ప్రత్యర్థులను దెబ్బ తీయడానికి టీడీపీ ఎలాంటి దుష్ప్రచారానికైనా ఒడిగడుతుంది. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గత ఎన్నికల్లో కొట్టిన దెబ్బను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఇంటికి సాగనంపితే తప్ప, టీడీపీకి మనుగడ లేదనే నిర్ణయానికి వచ్చింది. దీంతో జగన్‌ను సైకోగా చిత్రీకరిస్తూ, తద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. ఇందుకు ఎల్లో మీడియా విపరీత ప్రాధాన్యం ఇస్తోంది.
‘సైకో జగన్’ దూషణతో టీడీపీ ట్విటర్ వేదికగా ప్రచారం మొదలు పెట్టింది. ఈ ప్రచారం జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచిందంటూ టీడీపీ, ఎల్లో మీడియా సంబరపడుతోంది. ‘సైకో పాలన పోవాలి.. సైకిల్ పాలన రావాలి’ అనే నినాదంతో సోషల్ మీడియాలో ఆకట్టుకునే ప్రయత్నాన్ని టీడీపీ సోషల్ మీడియా చేస్తోంది. ఇప్పుడు లేటెస్ట్ హిట్ పాట ఇదే అంటూ ఒక నిమిషం పది సెకెండ్లున్న వీడియోని ట్విటర్‌లో ప్రదర్శనకు పెట్టారు.
ఆ వీడియోలో దృశ్యాలను చూస్తే… సైకోలు తప్ప, మరొకరు ఇలాంటి పని చేయరనే అభిప్రాయం కలుగుతుందని వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు విమర్శిస్తున్నారు. ఊరికే సైకిల్ రావాలని కోరుకుంటే అది అయ్యే పనేనా? అని వారు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ నేతలకు చిత్తశుద్ధి వుంటే తమ మ్యానిఫెస్టోలో అమలుకు నోచుకోని పథకాలేవో చెప్పి నిలదీయాలని డిమాండ్ చేస్తున్నారు.
పాలనాపరంగా, అలాగే విధానాలపై విమర్శలు చేయకుండా, పిచ్చి పట్టిన వారి మల్లే జగన్‌ను సైకో అని విమర్శించడం, రైమింగ్ కోసం సైకిల్ రావాలని కోరుకోవడం వృథా ప్రయాసే అని విమర్శిస్తున్నారు. ఇంతా చేసి…టీడీపీకి సోషల్ మీడియాలో ఉన్న బలం దృష్ట్యా ఆ వీడియోకు వ్యూస్ చూస్తే, ఎంతటి నిరాదరణ ఎదురవుతోందో అర్థం చేసుకోవచ్చని వెటకరిస్తున్నారు.