వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను “సాక్షి” దినపత్రిక పక్కన పెట్టింది. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో శనివారం వైఎస్సార్‌ఘాట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తల్లి విజయమ్మ, భారతి, షర్మిల తదితర కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. అన్నాచెల్లెళ్లు వేర్వేరు సందర్భాల్లో తండ్రికి నివాళులర్పించడం చర్చనీయాంశమైంది.
అయితే వైఎస్సార్‌కు నివాళులర్పించిన షర్మిలను సాక్షి దినపత్రిక అసలు పట్టించుకోకపోవడం గమనార్హం. వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్న పలువురు ప్రముఖుల ఫొటోలను సాక్షిలో ప్రచురించారు. అయితే షర్మిలకు కాసింత చోటు సాక్షిలో దక్కకపోవడం విశేషం. కేవలం షర్మిల కూడా వైఎస్సార్‌కు నివాళి అర్పించారనే ఏక వాక్యంతో, అది కూడా జగన్ వార్తలో కలిపేసి రాయడం గమనార్హం.
అన్నాచెల్లెలి మధ్య విభేదాలున్న సంగతి తెలిసిందే. రాజకీయం ఇద్దరి దారుల్ని వేరు చేసింది. ఒకప్పుడు జగన్ అన్న వదిలిన బాణం తాను అని షర్మిల గర్వంగా ప్రకటించుకున్నారు. ఇప్పుడు అదే షర్మిల తెలంగాణలో సొంత రాజకీయ కుంపటి పెట్టుకున్నారు. దీంతో షర్మిల రాజకీయాలతో తమకు సంబంధం లేదని వైసీపీ తేల్చి చెప్పింది.
తాజాగా షర్మిల తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దివంగత వైఎస్సార్‌పై ఎఫ్ఐఆర్‌తో కాంగ్రెస్‌కు సంబంధం లేదని ఆమె చెప్పారు. ఈ నేపథ్యంలో షర్మిలను మిగిలిన ప్రతిపక్షాల నేతలను చూసినట్టే, సాక్షి మీడియా చూడడం విశేషం. అందుకే వైఎస్సార్‌కు నివాళులర్పించిన షర్మిలకు సాక్షిలో కాసింత చోటు కరువైంది.