సొంత పార్టీ నేత‌పై కేశినేని హాట్ కామెంట్స్‌

కృష్ణా జిల్లా రాజ‌కీయాల్లో కేశినేని నాని, దేవినేని ఉమా మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి. ఈ వైరం ఈనాటిది కాదు. వాళ్లిద్ద‌రి మ‌ధ్య విభేదాలు నివురుగ‌ప్పిన నిప్పులా వుంటాయి. ఏ మాత్రం అవ‌కాశం…

కృష్ణా జిల్లా రాజ‌కీయాల్లో కేశినేని నాని, దేవినేని ఉమా మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి. ఈ వైరం ఈనాటిది కాదు. వాళ్లిద్ద‌రి మ‌ధ్య విభేదాలు నివురుగ‌ప్పిన నిప్పులా వుంటాయి. ఏ మాత్రం అవ‌కాశం వ‌చ్చినా ప‌ర‌స్ప‌రం రాజ‌కీయంగా దెబ్బ‌తీసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు. గ‌త ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ లోక్‌స‌భ స్థానం నుంచి కేశినేని నాని గెలుపొంద‌గా, ఆయ‌న శ‌త్రువు దేవినేని ఉమా మైల‌వ‌రం నుంచి ఓడిపోయారు.

దేవినేని అహంకారమే ఆయ‌న్ను ఓడించింద‌ని ప‌లు సంద‌ర్భాల్లో కేశినేని ప‌రోక్షంగా వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లాలో దేవినేని ఉమా వైఖ‌రిపై సొంత పార్టీలోనే తీవ్ర వ్య‌తిరేక‌త వుంది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆయ‌న‌కు రానున్న ఎన్నిక‌ల్లో సీటు ఇవ్వొద్ద‌నే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఒక‌వేళ కాదు కూడ‌ద‌ని ఉమాకు టికెట్ ఇస్తే ఓడించేందుకు సొంత పార్టీ నేత‌లు కాచుక్కూచున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి దేవినేనిపై కేశినేని నాని ప‌రోక్షంగా దేవినేనిపై హాట్ కామెంట్స్ చేశారు.

నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాన‌ని, తానొక సామంత రాజున‌ని విర్ర‌వీగితే ప్ర‌జ‌లు కృష్ణా న‌దిలో ఈడ్చి కొడ్తార‌ని ఉమా పేరు ఎత్త‌కుండా కేశినేని నాని ఘాటుగా అన్నారు. ‘నేనే ఆరుసార్లు ఎమ్మెల్యే అవ్వాలి. ఎనిమిది సార్లు మంత్రి అవ్వాలంటే ప్రజలు ఊరుకోరు. నేను ఎంపీనని నాకు రెండు కొమ్ములున్నాయని అహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు ఉరికించి కొడతారు. ఇదేమీ రాజరిక వ్యవస్థ కాదు. ప్రజాస్వామ్యం.’ అని దేవినేనిని టార్గెట్ చేస్తూ కేశినేని తీవ్ర‌ప‌ద‌జాలంతో హెచ్చ‌రించ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

వైఎస్ జ‌గ‌న్‌ను ఎదుర్కోవాలంటే యువ‌త‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. సీనియ‌ర్లు త్యాగం చేయాల‌ని ఆయ‌న హిత‌వు ప‌లికారు. రానున్న ఎన్నిక‌ల్లో కేశినేని కుమార్తెకు విజ‌య‌వాడ‌లో అసెంబ్లీ సీటు ఇస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. కేశినేని నాని ఎంపీ స్థానానికి పోటీ చేయ‌డానికి ఆస‌క్తిగా లేర‌ని స‌మాచారం. ఆయ‌న‌తో టీడీపీ నేత‌ల‌కు విభేదాలున్న నేప‌థ్యంలో పార్టీ ఎమ్మెల్యే స్థానాన్ని ఆయ‌న కుటుంబానికి ఇవ్వ‌డానికి సిద్ధ‌మైన‌ట్టు తెలిసింది. ఎటూ తాను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటున్న నేప‌థ్యంలో ఉమాకు మైల‌వ‌రం సీటు ద‌క్క‌కుండా చేయాల‌నే ఎత్తుగ‌డ వేశార‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.