మహారాష్ట్రలో.. బీజేపీ మార్కు ‘మహా’ సంక్షోభం.!

మహారాష్ట్ర రాజకీయాల్లో ఎప్పటికప్పుడు సమీకరణాలు మారిపోతున్నాయి. బీజేపీ – శివసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేసినా, ఎన్నికల ఫలితాల తర్వాత పదవీ పంపకాలపై శివసేన మెలిక పెట్టింది.  Advertisement అయితే, ఇచ్చిన మాటని బీజేపీ…

మహారాష్ట్ర రాజకీయాల్లో ఎప్పటికప్పుడు సమీకరణాలు మారిపోతున్నాయి. బీజేపీ – శివసేన కలిసి ఎన్నికల్లో పోటీ చేసినా, ఎన్నికల ఫలితాల తర్వాత పదవీ పంపకాలపై శివసేన మెలిక పెట్టింది. 

అయితే, ఇచ్చిన మాటని బీజేపీ తప్పుతోందంటూ శివసేనకీ ఓ బలమైన కారణముందనుకోండి.. అది వేరే విషయం. 'నేనే ముఖ్యమంత్రిని..' అని దేవేంద్ర ఫడ్నవిస్‌ ప్రకటించుకోవడంతో వివాదం ముదిరి పాకాన పడింది. 'ముఖ్యమంత్రి పదవిని చెరి సగం కాలం పంచుకుందాం' అని శివసేన ప్రతిపాదిస్తే, బీజేపీ కాదనేసింది. ఇప్పుడు శివసేన పూర్తిగా లాస్‌ అయిపోయినట్లే.

తొలుత బీజేపీకీ, ఆ తర్వాత శివసేనకీ, చివరికి ఎన్సీపీకీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా పిలుపులు పంపిన మహారాష్ట్ర గవర్నర్‌, మరోపక్క రాష్ట్రపతి పాలన విషయమై కేంద్రానికి విజ్ఞప్తి చేశారట. ఆ విజ్ఞప్తి నేపథ్యంలో, ముందస్తుగానే కేంద్రం, మహారాష్ట్రలో రాష్ట్రపాలనకు సిఫార్సు చేస్తూ క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుందనే ప్రచారం జరుగుతోంది. ఇందులో ఎంత నిజం.? అన్నది మరికొద్ది గంటల్లోనే తేలిపోతుంది.

నిజానికి, శివసేనకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని గవర్నర్‌ ఇవ్వడం ఈ మొత్తం కథలో కీలక మలుపు. అందివచ్చిన అవకాశాన్ని శివసేన సద్వినియోగం చేసుకోలేకపోయింది. మరోపక్క, ఈ రోజు రాత్రి 8.30 నిమిషాల వరకు ఎన్సీపీకి గడువు వుంది. కానీ, ఆలోగా మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలు ఎన్సీపీకి అనుకూలంగా మారే అవకాశాలైతే కన్పించడంలేదు. ఎలా చూసినా, రాష్ట్రపతి పాలన తప్ప మహారాష్ట్రలో వేరే దారి లేదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

రాష్ట్రపతి పాలన.. అంటే, అక్కడ కేంద్రం చెప్పినట్లే వ్యవహారాలన్నీ నడుస్తాయి. అవన్నీ ఎలాగూ బీజేపీకి అనుకూలంగానే వుంటాయనుకోండి.. అది వేరే విషయం. ముదిరిన సంక్షోభాన్ని ఎలా క్యాష్‌ చేసుకోవాలో బీజేపీ కన్నా బాగా ఎవరికి తెలుసు.? కర్నాటకలో ఏం జరిగిందో చూశాం. ఇప్పుడు మహారాష్ట్రలో అంతకు మించిన నాటకీయ పరిణామాల్ని చూస్తున్నాం. అక్కడా, ఇక్కడా బీజేపీకే అత్యధిక స్థానాలు దక్కినా, మెజార్టీకి అవసరమైన స్థానాల్ని గెల్చుకోలేకపోయిన విషయం విదితమే.