పాపం షర్మిల.. తెకాంగ్రెస్‌లో ఆడుకుంటున్నారు!

వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైయస్ షర్మిల తండ్రి పేరుతో తాను ప్రారంభించిన రాజకీయ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడానికి సిద్ధపడ్డారు. అందుకు ప్రతిగా తనకు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో కూడా ఈ…

వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైయస్ షర్మిల తండ్రి పేరుతో తాను ప్రారంభించిన రాజకీయ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడానికి సిద్ధపడ్డారు. అందుకు ప్రతిగా తనకు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో కూడా ఈ పాటికి ఒక నిర్ణయానికి వచ్చే ఉంటారు. అయితే తెలంగాణ కాంగ్రెసు పార్టీలో ఆమెను ఎంతమేరకు రిసీవ్ చేసుకుంటున్నారనేది మాత్రం సందేహాస్పదంగానే ఉంది. 

తెలంగాణ కాంగ్రెస్ లోని అనేకమంది సీనియర్లు ఆమె ఈ రాష్ట్రంలోని రాజకీయాల్లోకి రావడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా రేణుకాచౌదరి చేసిన వెటకారాలు గమనిస్తే.. అయ్యో పాపం షర్మిల అనిపించకమానదు.!

కాంగ్రెసు పార్టీ నాయకుల్లో నోటిదూకుడుకు పేరుపడిన రేణుకాచౌదరి, గాంధీభవన్ వద్ద షర్మిల ప్రస్తావన తెచ్చినప్పుడు చాలా వెటకారంగా, చులకనగా మాట్లాడారు. తెలంగాణ కోడలిని అనే సంగతి షర్మిలకు ఇప్పుడు గుర్తుకువచ్చిందా? అని ఆమె ప్రశ్నించారు. తాను కూడా ఏపీకి కోడలినేనని, ఏపీ మీద తనకు ఎంత హక్కుఉందో, తెలంగాణ మీద షర్మిలకు కూడా అంతే హక్కు ఉన్నదని రేణుకాచౌదరి చెప్పుకొచ్చారు.

పాలేరులో షర్మిల పోటీచేయాలనుకున్న సంగతి గురించి విలేకరులు పదేపదే ప్రస్తావించినప్పుడు కూడా రేణుకా చౌదరి చాలా తీవ్రంగానే సమాధానాలు చెప్పారు. పాలేరు ఆమె పోటీచేయాలనుకుంటే సరిపోతుందా, షర్మిల ఒక్కరేనా? ఇంకా ఎవరైనా ఉన్నారా? అంటూ వెటకారంగా మాట్లాడారు. షర్మిల తానుగా సోనియా, రాహుల్ వద్దకు వెళ్లి అడిగింది గానీ.. సీటు ఇవ్వడం గురించి వాళ్లు ఏమైనా చెప్పారా అంటూ ఆమె ప్రశ్నించారు. తెలంగాణలో షర్మిల పోటీ చేయడం గురించి అధిష్ఠానం ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని అనడం గమనార్హం.

మరో కోణంలోంచి చూసినప్పుడు.. ఒకవేళ పార్టీని విలీనం చేయడం అంటూ జరిగితే.. ఎవరితో అయితే షర్మిల కలిసి పనిచేయాల్సి ఉంటుందో వారినుంచి ఎదురవుతున్న ప్రతిఘటన తీవ్రంగా ఉంటోంది. ఇలాంటి వారితో ఆమె భవిష్యత్తు ఎలా సాగుతుందో కదా అనిపిస్తోంది. 

ఒకవేళ షర్మిల ను కాంగ్రెసులో కలుపుకోవడానికి, ఆమెకు ప్రాధాన్యం ఇవ్వడానికి అధిష్ఠానం సుముఖంగా ఉంటే గనుక.. ఆమె గురించి చులకనగా మాట్లాడకుండా తమ పార్టీ స్థానిక నాయకుల నోటికి అడ్డుకట్ట వేయలేకపోయిందా? అనే అభిప్రాయం కూడా పలువురిలో వ్యక్తం అవుతోంది.