సినిమా రంగం- ఇక్కడ ఇగోలు హర్టవ్వబడును

సినిమారంగంలో పేరొస్తున్న కొద్దీ పెరిగేది సంపాదన. దాంతో పాటూ పెరిగేది ఇంకొకటుంది. ఇగో.  Advertisement ఎప్పుడైతే తన విజయాలకి కారణం పూర్తిగా తానే అనుకుంటాడో అప్పుడే ఇగోకి బీజం పడుతుంది. చాలా త్వరగా మహావృక్షంలా…

సినిమారంగంలో పేరొస్తున్న కొద్దీ పెరిగేది సంపాదన. దాంతో పాటూ పెరిగేది ఇంకొకటుంది. ఇగో. 

ఎప్పుడైతే తన విజయాలకి కారణం పూర్తిగా తానే అనుకుంటాడో అప్పుడే ఇగోకి బీజం పడుతుంది. చాలా త్వరగా మహావృక్షంలా పెరిగిపోతుంది. 

తన చుట్టూ ఉన్నవాళ్లు తన ప్రాపకంలో బతుకుతున్నారన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. 

ఆ పరిస్థితిలో ఏళ్ల తరబడి కలిసి పనిచేసినవాళ్లనైనా సరే ఒక్క చెప్పుడు మాటతో దూరం పెట్టేయాలనిపిస్తుంది. అలా దూరం పెట్టించేది ఇగోనే. 

ఆ మధ్య సంగీత దర్శకుడు కోటి గతంలో జరిగిన ఒక విషయం చెప్పారు. తాను చిరంజీవిగారికి పనిచేసిన ఒక సినిమా వందరోజుల వేడుక జరుపుకుంటోంది. వేదిక ఒంగోలులో. ముందుగా కోటిగారు తన అత్తవారి ఊరైన నెల్లూరుకు చేరారు. అక్కడి నుంచి ఒంగోల్ దగ్గర కనుక మజిలీ చేసారు. కానీ అనుకోకుండా ఆయనకి జ్వరం వచ్చింది. కనుక వేడుకకి హాజరవ్వలేకపోయారు. అయితే, చిరంజీవి చుట్టూ ఉన్న కొందరు ఆయనకి ఏవో చెప్పుడు మాటలు మోసారు. అంతే..అప్పటి నుంచీ చిరంజీవి మళ్లీ కోటిగారికి మరొక సినిమా ఇవ్వలేదట. 

మరీ ఇంత సున్నితంగా ఉంటాయా విషయాలు అంటే…ఉంటాయి. ఈ రంగంలోని పరిస్థితులు అలాంటివి. చెప్పుడు మాటలు ఇగో అనే మంటకు తోడయ్యే గాలి లాంటింది. 

అలాగే మరొక సందర్భంలో మోహన్ బాబు కూడా ఇలాంటిదే చెప్పారు. చిరంజీవి సినిమా ఫ్లాపైతే తాను పార్టీ చేసుకున్నట్టుగా ఎవరో చిరంజీవికి మోసారట. అప్పటినుంచి చాలానాళ్లు తనపట్ల చిరంజీవి కినుకుతో ఉన్నట్టు మోహన్ బాబు చెప్పారు. 

నిజానికి ఎన్ని చెప్పుడు మాటలు విన్నా ఏవీ తెలియనట్టు బిహేవ్ చేస్తూ అత్మీయంగా ఉండేవాడే సిసలైన ప్రజ్ఞావంతుడు. చెప్పుడు మాటలు కాకుండా తాను స్వయంగా గమనించాలి. ఒకవేళ విన్నమాటలు నిజమే అయినా మనిషిని దూరం పెట్టకుండా మరింత దగ్గర చేసుకుంటే శత్రువవ్వాల్సిన వాడు కూడా మిత్రుడయ్యే అవకాశం ఎక్కువుంటుంది. 

ఈ కాలిక్యులేషన్ లో చిరంజీవి తప్పుతుంటారు. అందుకే ఆయన గొప్ప కళాకారుడయ్యారు తప్ప నాయకుడు కాలేకపోయారు. 

ఈ మధ్యన ప్రకాష్ రాజ్ ని మా ఎన్నికల్లో నిలబెట్టడం కూడా తొందరపాటు చర్యగానే చెప్పుకోవాలి. ఎటువంటి లెక్కలు వేసుకోకుండా దూకడం, భంగపడ్డాక సైలెంటయిపోవడం నిజమైన నాయకత్వ లక్షణం కాదు. 

ఇప్పుడు నాగార్జున విషయానికొద్దాం. నిజానికి మన్మధుడు సినిమాకి ఆర్పి పట్నాయక్ సంగీతం అందించాలి. కానీ సరిగ్గా అదే సమయానికి కాస్త్ బ్రేక్ తీసుకుని అమెరికాలో ఏదో తెలుగు సభల్లో ప్రోగ్రాం ఉంటే వెళ్లారట. అంతే ఆర్పీని పక్కన పెట్టేసి దేవీ శ్రీ ప్రసాద్ ని తీసేసుకున్నారు నాగార్జున. 

అలా ఆర్పీ కెరీర్ కి కామా పడడం, దేవీ శ్రీ ప్రసాద్ కెరీర్ కి స్టార్డం మొదలవడం జరిగిపోయాయి. 

ఇదిలా ఉంటే అదే దేవిశ్రీప్రసాద్ తో ఎన్నో సినిమాలకి పని చేసి ఈ మధ్యన త్రివిక్రం తన ఇగో కారణంగా పక్కన పెట్టేసారు. 

ఒక సినిమాకి దేవీ మ్యూజిక్ చెయ్యాల్సి ఉండగా త్రివిక్రం చెన్నై వెళ్లారు. ఆయన్ని వెంటనే కలవలేకపోయారు దేవీ. ఉదయం నుంచి సాయంత్రం దాకా దేవీ కోసం హోటల్ రూములో వెయిట్ చేయాల్సి రావడం త్రివిక్రం కి నచ్చలేదు. మయసభలో దుర్యోధనుడి ఇగో హర్టైన రేంజులో భంగపడి ఆయన వెంటనే దేవీకి రెడ్ సిగ్నల్ వేసేసి, తమన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. 

అలా త్రివిక్రం తో దేవీ జర్నీకి చుక్క పడిపోయింది. తమన్ కి కలిసొచ్చింది. 

ఇగో హర్ట్ చేయకుండా జాగ్రత్తపడుతూ ఉన్నంతకాలం తమన్ కి ఈ ప్రయాణం కొనసాగుతుంది. 

ఇలాంటివి సినిమారంగంలో కోకొల్లలు. పైన చెప్పుకున్నవి మచ్చుకు కొన్ని మాత్రమే. 

ఇక్కడ ఏ బంధాన్నీ టేకిట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోకూడదు. 

పెద్ద స్థాయిలో పరిస్థితులు ఇలా ఉంటే చిన్న స్థాయిలో మరింత ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఎవరూ పై వారి ఇగోని హర్ట్ చేయకూడదు. అలాగని కింది వారిని హర్ట్ చేయొచ్చని కాదు. చూస్తుండాగానే కింది వాడు పైకెళ్లి కూర్చోవచ్చు. గతం గుర్తుపెట్టుకుంటే తన స్థాయిలో అవకాశాలు రాకుండా ఆపగలడు.

అందుకే ఇక్కడ నోరు, ఒళ్లు అదుపులో పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు చెప్పుడుమాటలకి తావు లేకుండా జాగ్రత్తపడాలి. మూడో వ్యక్తి ఏదో మోసే లోపు ప్రమాదాన్ని గ్రహించి ముందుగానే చెయాల్సిన వారికి సరిగ్గా కమ్యూనికేట్ చెయ్యాలి. 

ఇది సినిమా రంగం. ఇక్కడ ఇగోలు హర్టవ్వబడును. రిపేర్ చేయబడవు. 

గ్రేట్ ఆంధ్రా బ్యూరో