Advertisement

Advertisement


Home > Movies - Reviews

Veera Simha Reddy Review: మూవీ రివ్యూ: వీర సింహా రెడ్డి

Veera Simha Reddy Review: మూవీ రివ్యూ: వీర సింహా రెడ్డి

చిత్రం: వీర సింహా రెడ్డి
రేటింగ్: 2.25/5
తారాగణం: నందమూరి బాలకృష్ణ, శ్రుతి హాసన్, దునియా విజయ్, హనీ రోజ్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు
కెమెరా: రిషి పంజాబి
ఎడిటింగ్: నవీన్ నూలి
సంగీతం: తమన్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి 
కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: గోపీచంద్ మలినేని
విడుదల: 12 జనవరి 2023

"అఖండ" విజయం తర్వాత "అన్ స్టాపబుల్" తో వచ్చిన క్రేజుతో పండగ సీజన్లో బాలకృష్ణ "వీర సింహా రెడ్డి" తో వచ్చాడు. అలాగే "క్రాక్" విజయం తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఇదే. కనుక అంచనాలు సహజంగానే ఎక్కువగా ఉంటాయి. దానికి తోడు ట్రైలర్ బాగుండడంతో ఈ పండక్కి ఫుల్ డోస్ వినోదాన్ని అందించగలిగే చిత్రంగా నిలబడుతుందని ఆశలూ చిగురించాయి. 

తెర మీద టైటిల్స్ పడుతుండగా తొలి సీన్ మొదలవుతుంది. బాలకృష్ణ సినిమా అనగానే గుర్తురావల్సింది బోయపాటి మాత్రమే కాదు, తన పేరు కూడా వినపడాలి అనేంత శ్రద్ధగా ఆ తొలి సీన్ ని తెరకెక్కించాడు గోపీచంద్ మలినేని. ఓపెనింగ్ గ్రిప్పింగ్ గా ఉండడంతో సినిమా మొత్తం అలాగే ఉంటుందన్న నమ్మకం కలుగుతుంది. అయితే మలి సీన్ నుంచి ఆ నమ్మకాన్ని తుడిచేయడం మొదలుపెట్టాడు. 

ఇంతకీ విషయమేంటంటే..టర్కీలోని ఇస్తాంబుల్ లో మీనాక్షి (హనీ రోజ్) తన కొడుకు జయ సింహా రెడ్డితో (బాలకృష్ణ) ఉంటూ రాగి సంకటి కోడి కూర వండి పెట్టే ఒక రెస్టారెంట్ నడుపుకుంటూ ఉంటుంది.

ఇక్కడ సీన్లో తల్లిగా కనిపించే హనీరోజ్ ముఖం మీద ముడతలుండవు కానీ కొడుకుగా కనిపించే బాలకృష్ణకి మాత్రం కళ్ల కింద క్యారీబ్యాగులు, మెడ కింద ముడతలు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటాయి. కనీసం గ్రాఫిక్స్ లో అయినా ఆ ముడతల్ని, క్యారీ బ్యాగుల్ని కవర్ చేసి ఉంటే చూసే వాళ్లకి వాళ్లు తల్లీకొడుకులు అనిపించేవాళ్లు. అభివృద్ధి చెందిన టెక్నాలజీని వాడుకోవడం కూడా తెలియాలి. 

ఇంతకీ ఈ బాలకృష్ణ లోకల్ గా ఉన్న ఒక అమ్మాయిని (శ్రుతి హాసన్) ఇష్టపడతాడు. ఆ జంటకి సంబంధం మాట్లాడి పెళ్లి చేసేందుకు పులిచర్లలో ఉన్న వీరసింహా రెడ్డిని (పెద్ద బాలకృష్ణ) పిలుస్తుంది. ఈ ముగ్గురితో పాటూ వీర సింహా రెడ్డి చెల్లెలు భానుమతి (వరలక్ష్మి), ఆమె భర్త ప్రతాప్ రెడ్డి (దునియా విజయ్) లతో ముడిపడి ఉన్న రివెంజ్ డ్రామా ఈ చిత్రం. పాత్రల పరిచయమే తప్ప కథ వివరాల్లోకి వెళ్లట్లేదు. 

ఈ పాత్రలతో బాలకృష్ణకి ఒక కథ రాయమంటే ఇన్నాళ్లూ సినిమాలు చూసిన అనుభవంతో ఒక కథ రాసేయడం కష్టం కాదు. ఈ చిత్ర బృందం కూడా అదే పని చేసింది. ఇద్దరు బాలకృష్ణలు..ఒకర్ని రివీల్ చేసి రెండవ క్యారెక్టర్ ని ఏ ఇంటర్వల్ ముందో రివీల్ చేయడం, ఒక ఫ్లాష్ బ్యాక్, పగ, ప్రతీకారం...ఈ దినుసులన్నీ దంచి కొట్టి మసాల నూరితే కథైపోతుంది. అంతా రొటీనే అయినా బాలకృష్ణ చెల్లెలు వరలక్ష్మి ట్రాక్ మాత్రం కొత్తగా రాసుకున్నాడు. ఆ ఒక్కటీ మెచ్చుకోవచ్చు. తక్కినదంతా రసం లేని పిప్పి మాత్రమే. 

ఇంతకీ పైన మలి సీన్ నుంచి నమ్మకం తుడిపేసాడని చెప్పుకుంటున్నాం కదా! అదే ఇస్తాన్ బుల్ లో చిన్న బాలకృష్ణ ట్రాక్. అక్కడ సీన్ మొదలైనప్పటి నుంచి ఏదో తెడా కొడుతున్న ఫీలింగ్ మొదలౌతుంది. శ్రుతి హాసన్ పాత్ర ఎంటరవగానే చిరాకు స్టార్ట్ అవుతుంది. "వాయిస్ ఆఫ్ యూరప్" అనే ప్రోగ్రాములో ఎఫ్3 లో మెహ్రీన్ మాదిరిగా అపశ్రుతిలో పాట పాడుతూ శ్రుతి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంది. ఆ కార్యక్రమానికి జడ్జిలు బ్రహ్మానందం, ఆలి. ఇంత సెటప్పున్నా ఒక్క నవ్వు కూడా తెప్పించకుండా విసుగు తెప్పించేలా ఆ సీన్, డైలాగ్ రాసుకోవడం ఈ దర్శక రచయితలకే చెల్లింది. శ్రుతి చేత గట్టిగా అరిపిస్తూ, సప్తగిరితో ఏదో నవ్వురాని పిచ్చి కామెడీ వగైరాలు చేయించారు. ఈ సన్నివేశాలు పెట్టిన చిరాకు వల్ల ఆమె కారు షెడ్డులో అద్భుతమైన నాట్యప్రతిభని చూపించినా కూడా ఆస్వాదించలేని పరిస్థితి ప్రేక్షకులది. కథనం గాడి తప్పి ఎటో పోతున్న ఫీలింగ్ పెరుగుతూ ఉంటుంది క్రమంగా. 

వీటికి తోడు బుర్రతక్కువ డైలాగ్స్ కూడా తోడయ్యాయి. చిన్న బాలయ్య టర్కీలో ఒక ఫైట్ చేస్తాడు. 

ఆ ఫైట్లో ఒకడిని కొట్టగానే "వావ్ వాటే పంచ్ పవర్" అంటుంది అక్కడున్న ఒక ఫారినర్. దానికి సమాధానంగా బాలయ్య "దిస్ ఈజ్ ది పవర్ ఆఫ్ రాగిసంకటి అండ్ నాటు కోడి పులుసు" అని చెప్తాడు.

"కల్చర్ లేదనుకున్నా..గన్ కల్చర్ ఉందా" లాంటి పసలేని బలవంతపు లైన్లు కూడా బలం లేని సన్నివేశాలని మరింత బలహీనపరిచేలా ఉన్నాయి. 

"సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో. కానీ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు.." అనే డైలాగ్ బలవంతంగా రాజకీయవివాదం కోసం పెట్టిందే తప్ప అసలు కథలో అవసరమే లేదు, పొసగలేదు కూడా. 

అలాగే హోం మినిస్టర్ తో సీన్ కూడా. ఈ తెదేపా సానుకూల డైలాగ్స్ రాజకీయాలు ఫాలో అయ్యే ఒక వర్గం ప్రేక్షకులకి నచ్చచ్చేమో తప్ప మిగిలిన వాళ్లు డాట్స్ కనెక్ట్ చేసుకోలేక ఇబ్బంది పడాలి. 

"నీకు పదవి చూసుకుని పొగరేమో..బై బర్త్ నా డి.ఎన్.ఎ కే పొగరెక్కువ" అనే డైలాగుంది. డి.ఎన్.ఎ అంటే తలకాయలు నరకడమా? తెర మీద పాత్ర చేసే పని అదే మరి. 

"ముండ", "ముండమోపి", "కొడక" అంటూ సి-గ్రేడ్ డైలాగ్స్ ఆద్యంతం వినిపిస్తాయి. 

అన్ని వర్గాల ప్రేక్షకులు కొన్న టికెట్ కి పూర్తిగా న్యాయం చేయడం సినిమా కానీ, అభిమానులకి పంచ్ డైలాగులు బిచ్చమేయడం కాదని రచయిత తెలుసుకోవాలి. తెలుగు చిత్రపరిశ్రమకి ఉన్న విలువని కాపాడుకోవాలి కానీ ఉన్న పరిశ్రమ పరువుని సి-గ్రేడ్ భావజాలంతో పోగొట్టడం కాదని కూడా అర్ధం చేసుకోవాలి. హీరోగారి పార్టీకి పదవి లేదన్న బాధతో చేతికొచ్చినట్టు రాయకుండా కథ మీద చిత్తశుద్ధిని డి.ఎన్.ఎ లో పెట్టుకుని రాయాలి. 

ఈ సినిమాలో మంచి ఏదైనా ఉంటే అది కెమెరా వర్క్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. ఈ రెండు విభాగాలు బెస్ట్ అనిపించేలా పని చేసాయి. పాటలు పర్వాలేదు. 

కానీ ఎడిటింగ్ మాత్రం సహనపరీక్ష పెట్టింది. విపరీతమైన డ్రాగ్ ఉన్న ద్వితీయార్ధం ప్రేక్షకుల నెత్తిమీద గుదిబండలా మారింది. 

ఫైట్ మాస్టర్లకి సినిమా అప్పజెప్పేసి దర్శకుడు రిలాక్సైపోయాడా అనేంత రేంజులో ఉన్నాయి ఇందులోని ఫైట్స్. తెర మొత్తం రక్తంతో తడిసిపోయింది. చేతులు, తలలు గొడ్డలి దెబ్బలకి తెగి రక్తం చిమ్ముకుంటూ గాలిలో ఎగురుతూనే ఉంటాయి. 

ఈ రక్తపాతం రాయలసీమ సీన్స్లోనే కాకుండా ఇస్తాన్ బుల్ లో కూడా పెట్టారు. అసలంత మంది రాయలసీమ హంతకులు వేట కొడవళ్ళు పట్టుకుని ఆ దేశం వెళ్లడమేంటో, టర్కీ రోడ్ల మీద పరుగెత్తుకుంటూ చేతులు, తలలు నరుక్కోవడమేంటో అర్ధం కాదు. అసలా ఆయుధాలు వీళ్లు ఫ్లైటెక్కేటప్పుడు చెకిన్ లో వేసారా, లేక క్యాబిన్ బ్యాగేజులో తెచ్చుకున్నారా లాంటి డౌట్లు బేసిక్ కామన్ సెన్స్ ఉన్న ప్రేక్షకులకి కలుగుతాయి. బహుశా ఆ సెన్స్ బాలకృష్ణ సినిమాలు చూసేవాళ్లకి ఉండదని, ఉన్నా పనిచెయ్యదని మలినేనికి బలమైన నమ్మకమేమో. 

నటనపరంగా బాలకృష్ణ ఎప్పటిలాగా తనదైన పద్ధతిలో చేసాడు. మనోభావాలు పాటలో స్టెప్స్ కూడా ఎనెర్జెటిక్ గా బాగున్నాయి.  

శ్రుతి హాసన్ ని మాత్రం ఆటలో అరటిపండుని చేసేసారు. మరోసారి తెలుగు సినిమా అంటే ఆమె మొత్తం స్క్రిప్ట్ తెప్పించుకుని తన పాత్ర ఏవిటో తెలుసుకుంటే తప్ప మాట్లాడదేమో. 

దునియా విజయ్ చాలా రఫ్ గా కనిపించాడు. వరలక్ష్మి వేరియేషన్స్ ఉన్న పాత్రలో మెప్పించింది. 

అభిమానులకి కూడా ఏవరేజ్ అనిపించే సినిమా ఇది. కానీ సత్యం చెప్పడానికి మనస్కరించక అద్భుతమని చెప్పుకోవచ్చు. రక్తపాతం, తలలు నరుక్కోవడం, గట్టిగా అరుచుకోవడం నచ్చి బాలకృష్ణ మీద వీరాభిమానం ఉంటే ఈ సినిమా చూడొచ్చు. లేకపోతే ఒకసారి ఆలోచించుకోవచ్చు. 

బాటం లైన్: వీర నరుకుడు రెడ్డి

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా