దేశంలో ఒకేసారి ఎన్నికలు అయిపోతే ఆ తర్వాత ఐదేళ్ల వరకూ ఎన్నికల ప్రసక్తి ఉండదనేది ప్రధానమంత్రి నరేంద్రమోడీ భావన! ఒకదాని తర్వాత మరో ఎన్నికలు వస్తూ ఉండటం ప్రగతికి ఆటంకం అని మోడీ భావిస్తున్నారు! అయితే.. ఏ రాష్ట్రంలో ఎన్నికలు అంటే ఆ రాష్ట్రం చుట్టూరానే తిరుగుతూ, ఆ రాష్ట్రంలో అంతకు ఏడాదికి ముందు నుంచినే కనిపిస్తూ.. ఎన్నికలు జరిగే రాష్ట్రంలో నెల రోజులకు పైనే ప్రచారం చేయడానికి సమయం కూడా కేటాయించే నరేంద్రమోడీ, ఇలా దేశంలో ఒకేసారి ఎన్నికలు అయిపోవాలని అనుకుంటూ ఉండటం కాస్త ఆశ్చర్యకరం.
బహుశా ఇలా ఎన్నికలు జరిగే రాష్ట్రాల చుట్టూ తిరగడం వేరే పనులకు ఆటంకం అని మోడీ అనుకుంటున్నారేమో! గతంలో ప్రధానులు ఎవ్వరూ ఇలా రాష్ట్రాల ఎన్నికల్లో తనే సీఎం అభ్యర్థిని అయినట్టుగా తిరిగే వారు కాదు. రాష్ట్రాల ఎన్నికలను ఆ రాష్ట్రంలోని పార్టీ క్యాడర్ కు అప్పగించేసి తమ పని తాము చేసుకునే వారు.
మన్మోహన్ సింగ్ అయితే ఎన్నికల ప్రచారానికి చుట్టం చూపుగా వెళ్లే వారు. అంతకు ముందు వాజ్ పేయి కూడా లోక్ సభ ఎన్నికల సమయంలో బాధ్యతగా తిరిగే వారు. ఎన్నికల మంత్రాగాన్ని పార్టీ నేతలకు అప్పగించే వారు. ప్రధాని హోదాలో ఒకటీ రెండు సభల్లో పాల్గొని ఓట్లు అడిగే వారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఆ రాష్ట్రంలో తనే సీఎం క్యాండిడేట్ అన్నట్టుగా ప్రచారం చేసే ప్రధాని ఇప్పటి వరకూ ఎవరైనా ఉన్నారంటే అది మోడీ మాత్రమే! మరి ఇలాంటి ఎన్నికలన్నీ ఒకేసారి అయిపోవాలని, లోక్ సభ ఎన్నికలతో పాటే మొత్తం తతంగం ముగియాలని మోడీ కోరుకుంటున్నారు. ఆ తర్వాత ఐదేళ్ల వరకూ ఇక ఎన్నికలనే ముచ్చట ఉండదకూదని అంటున్నారు! ఐదేళ్లుగా ఇందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.
అయితే బేసిక్ లాజిక్ కు కూడా ఈ ఆలోచన అందకపోవడంతో ప్రజల నుంచి ఈ ఆలోచనకు పెద్ద మద్దతు లేదు. మనది ప్రజాస్వామ్యం. ఇక్కడ ప్రభుత్వాల ఏర్పాటే కాదు, ప్రభుత్వాలు కూలిపోవడం కూడా జరుగుతుంది. రాష్ట్రాల ఎన్నికలు, కేంద్రం ఎన్నికలు వీటిని వేర్వేరుగా చూస్తారు ప్రజలు. రాష్ట్రంలో ఒక పార్టీకి అధికారం ఇచ్చి, కేంద్రంలో మరో పార్టీని ఎన్నుకోవడం కూడా భారత ప్రజాస్వామ్యంలో ఉన్న భిన్నత్వం. అలాగే ప్రజలు హంగ్ తరహా తీర్పులు ఇవ్వడం, బోటాబోటీ మెజారిటీతో ప్రభుత్వాలు ఏర్పడటం, అవి కూలిపోయే పరిస్థితులు రావడం కూడా ఈ ప్రజాస్వామ్యంలో సహజంగా జరిగేవే! హంగ్ తరహా పరిస్థితులు వచ్చి.. ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేనప్పుడు తిరిగి ఎన్నికలు జరపడం కూడా ఇది వరకూ జరిగింది. లోక్ సభకే పలు సార్లు మధ్యంతర ఎన్నికలు వచ్చాయి!
మరి ఇలాంటి చోట జమిలి ఏమిటి? అన్నీ ఒకేసారి జరిగాలంటే.. మిగతా వన్నీ వాయిదా వేస్తారా? ఏదైనా రాష్ట్రంలో ప్రభుత్వాలు మధ్యంతరానికి వెళ్లాలంటే దానికి కేంద్రం అనుమతిని ఇవ్వదా! రాజ్యాంగం ప్రకారం అయితే.. అధికారంలో ఉన్న వారు తమ ప్రభుత్వాన్ని రద్దు చేసుకుని మళ్లీ ప్రజాతీర్పు కోరవచ్చు. ఇది భారత ప్రజాస్వామ్యంలో ఉన్న సానుకూలమైన అంశమే.
ఎన్నికల వల్ల ప్రజలపై భారం, ఖర్చు అనేది డొల్ల వాదన! నిజమే ఖర్చు జరుగుతుంది దాన్ని ఎవ్వరూ కాదనరు! కానీ ఎన్నికలనేవి ప్రజాస్వామ్యం పరిణతికి నిదర్శనం. ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామ్య దేశాలన్నీ ఎన్నికలు జరిగితే అంత పరిణతి చెందాయి తప్ప.. ఎన్నికల వల్ల ఏ ప్రజాస్వామ్య దేశం నష్టపోలేదు! స్పష్టమైన మెజారిటీలు రాలేదని కూడా మళ్లీ మళ్లీ ఎన్నికలు నిర్వహించే దేశాలున్నాయి! మరి అక్కడ కూడా ఎన్నికలు ఖర్చుతో కూడుకున్న అంశమే కదా!
అయినా పార్లమెంట్ లో సబ్సిడీ ధరలకు భోజనాలు చేసే రాజకీయ నేతలు ఎన్నికలు, ఖర్చు అంటూ వాపోవడం విచిత్రం! ప్రజల ధనంపై నేతలకు ఉన్న బాధ్యత ఎంతో అనునిత్యం చూస్తూనే ఉన్నాం! విచ్చలవిడిగా అవినీతి, నేతల వాటాలు, కమిషన్లు.. ప్రభుత్వ వ్యవస్థలు అవినీతి మయం కావడం.. వీటన్నింటినీ కట్టడి చేసినా.. తర్వాత అప్పుడు ఎన్నికల ఖర్చు గురించి మాట్లాడితే మంచిదేమో!
అయినా ప్రయోగాలు మోడీకి కొత్తకాదు. మారకంలోని నోట్లను రద్దు చేసి రాత్రికి రాత్రి వంద కోట్ల మందిని బ్యాంకుల ముందు క్యూల్లో నిలబెట్టారు. నోట్ల రద్దుతో నల్లధనం, అవినీతి అణుమాత్రం తగ్గలేదు! అదేమంటే మాస్టర్ స్ట్రోక్ అంటూ ప్రచారం చేసుకున్నారు. మరి అలాంటి విఫల ప్రయోగం తర్వాత.. జీఎస్టీని తెచ్చి బాదుడును మరింత పెంచారు. ఇప్పుడు ఒక దేశం ఒకే ఎన్నిక అంటూ మరో తీవ్రమైన ప్రయోగంతో మోడీ అటాడుకోబోతున్నట్టుగా ఉన్నారు! అధికారంలోకి రావడం వరకూ ఏవేవో చెప్పిన మోడీ, పదేళ్ల పాలన తర్వాత కూడా అచ్చీబుచ్చీ ప్రయోగాలే చేస్తూ ఉండటం విషాదకరం!