నిర్మాణంలో ప్రభుత్వాల జోక్యం లేకుండా చేయాలి

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి బాధ్యత వహించాల్సిన ట్రస్ట్ రూపకల్పనకు అప్పుడే కసరత్తు మొదలైనట్లుగా వార్తలు వస్తున్నాయి. గుడిని నిర్మించేందుకు ట్రస్ట్ ఏర్పాటు చేయడంకోసం కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు మూడునెలల గడువు ఇచ్చింది. కానీ..…

అయోధ్యలో రామాలయ నిర్మాణానికి బాధ్యత వహించాల్సిన ట్రస్ట్ రూపకల్పనకు అప్పుడే కసరత్తు మొదలైనట్లుగా వార్తలు వస్తున్నాయి. గుడిని నిర్మించేందుకు ట్రస్ట్ ఏర్పాటు చేయడంకోసం కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు మూడునెలల గడువు ఇచ్చింది. కానీ.. అంతకంటె ముందుగానే ట్రస్ట్ ఏర్పాటు కాగల అవకాశం ఉంది.

అయితే నిర్మాణం విషయంలో అటు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంగానీ, కేంద్ర ప్రభుత్వం గానీ ఏమాత్రం జోక్యం చేసుకోకుండా ఉండేలా ఏర్పాటు ఉండాలి. తద్వారా.. మేం రామమందిరం నిర్మించాం.. అని చెప్పుకునే అధికారం ఏ ఒక్క పార్టీకో దక్కకూడదు.

రాముడు భారతజాతి ఆధ్యాత్మిక ఔన్నత్యానికి చిహ్నం కావొచ్చు. ఆధ్యాత్మికంగా కాకపోయినా.. ఒక ఆదర్శనీయ వ్యక్తిత్వం కావొచ్చు. అయోధ్యలో రామాలయం ఉండాలనేది దేశంలోని హిందువులందరి మనోభావం కావొచ్చు. నిజంగానే.. రాముడి అంశానికి రాజకీయ పార్టీ లేకపోవచ్చు. అందుకు నిదర్శనంగానే.. రామాలయ నిర్మాణాన్ని తాము సమర్థిస్తామని కాంగ్రెస్ కూడా ప్రకటించింది.

కానీ దౌర్భాగ్యం ఏంటంటే.. రాముడిని రాజకీయంగా తమ ట్రంపు కార్డులా వాడుకోవడం భారతీయ జనతా పార్టీకి అలవాటు అయిపోయింది. రాముడు వారికి హిందూ ఓటు బ్యాంకు ను దోచిపెట్టే వ్యక్తిగా తయారుచేసుకున్నారు. ఇటు తీర్పు రాగానే.. మా హయాంలో రామాలయం కట్టామనేదే వచ్చే ఎన్నికల్లో మా ప్రచారాంశం అవుతుంది అంటూ కొందరు దూకుడుగా మాటలు చెప్పారు కూడా.

ఇలాంటి పరిస్థితి ఏర్పడకూడదు. రామాలయ నిర్మాణం జరిగినా సరే.. అది భారతీయ జనతా పార్టీ లేదా నరేంద్రమోడీ దయాదాక్షిణ్యాల వలన జరిగిందనే భావన దేశప్రజల్లో ఏర్పడకూడదు. ఆ ఆలయంలో రాముడిని దర్శించుకోవాలంటే.. కాంగ్రెస్ మరియు భాజపాయేతర పార్టీలు అసహ్యించుకునే పరిస్థితి ఏర్పడకూడదు.

అందుకే.. ఆలయ నిర్మాణంలో యూపీ, కేంద్రంలలో ఉన్న భాజపా ప్రభుత్వాల పాత్ర లేకుండా చూస్తే బాగుంటుంది. రాముడిని ఏ ఒక్కరూ తమ మనిషిగా మార్చుకోకుండా ఉన్నప్పుడే.. ఆధ్యాత్మిక వాతావరణ బాగుంటుంది. రాజకీయ దుమారం రేగకుండా ఉంటుంది. భాజపా ఈ విషయంలో దురాశలకు పోకుండా సంయమనం పాటించాలి.