Advertisement

Advertisement


Home > Politics - Opinion

ఇంకా ఎన్నాళ్లీ న‌రుకుడు!

ఇంకా ఎన్నాళ్లీ న‌రుకుడు!

వీర‌సింహారెడ్డి చూసాను. ఒకే సినిమాలో నాలుగు బాల‌కృష్ణ పాత సినిమాలు చూపించారా? నాలుగు సినిమాల‌కి అతుకులేసి ఒక సినిమా చేసారా అర్థం కాలేదు. అన్నీ పాత‌సీన్స్‌, అవే సీన్లు. ఏళ్ల త‌ర‌బ‌డి చూసిన‌వే. బాల‌కృష్ణ అలా వుంటే చూస్తార‌ని ముద్ర వేయ‌డం వ‌ల్ల, ఆయ‌న‌లోని న‌టుడికి మూస‌పోసేశారు. క్రాక్‌లో బిగువైన స్క్రీన్ ప్లేతో వ‌చ్చిన గోపీచంద్ మ‌లినేని పూర్తిగా చేతులెత్తేసి పాతికేళ్ల క్రితం సినిమా చూస్తున్న ఫీలింగ్ తెచ్చాడు. 

నిజానికి ఆయ‌న చేసిందేమీ లేదు. ఫైట్ మాస్ట‌ర్ల‌కి సినిమా వదిలేశాడు. ఫైట్లు, పాట‌లు ప‌క్క‌న పెడితే ద‌ర్శ‌కుడికి మిగిలిన స్పేస్ చాలా త‌క్కువ‌. సినిమా గురించి స‌మీక్షించ‌డం నా ఉద్దేశం కాదు. ఒక హీరో, విల‌న్ క‌త్తులతో న‌రుక్కుంటారు. న‌రుక్కోండి, మీ క‌త్తి మీ ఇష్టం. మాకేం అభ్యంత‌రం లేదు. కానీ రాయ‌ల‌సీమ‌లో న‌రుక్కుంటారు క‌దా, అదే అభ్యంత‌రం. మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయ‌ని ఈ సినిమాలో పాట వుంది. రాయ‌ల‌సీమ వాసుల‌కి మ‌నోభావాలు వుండ‌వా? వాళ్లు మ‌నుషులు కాదా? సినిమాలో చూపించిన‌ట్టు చెల్లెలు అన్న‌ను చంపుతుందా? భ‌ర్త ఎదురుగా భార్య‌ని రేప్ చేస్తారా?

సినిమా అంటే ఒక క‌ల్పితం. ఇది అంద‌రికీ తెలుసు. అయితే సినిమా ప్ర‌భావం స‌మాజంపైన అంతాఇంతా కాదు. సినిమాల నుంచి దేశాధ్య‌క్షులు, ముఖ్య‌మంత్రులు అయిన వాళ్లు ఎంద‌రో ఉన్నారు. అయితే సినిమా వాళ్లు సాంస్కృతికంగా రాయ‌ల‌సీమ‌కు చేసిన హాని అంతాఇంతా కాదు. ఫ్యాక్ష‌న్ అనేది వాళ్ల‌కి క‌మ‌ర్షియ‌ల్ స‌బ్జెక్ట్‌, అమ్మ‌క‌పు స‌రుకు. అందుక‌ని ప‌దేప‌దే ఫ్యాక్ష‌న్ క‌థ‌లు తీసి సీమ వాసులంటేనే ఒక దుర్మార్గుడి కింద బ‌తుకుతూ వుంటారు, అక్క‌డ లుంగీలు క‌ట్టుకుని వేట కొడ‌వ‌ళ్ల‌తో జ‌నం తిరుగుతుంటారు. రోడ్ల మీద న‌రుక్కుంటూ వుంటార‌ని ఒక సూత్రీక‌ర‌ణ చేసేశారు.

ఇది చివ‌రికి ఎలా త‌యారైందంటే, అన్ని న‌గ‌రాల్లోనూ క‌బ్జాలు, నేరాలు స‌ర్వ‌సాధార‌ణం. ఉదాహ‌ర‌ణ‌కి వైజాగ్‌లో ఒక నెల‌లో ప‌ది క‌బ్జా కేసులొస్తే 9 కేసుల్లో ఇత‌రులు, ఒక కేసులో ఖ‌ర్మ కాలి క‌డ‌ప వాసులు ఉన్నార‌నుకుందాం. 9 కేసులు చిన్న‌చిన్న వార్త‌లుగా వ‌స్తే, ఒక కేసు మాత్రం వైజాగ్‌లో క‌డ‌ప ముఠా, వైజాగ్‌లో పులివెందుల దందా అని వ‌స్తుంది. నేరం అనేది ప్ర‌పంచ వ్యాప్తం. డ‌బ్బు ఎక్క‌డ వుంటే అక్క‌డుంటుంది. అది ఇత‌రులు చేస్తే నేరం. క‌డ‌ప వాళ్లు లేదా రాయ‌ల‌సీమ వాసులు చేస్తే దౌర్జ‌న్యం, గూండాయిజం, దందా, దాదాగిరి. దీనికి ప్ర‌ధాన కార‌ణం సినిమావాళ్లు. ఏళ్ల త‌ర‌బ‌డి న‌రుక్కునే క‌థ‌లు తీసి ఒక ముద్ర వేశారు. బాల‌కృష్ణ సీమ ప్ర‌జాప్ర‌తినిధి. ఆయ‌న కూడా ఈ మాయ‌లో ఇరుక్కున్నాడు. గ‌త తొమ్మిదేళ్లుగా ఆయ‌న ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురంలో ఫ్యాక్ష‌నిజం, రౌడీయిజం ఎపుడైనా చూసారా?

అయితే సీమ‌లో ఫ్యాక్ష‌న్ లేనేలేదా? అదంతా సినిమా వాళ్ల క‌ల్పిత‌మేనా? ఖ‌చ్చితంగా కాదు. ఫ్యాక్ష‌న్ ఒక‌ప్పుడు ఉండేది నిజ‌మే. ఇప్పుడు లేదు. ప్ర‌పంచీక‌ర‌ణ దేన్ని మార్చినా, మార్చ‌క‌పోయినా ఫ్యాక్ష‌న్‌ని మార్చేసింది. ఫ్యాక్ష‌న్ ఒక‌వేళ ఎక్క‌డైనా ఉన్నా అది అత్యంత ప‌రిమితం. క‌క్ష‌ల‌తో ఉండే మ‌నుషులు, ఊళ్లు అన్ని జిల్లాల్లో వుంటారు. అది సీమ‌కి ప్ర‌త్యేకం కాదు.

ఒక మ‌నిషికి ఇంకో మ‌నిషికి ద్వేషం, క‌క్ష‌లు రావ‌డానికి కార‌ణం డ‌బ్బు, ప‌వ‌ర్‌. ఒక‌ప్పుడు డ‌బ్బులు లేవు (1970 కాలంలో). ఎమ్మెల్యేలు కూడా బ‌స్సుల్లో తిరిగే కాలం. అందుక‌ని రోడ్డు కాంట్రాక్టులు, సారా వేలం పాట‌లు, చెరువు ప‌నులు ఇవ‌న్నీ డ‌బ్బులొచ్చే ప‌నులు. గ‌ట్టిగా ఐదు ప‌దివేలు మిగ‌ల‌ని వీటి కోసం హ‌త్యలు జ‌రిగేవి. సంపాదించిన డ‌బ్బు పోలీసుల‌కి, కోర్టు కేసుల‌కి స‌రిపోయేది. ఫ్యాక్ష‌న్ శాశ్వ‌తంగా మిగిలేది.

1983 త‌ర్వాత తెలుగుదేశం పార్టీతో రాజ‌కీయ కుదుపు వ‌చ్చింది. కొత్త ముఖాలొచ్చాయి. పెత్త‌నం కొన్ని కులాల కిందే ఉన్నా అధికార మార్పిడితో గ్రామాల్లో మార్పు మొద‌లైంది. ప్ర‌పంచీక‌ర‌ణ అనే ప‌దం ప‌ల్లెల‌కి తెలియ‌క‌పోయినా, త‌మ ప‌ల్లె మాత్ర‌మే ప్ర‌పంచం కాదు, బాగా బ‌త‌క‌డానికి వేరే ప్ర‌పంచం వుంద‌ని అర్థ‌మైంది. ఊళ్ల‌లోకి స్కూల్ బ‌స్సులు రావ‌డంతో క‌థ మారిపోయింది. పిల్ల‌ల్ని చ‌దివించాల‌నే ప‌ట్టుద‌ల ఆడ‌వాళ్ల‌లో పెరిగింది. మ‌న సినిమాల్లో సీమ ఆడ‌వాళ్లు ద‌గ్గ‌రుండి హ‌త్య చేయిస్తార‌ని, ప‌గ‌తో ర‌గిలిపోతార‌ని చూపిస్తారు. వీర‌సింహారెడ్డిలో వ‌ర‌ల‌క్ష్మి పాత్ర అదే. అయితే ఫ్యాక్ష‌న్ అంత‌రించిపోవ‌డానికి మ‌హిళ‌లే ప్ర‌ధాన కార‌ణం.

సినిమాల్లో మ‌న‌కి వీర‌సింహారెడ్డి, ఇంద్ర‌సేనారెడ్డి క‌థ‌లు చూపిస్తారు. అయితే వీర‌సింహారెడ్డి న‌రుకుతాడే, లుంగీలు క‌ట్టుకున్న వందలాది మందిని. వాళ్లంతా ఎవ‌రు? బీసీలు , ద‌ళితులు. ప‌ల్లెల్లో భూములు లేని వాళ్లు. ప‌నులు దొర‌క‌ని వాళ్లు. గ‌త్యంత‌రం లేక ఇంత భోజ‌నానికి, 500 రూపాయ‌ల డ‌బ్బుకి (1980-90) క‌త్తులు, తుపాకులు మోసిన వాళ్లు, అన్యాయంగా చ‌చ్చిపోయిన వాళ్లు. భ‌ర్త పోతే పిల్ల‌ల్ని సాక‌డానికి ప్ర‌తి రోజూ చచ్చిబ‌తికిన ఆడ‌వాళ్ల క‌థ‌లు ఎన్నో. 1990 త‌ర్వాత ప‌ల్లెల్లో కాపురానికి వ‌చ్చిన ఆడ‌వాళ్లు ఎంతోకొంత చ‌దువుకున్న వాళ్లు. ప్ర‌పంచం తెలిసిన వాళ్లు (అప్ప‌టికి టీవీలు వ‌చ్చాయి). చ‌దువు లేక‌పోతే త‌మ పిల్ల‌లు త‌మ‌కంటే అధ్వానంగా బ‌తుకుతార‌ని అర్థ‌మై, కాపురాల్ని ద‌గ్గ‌ర్లోని ట‌వున్‌కి మార్చారు. ప‌ట్ట‌ణాల‌కి వ‌ల‌స‌లు పెర‌గ‌డానికి ఇదో ముఖ్య కార‌ణం. మ‌గ‌వాళ్ల భుజాల మీద తుపాకులు, క‌త్తులు దించ‌డానికి ఆడ‌వాళ్లు చేసిన కృషి అంతాఇంతా కాదు.

చదువుల స్పృహ‌తో పాటు న‌గ‌రాల్లో ఉపాధి అవ‌కాశాలు పెరిగాయి. డ‌బ్బు చెలామ‌ణి పెరిగింది. సంపాద‌న కోసం ఊళ్ల‌లో కొట్టుకు చావ‌క్క‌ర్లేద‌ని నాయ‌కుల‌కీ అర్థ‌మైంది. 2000వ సంవ‌త్స‌రం త‌ర్వాత పాత‌కాలం మూర్ఖ‌పు నాయ‌కుల స్థానంలో కొత్త త‌రం వ‌చ్చారు. ఈ వార‌సులు విదేశాల్లో చ‌దువుకుని వ‌చ్చారు. ఇంగ్లీష్ వాడి తెలివితేట‌లు అబ్బాయి. ద‌గ్గ‌రికి తీసుకుంటున్న‌ట్టు న‌టిస్తూ రాజ‌కీయం చేస్తారు. న‌రుకుడు వుండ‌దు.

2023 గురించి మాట్లాడాలంటే అప్పుడు, ఇప్పుడు రాయ‌ల‌సీమ‌కు నీళ్లు లేవు, ప‌రిశ్ర‌మ‌లు లేవు. కానీ ఫ్యాక్ష‌న్ లేదు. నాయ‌కుల కోసం కాదు, ఎవ‌డి జీవిక కోసం వాడు పోరాడుతున్నాడు. ఉద్యోగాల కోసం, కూలి కోసం దేశ‌మే వ‌దిలిపోతున్నాడు. ఎక్క‌డ బ‌తుకు వుంటే అక్క‌డికి. ప‌ల్లెల్లో ముస‌లి వాళ్లు త‌ప్ప యువ‌కులే లేని కాలం. ఇక భుజాల‌పై తుపాకులు, కొడ‌వ‌ళ్లు మోసేదెవ‌రు?

ప‌రిస్థితి ఇలా వుంటే సినిమా వాళ్లు ఏళ్ల త‌ర‌బ‌డి, డ‌బ్బుల కోసం సీమ‌లో ఫ్యాక్ష‌న్ పెంచి పోషిస్తున్నారు. మ‌నుషుల్ని మొర‌ట జంతువుల్లా చూపిస్తున్నారు. హీరోని ప‌దేప‌దే సింహం అంటారు కానీ, సింహం బ‌తికినంత కాలం ప్ర‌తి రోజూ చిన్న ప్రాణుల్ని తింటుంది. సింహం క‌థ విని విని విసుగైంది. చ‌రిత్ర‌లో లేకుండా పోయిన‌, ఎందుకు చ‌నిపోయారో కూడా తెలియ‌కుండా పోయిన అణ‌గారిన వ‌ర్గాల క‌థ మాకు ఇప్పుడు కావాలి. చెప్ప‌గ‌ల‌రా?

సీమ క‌థ‌లే చెప్పండి. కానీ కొత్తగా చెప్పండి. బ‌లం కోసం జ‌రిగే యుద్ధం కాదు, బ‌తుకు కోసం జ‌రిగే యుద్ధం చెప్పండి. అర‌బ్ ఎడారుల్లో ఒంటెలు కాస్తున్న క‌డ‌ప వాసి క‌రీం గురించి చెప్పండి. కాసిన్ని డ‌బ్బుల కోసం కాబుల్‌లో కూలి కోసం వెళ్లిన బాలిరెడ్డి గురించి చెప్పండి. ఆఫ్రికా దేశాల్లో గ‌నుల్లో ప‌ని చేస్తున్న పుట్ట‌ప‌ర్తి ప్ర‌భాక‌ర్ గురించి చెప్పండి. శ‌తాబ్దాలుగా ర‌క్తాన్ని చూసి అల‌సిపోయిన వాళ్లం. ఆరిపోయిన రక్తాన్ని, ప‌గ‌ల్ని ఇంకా ఎందుకు సీమ ముఖం మీద పులుముతారు. ఇక చాలు.

జీఆర్ మ‌హ‌ర్షి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?