టీడీపీతో పొత్తుపై జనసేనాని పవన్‌కల్యాణ్ తెరదించారు. టీడీపీతో కలిసి పోటీ చేస్తానని ఆయన తేల్చి చెప్పారు. శ్రీకాళుళం జిల్లా రణస్థలంలో నిర్వహించిన యువశక్తి సభ వేదికపై నుంచి సీట్ల లెక్కను కూడా ఆయన పరోక్షంగా చెప్పారు. ఇటీవల చంద్రబాబుతో జరిగిన భేటీలో రాష్ట్రంలో శాంతి భద్రతలు, ఇండస్ట్రీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మంత్రి అంబటి రాంబాబు తదితరులపై ఎంతెంత సమయం చర్చించారో పవన్ లెక్కలు చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వనని బాబుకు హామీ ఇచ్చినట్టు స్పష్టం చేశారు.
కానీ పొత్తులో భాగంగా సీట్ల విషయమై తమ మధ్య చర్చ జరగలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. గౌరవప్రదంగా తమకు సీట్లు ఇస్తేనే పొత్తు వుంటుందని, లేదంటే ఒంటరిగానే బరిలో దిగుతానని ఆయన అన్నారు. ఇదే వేదికపై పవన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడాన్ని విస్మరించొద్దు.
“గత ఎన్నికల్లో జనసేనకు 175 నియోజకవర్గాల్లో సరాసరి 6.9% ఓట్లు వచ్చాయి. అవన్నీ ఒక్క చోటే వచ్చి వుంటే శాసనసభలో జనసేన ఎమ్మెల్యేలు ఉండేవారు. ఓటు పలచబడింది. ఓట్లు చీలడంతో 53 నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచింది. రాజకీయం మూడు కులాల చుట్టే తిరిగితే ఎలా? అన్ని కులాలకూ ఫలాలు అందాలి. ఏ ఒక్క కులం కోసమో రాజకీయం చేయడం లేదు. దామాషా పద్ధతిలో అధికారాన్ని పంచుకోవాలి ” అని ఆయన అన్నారు.
దీన్ని బట్టి పవన్‌కల్యాణ్ డిమాండ్ 50 అసెంబ్లీ, 7 పార్లమెంట్ సీట్లు. వీటికి టీడీపీ అంగీకరించే దాన్ని బట్టి పొత్తు వుంటుందని చెప్పొచ్చు. ఈ మేరకు ఆయన పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. అలాగే అధికారంలో కూడా ఆయన షేర్ అడుగుతున్నారు. ఇది కూడా బహిరంగంగానే ఆయన చెప్పారు. కమ్మ, రెడ్లతో పాటు ఇతర సామాజిక వర్గాలకు అధికారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేయడం వెనుక అంతరార్థం ఏంటనే చర్చకు తెరలేచింది. పవన్‌కు అధికారంలో భాగస్వామ్యం ఇచ్చేందుకు చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోరనే సంగతి తెలిసిందే.
అధికారం వచ్చేంత వరకూ ఒకలా, వచ్చిన తర్వాత మరోలా వ్యవహరించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. తనకు అధికారం దక్కడానికి దోహదపడే వరకూ పవన్‌ను బాబు ప్రేమిస్తారు. అధికారంలో హక్కు ఉందని పవన్ అంటే… ఎలా వ్యవహరిస్తారో అర్థం చేసుకోకపోవడం పవన్ తప్పిదమవుతుంది. ఈ డిమాండ్ల నేపథ్యంలో టీడీపీతో పొత్తు, అనంతర పరిణామాలు ఎలా వుంటాయో కాలం చెప్పే జవాబు కోసం ఎదురు చూద్దాం.