శ్రీకాకుళం జిల్లాలో దివంగత కింజరాపు ఎర్రన్నాయుడుకు ఎంతో పేరు ఉంది. ఆయన సొంత సత్తా కలిగిన నాయకుడు. అప్పట్లో ఎన్టీయార్ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా గెలిచి అసెంబ్లీకి వచ్చిన ఘనాపాటి. ఆయన సరిసాటి పోటీ బతికి ఉండగా టీడీపీలో మరో నేత ఉండేవారు కాదు.
ఎర్రన్నాయుడు చంద్రబాబుతో కలసి ఢిల్లీ వేదికగా ఎంపీగా జాతీయ రాజకీయాల్లో చురుకుగా పనిచేశారు. కేంద్ర మంత్రి కూడా అయ్యారు. ఆయన 2012లో రోడ్ యాక్సిడెంట్ లో మరణించడంతో వారసుడిగా వచ్చిన కుమారుడు రామ్మోహన్ నాయుడు 2014, 2019లలో రెండు సార్లు శ్రీకాకుళం ఎంపీగా పనిచేసారు.
అయితే ఆయన చూపు ఇపుడు అసెంబ్లీ మీద పడింది అని అంటున్నారు. 2024లో ఎమ్మెల్యేగా పోటీ చేసి పార్టీ గెలిస్తే మంత్రి కావాలని అనుకుంటున్నారు. ఆయన తాను పోటీ చేసే సీటుని కూడా చూసుకున్నారు. మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన క్రిష్ణ దాస్ సొంత గడ్డ అయిన నరసన్నపేట నుంచి పోటీ చేయడానికి జూనియర్ కింజరాపు ఉవ్విళ్ళూరుతున్నారు.
అక్కడ తమ సొంత సామాజిక వర్గం బలంగా ఉండడంతో గెలుపు ఖాయమని ఆయన అంచనా కడుతున్నారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేయడం వల్ల శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీ విజయావకాశాలు బాగా పెరుగుతాయని రామ్మోహన్నాయుడు అధినేత చంద్రబాబుకు వివరించారని అంటున్నారు.
అయితే ఇప్పటికే టెక్కలి నుంచి రామ్మోహన్ బాబాయి అచ్చెన్నాయుడు ఉన్నారు. ఆయన మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి కావాలని చూస్తున్నారు. అటు బాబాయ్ ఇటు అబ్బాయ్ ఈ ఇద్దరూ ఎమ్మెల్యే అంటున్నారు. గెలిస్తే మంత్రులు కావాలని ఆశిస్తున్నారు. దాంతో బాబుకు ఇది బిగ్ టేస్ట్ గా మారుతోంది అంటున్నారు. అబ్బాయి దూకుడు ని ఆపలేరు, బాబాయ్ ని దూరం చేసుకోలేరు. చంద్రబాబుకు గొప్ప చిక్కు వచ్చిపడిందని అంటున్నారు.