ఏపీ హైకోర్టులో ఆస‌క్తిక‌ర ప‌రిణామం

జీవో నంబ‌ర్‌-1పై ఇవాళ ఏపీ హైకోర్టులో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. కందుకూరు, గుంటూరుల‌లో చంద్ర‌బాబు స‌భ‌ల్లో తొక్కిస‌లాట‌ల్లో 11 మంది ప్రాణాలు కోల్పోవ‌డంతో జ‌గ‌న్ స‌ర్కార్ జీవో తీసుకొచ్చింది. దీని ప్ర‌కారం ప‌ట్ట‌ణాల్లో…

జీవో నంబ‌ర్‌-1పై ఇవాళ ఏపీ హైకోర్టులో ఆస‌క్తిక‌ర ప‌రిణామం చోటు చేసుకుంది. కందుకూరు, గుంటూరుల‌లో చంద్ర‌బాబు స‌భ‌ల్లో తొక్కిస‌లాట‌ల్లో 11 మంది ప్రాణాలు కోల్పోవ‌డంతో జ‌గ‌న్ స‌ర్కార్ జీవో తీసుకొచ్చింది. దీని ప్ర‌కారం ప‌ట్ట‌ణాల్లో రోడ్ల‌పై, అలాగే ఇరుకు వీధుల్లో ర్యాలీలు, స‌భ‌లు, స‌మావేశాలు నిర్వ‌హించొద్దు. ఊరి వెలుప‌ల నిబంధ‌న‌ల ప్ర‌కారం కార్య‌క‌లాపాలు నిర్వ‌హించుకోవ‌చ్చ‌ని స్ప‌ష్టం చేసింది.

ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు మిత్రుడు సీపీఐ రామ‌కృష్ణ హైకోర్టులో జీవోను స‌వాల్ చేస్తూ పిల్ వేశారు. దీనిపై ఇవాళ సంక్రాంతి వెకేష‌న్ బెంచ్ విచార‌ణ చేప‌ట్టింది. పిటిష‌న్‌ను అత్య‌వ‌స‌రంగా విచారించాల‌ని పిటిష‌న‌ర్ రామ‌కృష్ణ కోరారు. అయితే అంత అవ‌స‌రం లేద‌ని ప్ర‌భుత్వ త‌ర‌పు న్యాయ‌వాది ఏజీ శ్రీ‌రాం కోర్టుకు విన్న‌వించారు. అంతేకాకుండా, ప్ర‌భుత్వ విధానాల‌ప‌ర‌మైన అంశాల‌పై విచారించే అధికారం వెకేష‌న్ బెంచ్‌కు లేద‌ని న్యాయ‌స్థానం దృష్టికి ఆయ‌న తీసుకెళ్లారు.

సంక్రాంతి సెల‌వుల దృష్ట్యా హైకోర్టుకొచ్చే ముఖ్య‌మైన కేసుల విచార‌ణ‌కు వెకేష‌న్ బెంచ్ ఏర్పాటైంది. ఇందులో భాగంగా డివిజన్ బెంచ్‌లో జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ డాక్టర్ వీఆర్‌కే కృపా సాగర్, అలాగే సింగిల్ జడ్జి బెంచ్‌లో జస్టిస్‌ సుబ్బారెడ్డి సత్తి ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఏజీ శ్రీ‌రాం విచార‌ణ‌లో భాగంగా చేసిన కామెంట్స్ చ‌ర్చ‌నీయాంశ‌మ‌య్యాయి. పిల్‌పై ప్ర‌భుత్వానికి స‌మాచార‌మే లేద‌న్నారు.

నిబంధనల ప్రకారం ఈ కేసు రోస్టర్‌లో రావడానికి ఆస్కారం లేదని గ‌ట్టిగా వాదించారు. అలాగే జడ్జీలను ఎంపిక చేసుకోవడంలో భాగంగా ఒక రాజకీయ పార్టీ దీన్ని ఉపయోగించుకుంటోంద‌ని ఏజీ వ్యాఖ్యానించ‌డం కీల‌క అంశంగా చెప్పుకోవ‌చ్చు. ఈ మాట‌ల వెనుక మ‌ర్మం ఏంటో ఎవ‌రికైనా అర్థ‌మ‌వుతుంది. అయితే ఈ పిల్‌ను తామే విచారిస్తామ‌ని వెకేష‌న్ బెంచ్ స్ప‌ష్టం చేయ‌డం విశేషం. జీవో నంబ‌ర్‌-1పై హైకోర్టులో ఇవాళ ఇవ‌న్నీ ఆస‌క్తిక‌ర ప‌రిణామాలుగా చెప్పుకోవ‌చ్చు.