భారతీయ జనతా పార్టీ గురించి.. ప్రస్తుతం వారితో తాజాగా సున్నం పెట్టుకున్న శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ కొన్నిరోజుల కిందట ఒక కామెంట్ చేశారు. ‘భాజపాది అహంకారం’ అని ఆయన అన్నారు. కేవలం మహారాష్ట్ర పరిణామాల విషయంలో మాత్రమే అనుకోనక్కర్లేదు.. ఇప్పుడు తాజాగా జార్ఖండ్ లో ముదురుతున్న సీట్ల పంపకం సంక్షోభం కోణంలోంచి చూసినప్పుడు కూడా.. ఆ మాట నిజమే అనే అనిపిస్తోంది. కేంద్రంలో తాము అధికారంలో ఉన్నాం గనుక, రాష్ట్రాల్లో తమకు బలం లేని చోట్ల కూడా తామే అధికారాన్ని చెలాయించాలని, సీఎం కుర్చీ తమకే దక్కాలని ఆశ పడడడమే తమ శైలిగా భాజపా ప్రవర్తిస్తోంది.
మహారాష్ట్రలో భాజపా-శివసేన లది సుదీర్ఘమైన బంధం. ఇప్పుడు తమను ‘ఇగ్నోర్’ చేయలేనంత గణనీయమైన సీట్లను శివసేన సంపాదించుకుంది. వారు లేకుండా ప్రభుత్వమే సాధ్యం కాదు. అలాంటప్పుడు వారికి సీఎం సీటును కొంతకాలం పంచితే వచ్చే నష్టమేంటి? అని అందరికీ అనిపిస్తుంది. కానీ.. భాజపా అందుకు ఒప్పుకోలేదు. తొలి రెండున్నర సంవత్సరాలు వారు అడిగినప్పుడు అలాకాకుండా, మలి విడతలోనో లేదా.. ఏదో ఒక ఏడాది పాటో సీఎంకుర్చీ ఇస్తాం అని బేరాలాడి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో? కానీ.. భాజపా భీష్మించుకోవడం వల్ల.. ఇంకా ప్రభుత్వమే ఏర్పడలేదు.
ఇదే తరహా బలం చాలకపోయినా అధికారం, పెత్తనం కోసం ఆశపడే శైలిని భాజపా జార్ఖండ్ లో కూడా ప్రదర్శిస్తోంది. అక్కడ మొత్తం 81 సీట్లు ఉన్నాయి. భాజపా భాగస్వామ్య పక్షాలకు అడిగినన్ని సీట్లు ఇవ్వకుండా.. వారు ఎట్టి పరిస్థితుల్లోనూ తోకజాడించకుండా ఉండేలా పరిమితంగా కేటాయించడానికే మొగ్గు చూపుతోంది.
అక్కడ 81 సీట్లుండగా భాజపా 72 సీట్లలో పోటీచేసి 37 గెలిచింది. రెండు భాగస్వామ్య పార్టీలకు ఏజేఎస్‌యూకు 8, ఎల్జేపీకి 1 ఇచ్చింది. ఇప్పుడు కూడా తాము 72లోనే పోటీచేయాలనేది భాజపా ఆలోచన. వీరితో వేగలేక గతంలో ఆ ఒక్కసీటులోనూ ఓడిపోయిన ఎల్జేపీ ఈసారి మొత్తం 81 స్థానాలకు ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించింది. ఏజేఎస్‌యూకు 9కి మించి ఇవ్వనని భాజపా పట్టుబట్టడంతో పీటముడి బిగుసుకుంటోంది.
భాజపా ఒంటెత్తు పోకడలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. స్థానిక పార్టీలను పూర్తిగా తొక్కేసి అధికారం పూర్తిగా తమచేతిలో ఉండాలన్నదే వారి కోరిక. అయితే గతంలో కలిసి బరిలోకి దిగిన స్థానిక పార్టీలను ఈసారి దూరం చేసుకుంటే.. మళ్లీ విజయం రిపీట్ అవుతుందా లేదా కూడా సందేహమే. ఈ ఒంటెత్తు పోకడలతో, రాజీ లేని అధికార వాంఛలతో వారి ప్రస్థానం ఎటు సాగుతుందో చూడాలి.