కేంద్ర మాజీ మంత్రి, దేశంలోని ప్రముఖ సోషలిస్టు నేతల్లో ఒకరైన శరద్ యాదవ్ కన్నుమూశారు. 75 ఏళ్ల శరద్ యాదవ్ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం ఢిల్లీలోని తన ఇంట్లో కుప్పకూలిపోయారు. వెంటనే గురుగ్రామ్‌లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తీసుకెళ్లారు. చిక్సిత పొందుతూ గురువారం రాత్రి మృతి చెందారు.
విద్యార్థి నాయకుడిగా రాజకీయాలను ప్రారంభించిన శరద్ యాదవ్ కాంగ్రెస్ వ్యతిరేక శిబిరంతో జతకట్టారు. తరువాత జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమంలో చురుక్కుగా పాల్గొన్నారు. తన జీవితంలో ఎక్కువ భాగం ప్రతిపక్షంలోనే కొనసాగారు. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీతోను, తన రాజకీయ ప్రత్యర్థి లాలూ ప్రసాద్ యాదవ్‌తో రాజీపడి, బీహార్‌లో 2015 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మహా కూటమిని రూపొందించడంలో కీలక పాత్ర పోషించాడు.
అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలోను, విపీ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. మూడుసార్లు రాజ్యసభ సభ్యుడిగా, ఏడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. బీహార్ అధికార జనతాదళ్ యునైటెడ్ వ్యవస్థాపక సభ్యుడు, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మహాకూటమికి ముగింపు పలికి, బీజేపీతో చేతులు కలిపిన తర్వాత శరద్ యాదవ్ పార్టీ నుండి వైదొలిగారు.
2018లో లోక్తాంత్రిక్ జనతా దళ్ అనే రాజకీయ పార్టీని స్థాపించిన ఆయన… తర్వాత రెండేళ్లకు దాన్ని లాలూప్రసాద్ యాదవ్ పార్టీ రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జెడీ) లో విలీనం చేశారు.