వైకాపా కు ఆంగ్లంపై అంత మోజు వుంటే తిరుపతి వెంకన్న సుప్రభాతం కూడా ఆంగ్లంలో చెప్పించాలి అంటూ ఎద్దేవా చేసారు పవన్ కళ్యాణ్. చిత్రమేమిటంటే, వెంకన్న సుప్రభాతం తెలుగులో లేదు. సంస్కృతంలో వుంది. వేదమంత్రాలు ఏవీ తెలుగులో లేవు. అన్నీ సంస్కృతంలోనే వున్నాయి.
ఇంకా పవన్ కు తెలియాల్సింది ఏమిటంటే, ప్రపంచ జనాలకు తెలిసేలా మన వేదాల్లోని భాగాలు, ఉపనిషత్తులు, మంత్రాలు, వాటా అర్థాలు అన్నీ ఏనాడో ఆంగ్లంలోకి అనువదిస్తూ, సవివరంగా వివరిస్తూ పుస్తకాలు వచ్చాయి. వాటిని ఆంగ్లభాష మాత్రమే తెలిసిన విదేశీయులు అక్కున చేర్చుకున్నారు. ఆంగ్లంలోకి మార్చడం అంటే అవమానించడం కాదు, మరింత విస్తృతి, ప్రాచుర్యం కలిగించడం.
భాషా ప్రయోక్త రాష్ట్రాలు అన్నది దేశంలో రాష్ట్రాల ఏర్పాటుకు తీసుకున్న ఓ ప్రాతిపదిక మాత్రమే. అంతే తప్ప, ఆ రాష్ట్రంలో మరో భాష వుండకూడదని కాదు. అలా అనుకుంటే అది అవమానం అవుతుంది. లేదూ అలాగే వుండాలనుకుంటే, హిందీ మాత్రమే మాట్లాడే రాష్ట్రాలు అన్నీ కలిపేసి ఒకటి చేయాల్సి వుంటుంది. తెలంగాణ ఏర్పాటు ఎలా అయింది. ప్రాంతీయ ప్రాతిపదికగా జరిగింది. ఉత్తర భారతంలో కొత్త రాష్ట్రాలు ఎలా ఏర్పాటు అయ్యాయి. ప్రాంతీయత ప్రాతిపదికగా ఏర్పాటు అయ్యాయి. అందువల్ల భాషా ప్రయోక్త రాష్ట్రం కాబట్టి తెలుగు తప్ప మరోటి వుండకూడదనే వాదన సరికాదు.
మీ పిల్లలు ఏ భాషలో చదువుతున్నారు అని అడగడం కూడా సంస్కార హీనం అయితే తెలుగునాట జనాలు ఎవ్వరూ ఎవ్వరినీ పలకరించకూడదు. ఎందుకంటే ఏ ఇద్దరు వ్యక్తులు వారు బంధువులు అయినా, స్నేహితులు అయినా ఎదురు పడితే వేసుకునే మొదటి ప్రశ్న, పిల్లలు ఏం చదువుతున్నారు? ఎక్కడ చదువుతున్నారు? అనే. జగన్ అడిగింది కూడా అదే వెంకయ్యగారి మనవలు, చంద్రబాబు మనవడు, పవన్ పిల్లలు ఏ స్కూలులో చదువుతున్నారు అనే. దానికే సంస్కారం లాంటి పెద్ద పదాలు పవన్ మాట్లాడడం చాలా చిత్రంగా వుంది.