'వయసు మీద పడి, సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయి. ఇప్పుడు కమల్ హాసన్ రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనకు ప్రజా బలమే ఉంటే ఎందుకు ఉప ఎన్నికల్లో పోటీ చేయలేదు? ఇలా రాజకీయాల్లోకి వచ్చే సినిమా వాళ్లకు శివాజీ గణేషన్ కు పట్టిన గతే పడుతుంది..' అంటూ తమిళనాడు సీఎం పళని స్వామి వ్యాఖ్యానించడం అక్కడ దుమారం రేపుతూ ఉంది.
ఒకే మాటతో అటు కమల్ హాసన్ ను విమర్శించడంతో పాటు, ఇటు దివంగత శివాజీ గణేషన్ మీదా పళనిస్వామి విమర్శలు చేసినట్టుగా అయ్యింది. తమిళనాట రాజకీయాల్లో ఫెయిల్ అయిన సినీ నటుల్లో శివాజీ గణేషన్ ఒకరు. ఎంజీఆర్ రాజకీయాల్లో సూపర్ హిట్ కాగా, శివాజీ గణేషన్ ఫ్లాప్ అయ్యారు. అయితే నటుడిగా శివాజీ పేరు ఎప్పటికీ తమిళనాట మార్ముగుతూనే ఉంటుంది. ఇప్పటికీ రజనీ , కమల్ లు కూడా 'శివాజీ' పేరే చెప్పుకుంటూ ఉంటారు. ఆయన తమకు తండ్రిలాంటి వారని అంటూ ఉంటారు.
అలాంటి శివాజీ గురించి ఏ ప్రజానేతో విమర్శిస్తే అదో లెక్క. జయలలిత మరణంతో, శశికళ బంటుగా సీఎం అయిన వ్యక్తి పళనిస్వామి. ఈ పళనిస్వామి ఇప్పుడు బీజేపీకి బంటుగా ఉన్నారు. ఈయన ఎలాంటి పరిస్థితుల్లో సీఎం అయ్యారో, ఎలా సీఎం అయ్యారో అందరికీ తెలిసిన సంగతే. అలాంటి వ్యక్తి ఇలాంటి విమర్శలు చేయడంతో వివాదంగా మారుతూఉంది.
శివాజీగణేషన్ గురించి మాట్లాడే అర్హత పళనిస్వామికి లేదని, 'సీఎం కాక ముందు ఈయనెవరో తెలీదు, వాళ్ల కాళ్ల మీదా, వీళ్ల కాళ్ల మీదా పడి సీఎం అయిన వ్యక్తి పళని స్వామి. ఈయన పదవి నుంచి దిగిపోతే పట్టించుకునే వారు ఉండరు, ఎవరికీ ఈయన గుర్తు కూడా ఉండరు. అయితే శివాజీ గణేషన్ ను ప్రజలు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు..' అంటూ విమర్శలు వస్తున్నాయి.
మొత్తానికి కమల్ ను విమర్శించబోయి శివాజీ గణేషన్ ప్రసక్తి ఎత్తి రాంగ్ బటన్ నొక్కినట్టుగా ఉన్నాడు పళనిస్వామి. ఎంజీఆర్ పెట్టిన పార్టీ ద్వారా, జయలలిత వంటి సినీ నటి నడిపించిన పార్టీ ద్వారా జాక్ పాట్ గా సీఎం అయిన పళని ఇలా మాట్లాడటం విడ్డూరమే!