Advertisement

Advertisement


Home > Politics - Opinion

రాయలసీమంటే రక్తపాతమేనా బాలయ్యా!

రాయలసీమంటే రక్తపాతమేనా బాలయ్యా!

రాయలసీమంటే రక్తపాతమేనా? అక్కడ అందరూ వికృతంగా కనిపిస్తారా? రాక్షసుల్లాంటివాళ్లు ఆ ప్రాంతాన్ని ఏలుతుంటారా? అక్కడ లా అండ్ ఆర్డర్ ఉండదా? వాళ్లందర్నీ నరికినరికి చంపేది బాలకృష్ణ ఒక్కడేనా? 

"వీర సింహా రెడ్డి" చూస్తే మా రాయలసీమ వాళ్లకి మాత్రం ఒళ్లుమండాలి. ఎందుకంటే అప్పట్లో రామగోపాలవర్మ "కడప" పేరుతో ఒక సినిమా చెయ్యాలనుకున్నప్పుడు రాయలసీమ సంఘాలవాళ్లు విరుచుకుపడి నానా యాగీ చేసారు. వాళ్లంతా ఇప్పుడు తలుపులేసుకుని కూర్చున్నారా? వీర సింహారెడ్డిలో తలలు తెగిపడడం, నెత్తురు ఏరుల్లా పాకడం, భర్త ముందే భార్యని రేప్ చేయడం లాంటి సీన్లు ఒకెత్తైతే సెన్సార్ వారు ఈ చిత్రానికి యూ/ఎ ఇవ్వడం మరొక ఎత్తు. 

బాలకృష్ణ ప్రాతినిధ్యం వహించేది రాయలసీమలోని హిందూపురం. గతంలో తన తండ్రి అదే నియోజకవర్గం నుంచి పలు సార్లు ఎన్నికైన వ్యక్తి. బాలకృష్ణ వియ్యంకుడు పుట్టి పెరిగింది రాయలసీమ. కుప్పం నుంచే పలుమార్లు ఎన్నికయ్యాడు. తమ ప్రాంతంలో ఏ మాత్రం హింస ఉందో తామే గుండెల మీద చెయ్యేసుకుని చెప్పుకోవాలి. ఒకవేళ సినిమాలో చూపించినట్టే ఇప్పటికీ ఉందంటే వాళ్లు రాజకీయ సన్యాసం చేసి మూలన కూర్చోవాలి. ఇన్నేళ్ల పాలనలో ఏ శాంతిస్థాపన చేసినట్టు? 

రాయలసీమంటే ఫ్యాక్షననీ, వెనుకబాటు తనమనీ, అక్కడ లా అండ్ ఆర్డర్ ఉండదని, అంతా ఊరి పెద్ద చేతి గొడ్డలిలోనే ఉంటుందనే విధంగా రాతియుగం నాటి కథలు ఇంకా రుద్దడమెందుకు? ఇంతోటి చెత్తకి "జై బాలయ్య" అని అరుస్తూ అభిమానుల నినాదాలా? విదేశాల్లో కూడా సినిమా హాల్స్ లో చివాట్లు తింటూ షోలు క్యాన్సిల్ చేయించుకునే రేంజులో వీరి ఆటవిక ప్రవర్తనకి బాలకృష్ణ చేస్తున్న సినిమాలే కారణం. 

"సీమలో ఎవ్వరూ గొడ్డలి పట్టకూడదని నేను గొడ్డలి పట్టా.." అని ఇందులో ఒక డైలాగు. ఎవ్వడూ పట్టకూడదని తాను గొడ్డలి పక్కనపెడితే అర్థముంటుంది కానీ పట్టుకుంటే అక్కడితో ఆగుతుందా? మరొకడు పట్టుకోడు? శాంతిని ఆకాంక్షించేవాడి మాటేనా ఇది? తనని చూసి ఫ్యాన్స్ అదేదో బ్రాందీ తాగుతున్నట్టుగా ఇప్పుడు గొడ్డలి కూడా పట్టుకోమన్నట్టు ఉంది. 

అప్పుడెప్పుడో ఒక ఆడియో ఈవెంటులో ఆడది కనిపిస్తే ముద్దైనా పెట్టేయాలి, కడుపైనా చేసెయ్యాలి అని వాకృచ్చిన మహానుభావుడు ఈ బాలయ్య. తాజాగా వీరసింహా రెడ్డి పాత్రలో కూడా అలాగే అఘోరించాడు. పెళ్లి కాకుండానే ఒక ఆడదానికి ముద్దుపెట్టి కడుపు చేయడం ఆయనగారి హీరోయిజం. దీనికి మళ్లీ ధర్మేచ, అర్థేచ అంటూ వేదమంత్రంతో అర్థంలేని సమర్ధింపు. ముందు రాసినోడిని అనాలి. 

ఈ సినిమాలో హోం మినిస్టర్ ముందు కూర్చుని పంచ్ డైలాగులు కొట్టాడు హీరో. పాపం దానికి వెర్రి జనాలు చప్పట్లు కొట్టారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వీరహింసారెడ్డిగా వీరంగం చేస్తుంటే పోలీసులెవరూ కనపడరు సీన్లో... అదీ అపోజిషన్ పార్టీ హయాములో. 

నిజానికి అలా సాధ్యమౌతుందా ఎవరికైనా? సాధ్యమైనట్టైతే పరిటాలరవి అప్పట్లో దాక్కుని దాక్కుని భయం భయంగా ఎందుకు బతికాడు? సినిమా వేరు, రియాలిటీ వేరు. కానీ తెర మీద చూపించే అబద్ధాన్నే నిజమనే భ్రమలో బతికే పిచ్చి ఫ్యాన్స్ ఉన్నప్పుడు ఆ అబద్ధాన్ని వినోదంగా మలచుకోవాలి కానీ ఇలా ఆటవికంగా కాదు. 

బహుశా తాను తుపాకి పట్టుకుని ఇంట్లో కాల్పులు జరిపినప్పుడు, అపోషిన్ పార్టీ పవరులో ఉన్నా కూడా అరెస్ట్ కాలేదు కదా అని తనని తాను అవతారపురుషుడిగా ఊహించుకుంటున్నాడేమో? ఆ ఊహవల్లే ఇలాంటి సినిమాలు ఇష్టపడి చేస్తున్నాడులాగ ఉంది. 

ఏ మాత్రం బాధ్యత లేని మైండుతో, నియంతృత్వ ధోరణితో రెచ్చిపోయి సినిమాలు తీయడం ఒక మానసిక దౌర్బల్యం. నిజజీవితంలో రాజకీయంగా చచ్చుబడి జీవచ్ఛవాల్లా బతుకుతూ ఆ గాయానికి అద్దుకోవడానికి నూరుకున్న పసలేని పసరు మందే ఈ వీరసింహారెడ్డి. 

సానా లక్ష్మీ కుమారి, బోస్టన్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?