాల్ని కనిబెట్టాడు.
చిన్న ఒత్తిడి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతోందని తెలుసుకొని ఈ సైంటిస్టులు ఆశ్చర్యపోయారు. ఇది శారీరక సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. ఉదాహరణకు ఓ అధ్లెట్, రేపటి పోటీ గురించి ఈరోజు టెన్షన్ పడడం వల్ల అతడి గుండె, కండరాలు మరింత దృఢంగా తయారైనట్టు గుర్తించారు.
తేలికపాటి శారీరక, మానసిక ఒత్తిడి రక్తంలో ఇంటర్‌లుకిన్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేస్తుంది, ఇది రోగనిరోధక వ్యవస్థను ఇంకాస్త పెంచుతుంది. క్రిములతో పోరాడటానికి సహాయపడుతుంది.
తాజా పరిశోధనల ప్రకారం, 40 సంవత్సరాల తర్వాత పదేళ్లలో మెదడు పరిమాణం దాదాపు 5 శాతం వరకు తగ్గుతుంది. 70 ఏళ్ల తర్వాత, క్షీణత రేటు మరింత పెరుగుతుంది. కొద్దిగా ఒత్తిడిని తీసుకోవడం వల్ల శరీరంలో కార్టికోస్టెరాన్ అనే ఒత్తిడి హార్మోన్ ఉత్పత్తి అవుతుంది, ఇది మానసిక సామర్థ్యాన్ని పెంచుతుంది, మెదడు క్షీణతను నిరోధిస్తుంది. మెమొరీని మెరుగుపరుస్తుంది.
ఇవే కాకుండా, పరిమిత స్థాయిలో టెన్షన్ తీసుకోవడం వల్ల శరీరంలో యాంటీ యాక్సిడెంట్ల స్థాయిని అది పెంచుతుంది. డీఎన్ఏ, ఆర్ఎన్ఏలను రక్షిస్తుంది. అయితే ఎక్కువ ఒత్తిడికి గురైతే మాత్రం ప్రతికూల ప్రభావాలు తప్పవని హెచ్చరిస్తున్నారు వైద్యులు.
చేయాల్సిన పనికి టైమ్ టార్గెట్ పెట్టుకోవడం, రేపు చేయాల్సిన పనుల జాబితా గురించి ఈరోజే ఆలోచించడం, ఆర్థిక లావాదేవీల గురించి నెల రోజుల ముందే టార్గెట్స్ విధించుకోవడం లాంటివి సెట్ చేసుకుంటే, పరిమిత ఒత్తిడి ఉంటుందని చెబుతున్నారు.