పవన్ కల్యాణ్ బహిరంగ సభ వేదిక మీదినుంచి మాట్లాడితే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద అడ్డగోలుగా బురద చల్లుతూ ఆవేశంతో పూనకం తెచ్చుకుని ఊగిపోతూ మాట్లాడుతూ ఉంటే.. చంద్రబాబునాయుడుకు చెవుల్లో తేనెలు పోసినట్లుగా చాలా తీయగా ఉంటుంది.
యువశక్తి పేరుతో రణస్థలంలో పవన్ కల్యాణ్ నిర్వహించిన తాజా సభను కూడా చంద్రబాబునాయుడు అలాగే ఎంజాయ్ చేశారు. కానీ మధ్యలోనే ఆయనకు పవన్ ప్రసంగం చేదుగుళికల్లాగా చెవుల్లోకి వెళ్లింది. అవును మరి.. చంద్రబాబునాయుడు లాస్ట్ చాన్స్ అడుగుతోంటే.. పవన్ కల్యాణ్ మధ్యలో దూరి.. పొత్తులకు సై అంటూ తాను కూడా ముఖ్యమంత్రి కావాలని కలగంటే.. చంద్రబాబుకు చేదుగానే ఉంటుంది కదా.
పవన్ తన రణస్థలం ప్రసంగంలో మనసులో మాట మరోసారి బయటపెట్టారు. ‘‘పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అని మీరు చెప్పాలి. నేను కోరుకుంటే జరగదు. మీరు అధికారం ఇస్తే సేవకుడిలా పనిచేస్తా..’’ అంటూ మనోగతం చెప్పుకున్నారు. చంద్రబాబునాయుడుకు ఇది రుచించని వ్యవహారం.
రెండు పార్టీలు పొత్తులు కుదుర్చుకుంటున్న తరుణంలో ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా పంచుకోవడం గురించి మంతనాలు సాగుతున్నాయనే గుసగుసలు చాలాకాలంగా రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. పవన్ కల్యాణ్ కు ముఖ్యమంత్రి పదవి మీద కోరిక, దాహం ఉంది. కానీ.. ముఖ్యమంత్రి స్థాయికి తగిన ప్రజాబలం లేదు.
ఒకే ఒక్క వ్యక్తిగా ముఖ్యమంత్రి కాగల స్థాయి ప్రజాబలం ఉన్న జగన్ ను చూస్తే అసూయ. ద్వేషం. అందుకే విషం కక్కుతుంటారు. ఆరుశాతం ఓటు బ్యాంకు పెట్టుకుని ముఖ్యమంత్రి పదవికి గేలం వేయాలనేది ఆయన కోరిక. తెలుగుదేశానికి మద్దతిచ్చి పొత్తు పెట్టుకుంటే, అధికారంలోకి వస్తే రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వాలని కోరుతున్నట్లు ఒక పుకారు ఉంది. అదికూడా మొదటి రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవినే పవన్ కోరుతున్నట్టు సమాచారం.
మొదటి అవకాశం చంద్రబాబుకు ఇచ్చి, రెండో సగం తాను పాలించడానికి ఒప్పుకుంటే.. ఈలోగా చంద్రబాబునాయుడు తన పార్టీని దారుణంగా చీల్చేసి తనను సర్వనాశనం చేస్తాడని పవన్ కు భయం. నిజానికి తెలుగుదేశాన్ని చీల్చేంత బలం పవన్ కల్యాణ్ కు లేకపోయినా.. మొదటి అవకాశం ఆయనకిస్తే.. రెండున్నరేళ్ల తర్వాత.. మళ్లీ తనకు మద్దతు ఇస్తాడనే నమ్మకం చంద్రబాబుకు లేదు. అలా మధ్యంతరానికి వెళ్లాల్సి వస్తుందేమో అని ఆయన భయం.
ఇలా పరస్పరం ఒకరి మీద ఒకరు అనుమానాలతో పొత్తులు పెట్టుకోవడానికి వారు సిద్ధపడుతున్నారు. ఈ పొత్తుబంధం ఎంతకాలం ఉంటుంది. అందుకే.. రణస్థలం వేదిక మీదనుంచి.. తాను ముఖ్యమంత్రి కావాలంటూ పవన్ కల్యాణ్ అభిమానులతో నినాదాలు కొట్టించుకుంటూ ఉంటే చంద్రబాబునాయుడు కంగారు పడి ఉంటారు. ఆ నినాదాలు ఆయన చెవిలో చేదు గుళికలుగా ధ్వనించి ఉంటాయి.