సింగపూర్ ముసుగులో రాష్ట్రాన్ని ఎడాపెడా దోచుకోవడానికి తన ఐదేళ్ళ పాలన కాలంలో చంద్రబాబునాయుడు అనేక విపరీత నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే!
అమరావతి రాజధాని కోసం సేకరించిన ప్రాంతంలో సుమారు 1700 ఎకరాలలో స్టార్టప్ ప్రాజెక్టును ప్రకటించడం కూడా ఇలాంటి దోపిడి లో భాగమే! రాష్ట్ర ప్రభుత్వానికి- స్థలం కేటాయించే బాధ్యత, ఆర్థిక భారం పంచుకునే బరువు తప్ప, యాజమాన్యం- అధికారం విషయంలో ఎలాంటి హక్కులు లేకుండా రూపొందించిన అవకతవక విధానాలతో చంద్రబాబు నాయుడు ఈ స్టార్టప్ ప్రాజెక్టును సింగపూర్ కన్సార్టియం చేతుల్లో పెట్టారు.
అప్పట్లోనే సింగపూర్ కన్సార్టియం ముసుగులో అలవి మాలిన దోపిడీకి రంగం సిద్ధం చేస్తున్నట్లుగా పుకార్లు వచ్చాయి. అనేక విమర్శలు వచ్చాయి. చంద్రబాబు నాయుడు సహజంగానే వాటిని ఖాతరు చేయలేదు. సింగపూర్ తన బాంధవ్యాన్ని మాత్రం ఎప్పటిలాగానే కొనసాగించారు.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు నిర్ణయాలు అన్నింటినీ సమీక్షించే క్రమంలో భాగంగా ఈ స్టార్టప్ ప్రాజెక్టును కూడా సమీక్షించారు. అందులో దోపిడీకి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. అయితే చంద్రబాబు రూపొందించిన విధానాలు అన్నీ కూడా.. ఏ దశలో ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నా కూడా ప్రభుత్వమే పెనాల్టీ చెల్లించేలా.. వివాదం రేగితే లండన్ కోర్టుల్లో మాత్రమే పరిష్కరించుకునేలా ఒప్పందాంశాలు ఉన్నాయి.
అయినప్పటికీ.. జగన్మోహన రెడ్డి ఈ అర్థంలేని ప్రాజెక్టు విషయంలో సీరియస్ గానే స్పందించారు. ఒప్పందంలో ఇరుపక్షాలైన సింగపూర్ కన్సార్టియం, రాష్ట్ర ప్రభుత్వం మ్యూచువల్ గా అంగీకరించడంతో.. ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకునేందుకు కసరత్తుచేశారు. ఆ లాంఛనం ఇవాళ పూర్తయింది.
స్టార్టప్ ప్రాజెక్టు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లుగా సింగపూర్ మంత్రి ఈశ్వరన్ అధికారికంగా ప్రకటించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన ఒక ఇబ్బందికర ఒప్పందం తొలగినట్లయింది. దీనివలన.. అయిన ఖర్చులు చెల్లించే పేరిట ప్రభుత్వానికి కొంత భారం పడుతుంది.
అమరావతి ప్రాంతంలో రాజధాని ఉంటుందా? లేదా? అనే సంగతి తర్వాత. కానీ.. రాజధాని ఉంటుందనే ముసుగులో ప్రపంచంలో ఎక్కడెక్కడి సంస్థలూ వచ్చి దోచుకోడానికి చేసుకున్న ఏర్పాట్లు మాత్రం తొలగిపోతున్నాయి.