'పాము శివుడి మెడలో ఉన్నంత వరకే దానికి విలువ, జగన్ మోహన్ రెడ్డి పరిస్థితి రేపు అటూ ఇటూ అయితే మీ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోండి..' ఇదీ ఏపీలోని అధికార పార్టీలోని ఎమ్మెల్యేలను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్య. ప్రజలు ఎన్నుకున్న నూటా యాభై ఒక్క ఎమ్మెల్యేలను ఉద్దేశించి పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్య చేశారు!
ఇంతకీ పవన్ కల్యాణ్ ఈ మాట ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? అనేది ప్రశ్న! పవన్ కల్యాణ్ ఏ పార్టీ వాళ్లను ఉద్దేశించి ఈ వ్యాఖ్య చేశారనే సంగతిని పక్కన పెడితే, ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేను ఉద్దేశించి ఆయన ఈ మాట అన్నారు.
'రేపు జగన్ పరిస్థితి అటూ ఇటూ అయితే..' అంటూ పవన్ మాట్లాడారు, దీని వెనుక ఉద్దేశం ఏమిటో, జగన్ కు ఏమవుతుందో కూడా పవన్ కల్యాణ్ చెప్పాల్సి ఉంది. ఒకవైపు నీతులు చెబుతూనే, మరోవైపు పవన్ ఇలా ఒక వీధి రౌడీలా మాట్లాడారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ఎమ్మెల్యేలకు పవన్ కల్యాణ్ వార్నింగులు ఇవ్వడం, వాళ్లంతా రెచ్చిపోతున్నారని అనడం పవన్ కల్యాణ్ సంస్కారాన్ని చాటుతోంది. తను సంస్కారిని అని చెప్పుకునే పవన్ కల్యాణ్ ఫక్తు రౌడీ మాటలు మాట్లాడటం గమనార్హం. తనను విమర్శించే వాళ్లంతా రెచ్చిపోయి మాట్లాడినట్టుగా అనిపిస్తోంది పవన్ కల్యాణ్ కు. అయితే తను చేసే విమర్శలు ఎలా ఉంటాయో, తన మాటలు ఎలా ఉంటాయో పవన్ కు అర్థం కాదు కాబోలు. అందుకే నల్లగురివింద తన నలుపు ఎరగదు అని అన్నారు పెద్దలు!