పింఛన్లలో కోత వైసీపీ ప్రజాప్రతినిధుల మెడకు చుట్టుకుంటోంది. అసలే ఎన్నికలు వస్తున్న తరుణంలో ఇలాంటి చర్యలు రాజకీయంగా నష్టం తెస్తాయనే ఆవేదన అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో వుంది. తక్కువ మెజార్టీతో బయటపడిన ఎమ్మెల్యేల్లో ఆవేదన కాస్త ఎక్కువే. మంత్రి రోజా పింఛన్ల కోతపై లబోదిబోమంటున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్‌పై ఆమె 2,708 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
ఇప్పుడు ఆమె ప్రభుత్వంలో ఉన్నారు. దీంతో ప్రభుత్వంపై వ్యతిరేకత, ఇతరత్రా అంశాలన్నింటిని ఎదుర్కొని తిరిగి గెలవాల్సి వుంటుంది. నెగెటివిటీకి ఏ చిన్న అవకాశం ఇవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే. ఈ నేపథ్యంలో ఒక్క నగరి మున్సిపాలిటీలోనే వివిధ రకాల పింఛన్లు 1,623 చొప్పున కోత విధించేందుకు అధికారులు నిర్ణయించారు. అలాగే పుత్తూరు మున్సిపాలిటీలో కాస్త అటుఇటుగా ఇదే సంఖ్య వుంది. గ్రామీణ స్థాయిలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నగరి వైసీపీ నేతలు అంటున్నారు.
ఈ నెల 18వ తేదీ వరకూ వెరిఫికేషన్‌కు ప్రభుత్వం సమయం ఇచ్చిందని సమాచారం. పింఛన్ల కోతకు సంబంధించి లబ్ధిదారులు వైసీపీ నేతల వెంటపడుతున్నారు. దీంతో మంత్రి రోజాతో పాటు ఆ నియోజకవర్గంలోని వైసీపీ నేతలు సంబంధిత అధికారులకు ఫోన్ చేసి …ఎన్నికల సమయంలో తమకు నష్టం కలిగించే పనులు చేయొద్దని ఆగ్రహించినట్టు సమాచారం. తాము గెలిచిందే 3 వేల లోపు మెజార్టీతోనే అని, తీరా పింఛన్లు కూడా అదే సంఖ్యకు తగ్గకుండా చేస్తే…తాము ఏం చేయాలని మంత్రి రోజా నిలదీసినట్టు తెలిసింది. ఒక వైపు వెరిఫికేషన్ సమయం సమీపిస్తుండడం, మరోవైపు అధికారుల నుంచి తగినంతగా భరోసా లభించకపోవడంతో అధికార పార్టీ నేతల్లో ఆందోళన కనిపిస్తోంది.
ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు తీసుకుంటున్న వారిలో ఎంత మంది ఓట్లు వేస్తారో తెలియదు కానీ, కోల్పోయిన లబ్ధిదారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అధికార పార్టీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో వ్యవహరిస్తారని అధికార పార్టీ నేతలు వాపోతున్నారు. దీంతో ఒక్కో ఇంట్లో నాలుగేసి ఓట్లు చొప్పున లెక్కేసుకున్న ఐదారు వేల ఓట్లు కోల్పోతామని రోజా వాదన. రోజాతో పాటు వైసీపీ ఎమ్మెల్యేల ఆవేదనను ముఖ్యమంత్రి జగన్ ఎంత వరకు పట్టించుకుంటారో చూడాలి.