వినేవాళ్లుంటే చంద్రబాబు ఎన్నైనా, ఏమైనా చెబుతారు. టీడీపీని గెలిపిస్తే చందమామను తీసుకొచ్చి ఒళ్లో పెడ్తానని చంద్రబాబు చెప్పే రకం. నమ్మే వాళ్లుంటే ఎంత మందినైనా ఆయన మాయ చేస్తారని బాబు గురించి బాగా తెలిసిన వాళ్లు చెప్పేమాట. టీడీపీకి సానుకూల ఫలితాలను తీసుకుని, ఇక మనదే రాజ్యమని చంద్రబాబు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. స్వయంగా తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో బొక్క బోర్లా పడడాన్ని ఆయన ఎంతో కన్వినియంట్గా విస్మరించారు.
ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని టీడీపీ నియోజకవర్గాల ఇన్చార్జ్లతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లో మనమే గెలిచామన్నారు. పంచాయతీ ఎన్నికల్లో సినీ హీరో కృష్ణ గారి ఊరు బుర్రిపాలెంలో 920 ఎస్సీ ఓట్లు వుంటే, వైసీపీకి 246 ఓట్లు మాత్రమే పడ్డాయన్నారు. ఎస్సీల్లో మార్పు మొదలైందనేందుకు ఇదే నిదర్శనమన్నారు.
అలాగే ప్రకాశం జిల్లాలోని పాకల పంచాయతీలో ఏడు వేల ఓట్లున్నాయని, వైసీపీ ఐదు వేలు పంచినా, మనవాళ్లను అరెస్ట్ చేసినా, 1995 నాటి మెజార్టీ ఇప్పుడు వచ్చిందంటే మార్పు ఏ విధంగా ఉందో అర్థమవుతోందన్నారు. ఇంత వరకూ బాగానే వుంది. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో కుప్పం ఫలితాల గురించి చంద్రబాబు ఎందుకు చెప్పలేదనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఎందుకంటే స్వయంగా తాను ఎమ్మెల్యేగా ఉన్న చోట టీడీపీ వ్యతిరేక ఫలితాలు మూటకట్టుకుంది.
టీడీపీ గాలి వీస్తోందని చంద్రబాబు నమ్ముతుంటే, కుప్పంలో తన అడ్డాలో ఎందుకు గెలవలేదో కనీసం ఆత్మపరిశీలన చేసుకున్న దాఖలాలు కూడా లేవు. కుప్పం నియోజకవర్గంలో ఆరు వార్డులకు ఉప ఎన్నికలు జరగ్గా, కేవలం ఒక్కటంటే ఒక్క చోటే టీడీపీ మద్దతుదారు గెలుపొందారు. వైసీపీ నాలుగు చోట్ల గెలుపొందగా, ఒక స్థానాన్ని అధికార పార్టీ ఏకగ్రీవం చేసుకుంది.
మరీ ముఖ్యంగా చంద్రబాబు ఇల్లు కట్టుకుంటున్న శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీలో 10వ వార్డులో కూడా వైసీపీ మద్దతుదారే గెలవడం విశేషం. వీటి గురించి మాత్రం చంద్రబాబు నోరు తెరవరు. ఒకట్రెండు చోట్ల స్థానిక నాయకుల పలుకుబడితో గెలిస్తే, అది తన ఖాతాలో వేసుకోవడం చంద్రబాబుకే చెల్లింది. ఎక్కడైనా ఎవరైనా గెలిస్తే టీడీపీ విజయం, ఓడితే మాత్రం తమకు సంబంధం లేదని చంద్రబాబు మౌనంతో చెబుతున్నారు. చంద్రబాబు మార్క్ రాజకీయానికి ఇదే నిదర్శనం.