యువి క్రియేషన్స్ సంస్థ మరోసారి ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురవుతోంది. సాహో సమయంలో ఇలాగే జరిగింది. రాధేశ్యామ్ విషయంలో మళ్లీ ఇలాగే జరుగుతోంది. 2022 సంక్రాంతికి రాధేశ్యామ్ విడుదల షెడ్యూలు అయి వుంది.
అదే టైమ్ లో ఆర్ఆర్ఆర్, బంగార్రాజ, భీమ్లా నాయక్, కాస్త ముందుగా పుష్ప, శ్యామ్ సింగ రాయ్ సినిమాల విడుదలలు వున్నాయి. ఆ సినిమాలు అన్నీ అప్ డేట్ లు, సాంగ్స్, గ్లింప్స్ ఇలా చకచకా దూసుకుపోతున్నాయి. పాటలు వైరల్ అయిపోతున్నాయి. పాత్రల పరిచయాలు జరిగిపోతున్నాయి.
కానీ ఒక్క రాధేశ్యామ్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వుంది. ఒకటి రెండు గ్లింప్స్ మినహా మరో కంటెంట్ లేదు. సోషల్ మీడియాలో అప్ డేట్ లేదు. ఫ్యాన్స్ అడిగి అడిగి విసిగి ఊరుకున్నారు. అసలు విడుదల వుంటుందా? ఉండదా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెల 10 నుంచి కంటెంట్ విడుదల స్టార్ట్ చేస్తామని యూనిట్ వర్గాలు తెలిపాయి. కానీ ఆ డేట్ దాటిపోయింది. మరో రెండు మూడు రోజులు పడుతుందని తెలిపాయి. కానీ ఆ డేట్ కూడా దాటిపోతోంది. గట్టిగా రెండు నెలలు లేదు. మరి యువి ఐడియా ఏమిటి అన్నది అంతు పట్టడం లేదు.
పుష్ప నుంచి మూడు పాటలు వచ్చాయి. శ్యామ్ సింగ రాయ్ టైటిల్ సాంగ్ వచ్చింది. భీమ్లా నాయక్ పబ్లిసిటీ పీక్స్ లో వుంది. ఆర్ఆర్ఆర్ నాటు.నాటు పాట మారు మోగుతోంది. రాధేశ్యామ్ కు చాలా దూరంగా విడుదల వున్న ఆచార్య పాటలు కూడా వచ్చాయి. కానీ రాధేశ్యామ్ యూనిట్ మాత్రం చలనం లేదు.
ప్రభాస్ ఇమేజ్ ను మరోసారి డామేజ్ చేస్తారేమో యువి జనాలు అని ఫ్యాన్స్ భయపడుతున్నారు.