ఛత్తీస్‌గఢ్‌ బాటలోనే ఆంధ్రప్రదేశ్‌…?

ఛత్తీస్‌గఢ్‌ బాటలో ఆంధ్రప్రదేశ్‌ నడవడమేమిటి? ఏపీ ఏ విషయంలో ఆ రాష్ట్రాన్ని అనుసరించాలి? ఏపీ దాన్ని ఆదర్శంగా తీసుకునేటంతటి గొప్ప రాష్ట్రామా? …ఇలాంటి చాలా ప్రశ్నలు మనకు ఎదురవుతాయి. నిజానికి ఛత్తీస్‌గఢ్‌కు, ఏపీకి పోలికే…

ఛత్తీస్‌గఢ్‌ బాటలో ఆంధ్రప్రదేశ్‌ నడవడమేమిటి? ఏపీ ఏ విషయంలో ఆ రాష్ట్రాన్ని అనుసరించాలి? ఏపీ దాన్ని ఆదర్శంగా తీసుకునేటంతటి గొప్ప రాష్ట్రామా? …ఇలాంటి చాలా ప్రశ్నలు మనకు ఎదురవుతాయి. నిజానికి ఛత్తీస్‌గఢ్‌కు, ఏపీకి పోలికే లేదు. కాని ఓ విషయంలో తెలుగు రాష్ట్రం ఛత్తీగఢ్‌ మాదిరిగానే అవుతుందేమోనని సందేహం. ఆ సబ్జెక్టు పేరు రాజధాని నగరం. తెలుగు రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు అప్పటి కేంద్ర ప్రభుత్వం హైదరాబాదును పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించింది. ఏపీ పరిపాలన ఆ రాష్ట్రం నుంచే జరుగుతున్నప్పటికీ విభజన చట్ట ప్రకారం హైదరాబాదు ఉమ్మడి రాజధానిగానే ఉంది. పదేళ్లలో రాజధాని నగరం (హైదరాబాదు అంతటి మహానగరం కాకపోయినా అధికారికంగా రాజధాని) ఏర్పడుతుందని, అప్పటివరకు హైదరాబాదును వినియోగించుకుంటారని కేంద్రం భావించింది. 2024తో ఆ గడువు పూర్తవుతుంది. ఆ గడువులోగా రాజధాని నగరం ఏర్పడుతుందా? అనేది సందేహమే.

రాజధాని నగరం ఎక్కడ నిర్మిస్తే బాగుంటుందో సిఫార్సు చేయడానికి కేంద్రం శివరామకృష్ణన్‌ కమిటీని నియమించడం,ఆ కమిటీ నివేదికను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరస్కరించడం, అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడం, ఆ తరువాత రాజధాని నగరం నిర్మాణం పేరుతో ఎన్నో కథలు నడిపించడం, ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించడం…వగైరా తెలిసిందే. 'రోమ్‌ నగరం ఒక్కరోజులో నిర్మించబడలేదు' అనే కొటేషన్‌ పాపులర్‌. అసలు ఏ నగరమూ బహ్మ్రాండంగా నిర్మించడం జరగదు. కాని చంద్రబాబు ఐదేళ్లలోనే బ్రహ్మాండమైన రాజధాని నిర్మిస్తానని ఊదరగొట్టి మూడు నాలుగు భవనాలు నిర్మించి పదవి నుంచి దిగిపోయారు. జగన్‌ ముఖ్యమంత్రి కాగానే కథ మొదటికి వచ్చింది. ఏపీ రాజధాని ఎక్కడ నిర్మిస్తారనే చర్చ సాగుతోంది.

ఇందుకోసం వేసిన కమిటీ ప్రస్తుతం ప్రజాభిప్రాయ సేకరణ జరుపుతోంది. పాలకుల నిర్వాకం కారణంగా ఏపీ దేశంలోనే రాజధాని నగరం లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. అమరావతి రాజధానిగా ఉంటుందో లేదో తెలియకపోయినా చంద్రబాబు కారణంగా దాని పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పటికీ ఏపీ రాజధాని అధికారికంగా హైదరాబాదే. పదేళ్ల గడువు ముగిసేలోగా రాజధాని నగరాన్ని అధికారికంగా ప్రకటించగలరా? అమరావతి అనే నగరం నిర్మించకపోయినా చంద్రబాబు తన టెక్నిక్‌లతో దాన్ని ఏపీ రాజధానిగా ప్రపంచ దేశాల్లో ప్రచారం చేశారు.  అమరావతి రాజధాని అనేది ప్రచారమే తప్ప అధికారికంగా రాజధాని కాదు. ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇస్తేనే అధికారికంగా చెల్లుబాటవుతుంది. కాని బాబు ఆ పని చేయలేదు. ఎందుకంటే…ఒకసారి గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేస్తే హైదరాబాదు మీద హక్కులు కోల్పోతారు. 

ఓటుకు నోటు కేసు కారణంగా పరిపాలన ఏపీ నుంచి ప్రారంభించినా హైదరాబాదు మీద హక్కులు వదలుకోదల్చుకోలేదు. అందుకు అమరావతిని రాజధానిగా ప్రచారం చేసినా గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. బాబు అధికారంలో ఉన్నంత కాలం సమస్త  అధికారిక ఉత్తరప్రత్యుత్తరాలు హైదరాబాదు చిరునామాగానే జరిగాయి. ఇప్పుడు జగన్‌ హయాంలోనూ ఇదే కొనసాగుతోంది.  కొంతకాలం కిందట మంత్రి బొత్స సత్యనారాయణ 'ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధాని మనకు అవసరం లేదు. అది సాధ్యం కూడా కాదు. ఓ మంచి రాజధాని ఉంటే చాలు. రాజధానిపై నిపుణుల కమిటీ నివేదిక రాగానే దాని సిఫార్సుల ప్రకారం నిర్మాణం చేపడతాం'..అని చెప్పారు. అత్యుత్తమం కాకపోయినా ఓ మోస్తరు రాజధాని నగరమైనా జగన్‌ పాలనలో పూర్తవుతుందా? 2000 సంవత్సరంలో ఉత్తరాఖండ్‌, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. మధ్యప్రదేశ్‌ నుంచి విడిపోయిన ఛత్తీస్‌గఢ్‌ రాజధాని నయా రాయ్‌పూర్‌. దీన్ని రాజధాని నగరంగా అధికారికంగా 2012లో ప్రకటించారు. 

అంటే రాష్ట్రం ఏర్పడిన పన్నెండేళ్లకు అధికారిక రాజధాని ఏర్పడింది. ఏపీలోనూ ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందేమోనని సందేహం. రాష్ట్రం విడిపోయినప్పుడు హైదరాబాదులో స్థిరపడిన ఆంధ్రులంతా పోలోమని ఆంధ్రాకు వెళ్లిపోతారని కొందరు అనుకున్నారు. కాని ఎన్నికల సమయంలో ఓట్లు వేయడానికి, సంక్రాంతి పండుగ జరుపుకోవడానికి తప్ప ఆంధ్రాలో స్థిరపడేందుకు ఎవ్వరూ వెళ్లడంలేదు.  ఆంధ్రాకు వస్తే 'స్థానికత' ఇస్తామని బాబు ఎన్నిసార్లు  విజ్ఞప్తి చేసినా పెద్దగా స్పందన రాలేదు. రాష్ట్ర విభజన తరువాత హైదరాబాదు పని అయిపోతుందని , రియల్‌ ఎస్టేట్‌ ఢమాల్‌ అంటుందని కొందరు ఏపీ వీరాభిమానులు ఊహించారు. కాని విభజన తరువాత కూడా ఏపీ నుంచి హైదరాబాదుకు వలసలు పెరిగాయిగాని తగ్గలేదు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఇంకా పెరిగిపోయింది. రకరకాల కారణాలతో హైదరాబాదులోనే స్థిరపడటానికి ఏపీ ప్రజలు మొగ్గు చూపుతున్నారు.