సోష‌ల్ మీడియాలో పురందేశ్వ‌రిపై చాకిరేవు!

ఏపీ బీజేపీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రికి కాసింతైనా ఆత్మ‌సాక్షి లేద‌నే విమ‌ర్శ వెల్లువెత్తుతోంది. పురందేశ్వ‌రికి రాజ‌కీయ స్వార్థం త‌ప్ప‌, మ‌రే ఇత‌ర విలువ‌లు అవ‌స‌రం లేద‌న్న‌ట్టు రాజ‌కీయంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని సొంత పార్టీ నేత‌లు సైతం…

ఏపీ బీజేపీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రికి కాసింతైనా ఆత్మ‌సాక్షి లేద‌నే విమ‌ర్శ వెల్లువెత్తుతోంది. పురందేశ్వ‌రికి రాజ‌కీయ స్వార్థం త‌ప్ప‌, మ‌రే ఇత‌ర విలువ‌లు అవ‌స‌రం లేద‌న్న‌ట్టు రాజ‌కీయంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని సొంత పార్టీ నేత‌లు సైతం విమ‌ర్శిస్తున్నారు. తాజాగా రాహుల్‌గాంధీపై పురందేశ్వ‌రి ట్విట‌ర్ వేదిక‌గా చేసిన విమ‌ర్శ‌పై నెటిజ‌న్లు తీవ్ర‌స్థాయిలో మండిప‌డుతున్నారు. చేసిన సాయాన్ని మ‌రిచి, విమ‌ర్శ‌లు చేయ‌డ‌మేనా హిందూ ధ‌ర్మం నుంచి మీరు నేర్చుకున్న‌ద‌ని పురందేశ్వ‌రిని నిలదీస్తున్నారు. సోష‌ల్ మీడియాలో ఆమెపై నెటిజ‌న్లు బాదుడే బాదుడు.

సనాత‌న ధర్మంపై త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి ఉద‌య‌నిధి స్టాలిన్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌ను అడ్డు పెట్టుకుని బీజేపీ రాజ‌కీయంగా ల‌బ్ధి పొందేందుకు దేశ వ్యాప్తంగా పెద్ద ఉద్య‌మాన్ని న‌డుపుతోంది. ఈ నేప‌థ్యంలో ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వ‌రి కూడా ఉత్సాహంగా ట్వీట్ చేశారు. అందులో రాహుల్‌పై ఆమె విమ‌ర్శ చేయ‌డంతో నెటిజ‌న్లు చీవాట్లు పెడుతున్నారు.

‘భారత రాజ్యాంగం ద్వారా ప్రమాణం చేసిన మంత్రి ఉదయ్‌స్టాలిన్, సనాత‌న ధర్మాన్ని దోమల నిర్మూలన చర్యతో పోల్చి నిర్మూలించాలని తన ఆకాంక్షను వ్యక్తం చేయడం హేయమైన చర్య. రాజ్యాంగ విరుద్ధం. అదే వేదికపై, తమిళనాడులోని హిందూ మతపరమైన మరియు ధర్మాదాయ సంస్థలకు బాధ్యత వహించే పీకే శేఖర్‌బాబు ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా మౌనంగా ఉండడం దేనికి సంకేతం. సనాతన ధర్మాన్ని విచ్ఛిన్నం చేయడమే కూటమి ఉద్దేశమని ఐఎన్‌సీటీ తమిళనాడు అధ్యక్షుడు పేర్కొన్నారు. ఈ చర్యలు భారతదేశంలోని హిందూ సమాజాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. విపక్ష కూటమి ఇండియా అని పేరు పెట్టుకోవడానికి కనీస నైతిక హక్కు కూడా వీరికి లేదు. 2010 సంవత్సరంలో హిందూ సంస్ధలను లష్కరే తొయిబా సంస్ధతో రాహుల్ గాంధీ పోల్చి మాట్లాడడం అత్యంత దారుణమని’ అని పురందేశ్వరి ట్వీట్ చేశారు.

ఉద‌య‌నిధి స్టాలిన్‌పై పురందేశ్వ‌రి ఎలాంటి కామెంట్స్ చేసినా ఎవ‌రికీ అభ్యంత‌రం ఉండాల్సిన అవ‌స‌రం లేదు. కానీ రాహుల్‌గాంధీ 2010లో హిందూ సంస్థ‌ల‌ను ల‌ష్క‌రే తొయిబా సంస్థ‌తో పోల్చి మాట్లాడ్డం దుర్మార్గ‌మ‌ని పురందేశ్వ‌రి నేడు విమ‌ర్శించ‌డ‌మే ఆమె పచ్చి అవ‌కాశ వాదానికి నిద‌ర్శ‌న‌మ‌ని నెటిజ‌న్లు తూర్పార‌ప‌డుతున్నారు. 2009లో విశాఖ నుంచి లోక్‌స‌భ స్థానానికి కాంగ్రెస్ త‌ర‌పున ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి గెలుపొందారు.

2010లో పురందేశ్వ‌రి కేంద్రంలో మంత్రిగా ఉన్న సంగ‌తిని ఆమెకు ప‌లువురు గుర్తు చేస్తున్నారు. ఆనాడే రాహుల్ కామెంట్స్‌ను ఖండించి, మంత్రి ప‌ద‌వికి ఎందుకు రాజీనామా చేయ‌లేద‌ని నిల‌దీస్తున్నారు. అధికారం ఎక్క‌డుంటే అక్క‌డ వుంటూ, రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకోగానే మ‌రో పార్టీలో చేరాల‌ని హిందూ ధ‌ర్మం చెప్పిందా పురందేశ్వ‌రి అని నెటిజ‌న్లు నిల‌దీస్తున్నారు. కేంద్ర మంత్రిగా అవ‌కాశం క‌ల్పించిన రాహుల్‌గాంధీని విమ‌ర్శించ‌డానికి మ‌న‌సెలా వ‌చ్చింద‌మ్మా పురందేశ్వ‌రి అంటూ ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం.