యువశక్తి సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై చెలరేగిపోయిన జనసేనాని పవన్‌కల్యాణ్‌ను మంత్రులు టార్గెట్ చేశారు. తాడేపల్లి లోని వైసీపీ కార్యాలయంలో మంత్రి సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడుతూ పవన్ పగటి వేషగాడని ధ్వజమెత్తారు. పండగల సమయంలో పల్లెల్లో పగటి వేషగాళ్లు వస్తుంటారన్నారు. ఇప్పుడు పవన్ కూడా అట్లే వచ్చాడని ఆయన దెప్పి పొడిచారు. ఎన్నికల సమయంలో వచ్చే పగటి వేషగాడిగా పవన్‌ను మంత్రి అభివర్ణించారు.
చంద్రబాబుకు ఊడిగం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడని విమర్శించారు. చంద్రబాబును ప్రశ్నించే దమ్ము పవన్‌కు లేదన్నారు. చంద్రబాబుకు పవన్ అమ్ముడుపోయారని విమర్శించారు. కార్యకర్తల కష్టాన్ని చంద్రబాబుకు తాకట్టు పెడుతున్నాడని ధ్వజమెత్తారు. జగన్ వెంట్రుక కూడా పీకలేవన్నారు.
ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై 2019 తర్వాత పవన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. 2014 నుంచి 2019 వరకూ పవన్ ఎందుకు ప్రశ్నించలేదని మంత్రి నిలదీశారు. చంద్రబాబును పవన్ యజమానిగా మంత్రి అభివర్ణించారు. తన పాలనలో మాట్లాడొద్దని యజమాని చెప్పాడా? అని ప్రశ్నించారు. మాట్లాడితే ప్యాకేజీ తగ్గిస్తాడా? అని ఆయన నిలదీశారు.
పవన్‌కల్యాణ్‌ది అసలైన రాజకీయమా? అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు పంపిన స్క్రిప్ట్‌నే పవన్ చదువుతున్నాడని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో తనకు గ్యారెంటీ ఇవ్వరని కార్యకర్తలను పవన్ అంటున్నాడని, అతనికి వీరమరణం అవసరమా? అని మంత్రి నిలదీశారు. జగన్ సింహం లాండివాడని, ఆయన్ను ఎవరూ ఏమీ చేయలేరని మంత్రి అన్నారు.