రాజకీయాల్లో హత్యలుండవు…ఆత్మహత్యలే వుంటాయని పెద్దలు ఊరికే చెప్పలేదు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహించిన యువశక్తి సభ సాక్షిగా జనసేనాని పవన్‌కల్యాణ్ రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారు. రాజకీయంగా పవన్ ఎంత అజ్ఞానో ఈ సభ నిరూపించింది. పవన్ ప్రసంగంలోని కొన్ని కామెంట్స్‌ను వింటే… ఎవడ్రా బాబూ ఈయన, రాజకీయాలకు అనర్హుడనే అభిప్రాయం కలుగుతుంది.
ఒంటరిగా పోటీ చేస్తే గెలుస్తాననే నమ్మకాన్ని మీరు ఇవ్వలేదని సభకు వచ్చిన జనాన్ని ఉద్దేశించి పవన్ అన్నారంటే, ఆయన తెలివితేటలు ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ అజ్ఞానమే టీడీపీ కోరుకుంటోంది. రాజకీయాలకు అవగాహన రాహిత్యం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ద్వేషం నిలువెల్లా నింపుకున్నారనే విషయం ఈ సభ ద్వారా జనానికి బోధపడింది. యువశక్తి సభలో పవన్ నోటి నుంచి వెలువడిన ఆణిముత్యాల్లాంటి మాటలేంటో తెలుసుకుందాం.
“2024లో మనకు ఓటు చాలదు. వచ్చే ఎన్నికల్లో పొత్తులతోనే పోటీ చేస్తాం. అయితే అది గౌరవప్రదంగా వుండాలి. ఒంటరిగా వెళ్లి వీరమరణం పొందాల్సిన అవసరం లేదు. పదేళ్లు చూశాను. మీరు గ్యారెంటీ ఇస్తే ఒంటరిగా వెళ్తాం. మీపై నమ్మకం లేదు. నియంతను కలిసికట్టుగా ఎదుర్కోవాలి. అందుకు తగ్గ వ్యూహం వుండాలి. బలం సరిపోతుందనుకుంటే ఒంటరిగానే పోటీ చేస్తాం. ఆ నమ్మకం మీరిస్తారా? మీరు ఒకసారి నమ్మండి. అధికారం అప్పగించండి”
నమ్మకం ఎవరు ఇవ్వాలి? పార్టీ నాయకుడిగా శ్రేణులకు నమ్మకం, భవిష్యత్‌పై భరోసా ఇవ్వాల్సింది పోయి, తనే వారి నుంచి కోరుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పైగా మీరంతా తన సభలకు వస్తారని, కానీ రకరకాల సాకులతో జగన్‌కు ఓట్లు వేశారని, వేస్తారనే అర్థం ధ్వనించేలా మాట్లాడ్డం దేనికి నిదర్శనం? తాను మాత్రం జనాన్ని నమ్మరట! తనను మాత్రం జనం నమ్మి ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్నారు.
పదేళ్లుగా జనసేనానిగా ప్రయత్నిస్తున్నా, జనం నమ్మకాన్ని చూరగొనలేదని సభ సాక్షిగా పవన్ బహిరంగంగా ప్రకటించారు. ఆ తప్పు ఎవరిది? నమ్మకాన్ని సంపాదించుకోని పవన్‌దా? నమ్మని జనానిదా? …ఇప్పుడీ ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. 1983లో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన అధికారంలోకి రాలేదా? అంతెందుకు తాను ద్వేషించే సీఎం జగన్ ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకుని సొంతంగా అధికారానికి చేరువ కాలేదా? జగన్‌కు అధికారం దానికదే నడుచుకుంటూ వచ్చిందా? ఆప్ అధినేత కేజ్రీవాల్ సొంతంగా దేశ రాజధాని ఢిల్లీలో బలీయమైన బీజేపీని ఎదిరించి అధికారాన్ని మూడో దఫా హస్తగతం చేసుకోలేదా? ఆ తర్వాత పంజాబ్‌లో సత్తా చూపలేదా? ఇప్పుడు దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు ఏ శక్తి ఆయన్ను నడిపిస్తున్నదో ఆలోచించారా? కేవలం నమ్మకం.
తమకు కేజ్రీవాల్ సేవ చేస్తాడని ప్రజలు నమ్మడం వల్లే ఆయనకు ఢిల్లీ ప్రజలు అధికారం కట్టబెట్టారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం వల్లే మళ్లీమళ్లీ ఆయన అధికారాన్ని నిలబెట్టుకోగలిగారు. తెలంగాణలో కేసీఆర్ ప్రజల నమ్మకాన్ని పొందడం వల్లే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. ఆ తర్వాత రెండుసార్లు అధికారంలోకి రాగలిగారు. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ఆయన బీజేపీతో పోరాటం చేస్తున్నారు.
గత పదేళ్లలో ఏపీ ప్రజల నమ్మకాన్ని పొందేందుకు తానేం చేశారో పవన్ ఒక్కసారైనా ఆత్మపరిశీలన, విమర్శ చేసుకున్నారా? 2014లో జనసేన స్థాపించి, ఆ వెంటనే టీడీపీ-బీజేపీ కూటమి పల్లకీ మోశారు. టీడీపీ-బీజేపీ కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను సమర్థిస్తూ… మూడున్నరేళ్ల పాటు కాలం గడిపారు. ఆ తర్వాత ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి మళ్లీ చంద్రబాబుకు పట్టం కట్టే కుట్రలో భాగస్వామి అయ్యారు. పిల్లి పాలు తాగుతూ ఎవరూ చూడలేదనుకున్న చందంగా… పవన్ రాజకీయంగా వ్యవహరించారు.
2019లో ఓటమి వీరమరణంతో పవన్ పోల్చుకున్నారు. మళ్లీ ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిచి వీరమరణం పొందాల్సిన అవసరం లేదని, పొత్తులతోనే ముందుకెళ్తానని ప్రకటించేందుకు యువశక్తి సభను పవన్ వాడుకున్నారు. చావుకు భయపడనని అనేకమార్లు పవన్ చెప్పడం విన్నాం, చూశాం. ఒక్కసారి వీరమరణం పొందిన తర్వాత ….మళ్లీ జీవితం ఎక్కడ? తన సంకల్పం మంచిదైనప్పుడు ప్రజలు ఎందుకు ఆదరించరనే ప్రశ్న పవన్ వేసుకుంటే, సమాధానం దొరుకుతుంది. కేవలం తాను అసెంబ్లీలో అడుగు పెట్టే ఏకైక లక్ష్యంతో టీడీపీతో అంటకాగేందుకు పొత్తు కుదుర్చుకుంటున్నట్టు పవన్ ప్రకటించారు.
ఇక్కడ ఓ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. తాను ఒంటరిగా పోటీ చేస్తే ఓట్లు వేయని జనం, టీడీపీతో కలిసి ప్రయాణిస్తే మాత్రం ఏ విధంగా వేస్తారని పవన్ అనుకుంటున్నారు? అంటే టీడీపీ ఓటుతో తాను అసెంబ్లీలో అడుగు పెట్టాలని తపిస్తున్నారా? ఇక తన బలం మాటేంటి? ఒకవైపు ఇదే సభలో పవన్ కల్యాణ్ సీఎం …సీఎం అంటూ అభిమానులు కేరింతలు పవన్ చెవికెక్కలేదు. మరి తనను రాజకీయంగా ఉన్నతంగా చూడాలనే వారి ఆకాంక్షకు సమాధి కట్టి, టీడీపీతో చెట్టపట్టాలేసుకుని తిరగడానికే నిర్ణయించు కున్న విషయాన్ని తన అభిమానులు, పార్టీ కార్యకర్తలకు చెప్పడానికి ఈ సభను పవన్ నిర్వహించినట్టు అర్థమవుతోంది. ఇంతకంటే పవన్‌కు రాజకీయ ఆత్యహత్య ఏముంటుంది?