సమయపాలనలో సూపర్.. ప్రపంచంలో ఇదొక్కటే

భారీగా డబ్బు పెట్టి టికెట్ కొని విమానాలు ఎక్కేది ఎందుకు? టైమ్ సేవ్ అవుతుందని. అలాంటి విమానాలు కూడా ఎద్దులబండిలా ఆలస్యంగా వెళ్తే ఏం చేస్తారు..? మనసులో తిట్టుకుంటారు, రెండోసారి ఆ ఎయిర్ లైన్స్…

భారీగా డబ్బు పెట్టి టికెట్ కొని విమానాలు ఎక్కేది ఎందుకు? టైమ్ సేవ్ అవుతుందని. అలాంటి విమానాలు కూడా ఎద్దులబండిలా ఆలస్యంగా వెళ్తే ఏం చేస్తారు..? మనసులో తిట్టుకుంటారు, రెండోసారి ఆ ఎయిర్ లైన్స్ లో టికెట్ బుక్ చేయరు. దాదాపుగా ప్రపంచంలో అన్ని దేశాల విమానయాన సంస్థలు ఇలాంటి అపవాదుని మూటగట్టుకున్నాయి. ఫలానా విమానం ఎక్కితే ఇక మన పనైనట్టే అనే సెటైర్లు చాలా చోట్ల వినే ఉంటాం. కానీ పంక్చువాలిటీకి మారుపేరుగా నిలిచింది ఇండోనేషియాలోని గరుడ విమానయాన సంస్థ.

గరుడ ఇండోనేషియాలో టికెట్ బుక్ చేసుకుంటే.. కచ్చితంగా అనుకున్న టైమ్ కి మన గమ్యస్థానం చేరుకోవచ్చు. ఆ విమానం ఎక్కిన ఎవరైనా చెప్పే మాటే ఇది. అందుకే గరుడ ఇండోనేషియాలో సీట్లు అందుబాటులో ఉన్నాయంటే, మరో విమానంలో టికెట్ రేటు తక్కువగా ఉన్నా కూడా గరుడకే వెళ్తారు. ఇలా విమానాల సమయపాలనపై ట్రావెల్ డేటా ప్రొవైడర్ డేటా విశ్లేషిస్తే గరుడ ఇండోనేషియాకి 95.63 శాతం మార్కులొచ్చాయి.

టేకాఫ్, ల్యాండింగ్ సమయాల్లో 15 నిమిషాలను మార్జిన్ గా తీసుకుని ఆన్ టైమ్ పెర్మామెన్స్ ని లెక్క కడతారు. ఆ ఓటీపీ స్కోర్ గరుడ ఇండోనేషియాకి 95.63 శాతం వచ్చింది.

దక్షిణాఫ్రికాకు చెందిన సఫైర్ ఎయిర్ లైన్స్ 95.3 శాతం, జర్మనీకి చెందిన యూరోవింగ్స్ 95.26శాతం స్కోర్ తో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అయితే యూరో వింగ్స్ సంస్థ విమానాలను రద్దు చేయడంలో మాత్రం పరమ చెత్త రికార్డ్ సొంతం చేసుకుంది. గతేడాది 3.49 శాతం విమానాలను క్యాన్సిల్ చేసి చెత్త ఎయిర్ లైన్స్ గా రికార్డులకెక్కింది.

అన్నిట్లో గొప్పలు చెప్పుకునే అమెరికా విషయానికొస్తే.. అక్కడి విమానయాన సంస్థలకు అస్సలు పంక్చువాలిటీ లేదని తేలిపోయింది. టాప్-20లో అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్ లైన్స్ ఒక్కటే 81.79 స్కోర్ తో మిగిలింది. యూరప్ కు చెందిన ఎయిర్ లైన్స్ సంస్థలేవీ పంక్చువాలిటీ లిస్ట్ లో లేకపోవడం విశేషం.

విమానాశ్రయాల విషయానికొస్తే.. వచ్చిన విమానాలను వచ్చినట్టు పంపిస్తూ, పక్కా ప్లానింగ్ తో జపాన్ లోని ఒసాకా విమానాశ్రయం మొదటి స్థానంలో ఉంది. 2022లో ఒసాకా ఎయిర్ పోర్ట్ నుంచి 91.45 శాతం విమానాలు కరెక్ట్ టైమ్ కి బయలుదేరాయి. భారత్ కి సంబంధించి ఇండిగో సంస్థ 83.51 శాతం ఓటీపీ స్కోర్ తో టాప్-15లో నిలిచింది.