టీడీపీతో పొత్తు విషయమై బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ తరుణ్‌ఛుగ్ మాట్లాడ్డం ఆశ్చర్యంగా వుంది. ఒకవైపు టీడీపీతో పొత్తును ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జ్, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో 'టీడీపీతో రానున్న ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవాలా? వద్దా?' అనే విషయమై ఆలోచిస్తున్నట్టు తరుణ్ చెప్పడం గమనార్హం.
ఏపీలో బీజేపీతో పొత్తు కోసం టీడీపీ వెంపర్లాడుతోంది. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల వ్యవస్థల్ని తమకు అనుకూలంగా వాడుకోవచ్చనేది టీడీపీ ఎత్తుగడ. ఇదిలా వుండగా కుటుంబ, అవనీతిపార్టీలతో పొత్తు ఉండనే ఉండదని సోము వీర్రాజు, సునీల్ దియోధర్ పదేపదే చెబుతున్న పరిస్థితి. అలాగే బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన ఎప్పుడెప్పుడు టీడీపీతో కలిసి వెళ్దామా? అని ఉత్సాహంతో ఉంది.
టీడీపీతో గతానుభవాల దృష్య్టా పొత్తు వద్దని ఏపీ బీజేపీ ఆలోచిస్తోంది. ఏపీలో ఎదగాలంటే టీడీపీ పతనం కావాలని బీజేపీ కోరుకుంటోంది. జనసేన కలిసి వచ్చినా, బీజేపీతో అండదండలు లేకపోతే పోల్ మేనేజ్‌మెంట్‌లో వైసీపీని ఎదుర్కోలేమనే ఆందోళన టీడీపీలో వుంది. అందుకే బీజేపీని ఎలాగైనా ముగ్గులోకి దింపాలని టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది.
ఇందుకు ఎల్లో మీడియా తన వంతు పాత్ర పోషిస్తోంది. టీడీపీతో పొత్తు అంశపై తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మనోగతంపై ఏపీ బీజేపీ ఎలా స్పందిస్తుందో మరి!