బీజేపీ వాళ్లకు టికెట్లు ఇస్తుందా?

మొత్తానికి కర్ణాటక ఫిరాయింపుదారుల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. కాంగ్రెస్-జేడీఎస్ ల కూటమికి ఝలక్ ఇచ్చి, కూటమికి వ్యతిరేకంగా మారి, ప్రభుత్వం పడిపోవడానికి కారణం అయిన వారిని అప్పటి స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. వారి…

మొత్తానికి కర్ణాటక ఫిరాయింపుదారుల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. కాంగ్రెస్-జేడీఎస్ ల కూటమికి ఝలక్ ఇచ్చి, కూటమికి వ్యతిరేకంగా మారి, ప్రభుత్వం పడిపోవడానికి కారణం అయిన వారిని అప్పటి స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. వారి శాసనసభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు, వారు ఎన్నికల్లో ఐదేళ్ల వరకూ పోటీ చేయకుండా నిషేధం విధించారు. అయితే దానిపై వారు కోర్టుకు వెళ్లారు.

కోర్టు మిశ్రమ తీర్పును ఇచ్చింది. ఫిరాయింపుకు గానూ వారి శాసనసభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని సమర్థించింది న్యాయస్థానం. అయితే వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించలేదు. వారు ఎన్నికల్లో పోటీచేసుకోవచ్చని, గెలిస్తే మళ్లీ ఎమ్మెల్యేలుగా-మంత్రులుగా  కావొచ్చని ప్రకటించింది.  ఇలాంటి నేపథ్యంలో వారంతా మూకుమ్మడిగా బీజేపీలోకి అధికారికంగా చేరినట్టేనని సమాచారం. 

అయితే వారు చేరడం పెద్ద కథ కాదు,  ఇప్పుడు బీజేపీ వాళ్లనూ, పాతవాళ్లను ఎలా బ్యాలెన్స్ చేసుకుంటుందనేది ఆసక్తిదాయకంగా మారింది. డిసెంబర్ ఐదున కర్ణాటకలో ఉప ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో  ఈ ఫిరాయింపుదారులకు ఆ ఉప ఎన్నికల టికెట్లను  కేటాయిస్తారా, లేక పార్టీలోని పాత కాపులు-వీరి చేతిలో ఓడిన వారికి టికెట్లు ఇస్తారా? అనేది ఆసక్తిదాయకంగా మారింది.

బీజేపీ హామీలతోనే తాము ఫిరాయించినట్టుగా కొందరు ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు కమలం పార్టీ వారికి టికెట్లు  కూడా ఇవ్వకపోతే వారి పరిస్థితి ఇరకాటంలో పడుతుంది. ఈ ఫిరాయింపుదారులకు టికెట్లు  ఇస్తే పార్టీలోని  పాత వాళ్లు హర్ట్ అవుతారు. ఇప్పటికే ఈ అంశంపై కర్ణాటక బీజేపీలో రచ్చ జరుగుతూ ఉంది.