దేశ‌మంతా ఒకే పార్టీ, ఒకే అధికారం…!

మోదీ స‌ర్కార్‌పై సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి కె.నారాయ‌ణ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. జ‌మిలి ఎన్నిక‌ల పేరుతో కేంద్ర ప్ర‌భుత్వం కొత్త చ‌ర్చ‌కు తెర‌లేపిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా దేశ‌మంతా ఒకేసారి ఎన్నిక‌లు జ‌ర‌పాల‌నే విష‌య‌మై…

మోదీ స‌ర్కార్‌పై సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి కె.నారాయ‌ణ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. జ‌మిలి ఎన్నిక‌ల పేరుతో కేంద్ర ప్ర‌భుత్వం కొత్త చ‌ర్చ‌కు తెర‌లేపిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా దేశ‌మంతా ఒకేసారి ఎన్నిక‌లు జ‌ర‌పాల‌నే విష‌య‌మై చ‌ర్చిస్తున్నారు. అయితే కేంద్ర ప్ర‌భుత్వం ఒక అడుగు ముందుకేసి, జ‌మిలి ఎన్నిక‌ల‌కు సంబంధించి సాధ్యాసాధ్యాల‌పై మాజీ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక క‌మిటీని వేసింది.

ఈ క‌మిటీ ఏర్పాటుపై సీపీఐ జాతీయ నాయ‌కుడు నారాయ‌ణ అభ్యంత‌రం తెలిపారు. దేశం మొత్తం ఒకే పార్టీ, ఒకే అధికారం వుండాల‌ని ప్ర‌ధాని మోదీ భావిస్తున్నార‌న్నారు. గ‌తంలో కొన్ని ప‌రిస్థితుల వ‌ల్ల బీజేపీ దేశ స్థాయిలో గెలిచింద‌న్నారు. ఇప్పుడు బీజేపీ వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయ‌ని ఆయ‌న అన్నారు.

మ‌ణిపూర్‌లో ఘ‌ట‌న‌లు అత్యంత బాధాక‌ర‌మ‌న్నారు. వాటిని మ‌రుగుప‌రిచి మ‌తం ప్రాతిప‌దిక‌న ఎన్నిక‌లు జ‌ర‌గాల‌ని బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. జ‌మిలీ ఎన్నిక‌లంటూ ఇప్పుడు మ‌ళ్లీ నాట‌కానికి తెర‌లేపార‌ని విమ‌ర్శించారు. అన్ని రాజ‌కీయ పార్టీల‌తో మోదీ స‌ర్కార్ చ‌ర్చించ‌లేద‌న్నారు. రాజ‌కీయ పార్టీలతో చ‌ర్చించ‌కుండా రాజ్యాంగ మార్పు, స‌వ‌ర‌ణ ఎలా చేస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

న్యాయ వ్య‌వ‌స్థ‌లాంటి వాటిని మార్చేశార‌ని మోదీ ప్ర‌భుత్వంపై సంచ‌ల‌న ఆరోప‌ణ చేశారు. ఇండియా కూట‌మి బ‌ల‌ప‌డ‌డంతో బీజేపీ భ‌య‌ప‌డుతోంద‌ని ఆయ‌న అన్నారు. జ‌మిలీ ఎన్నిక‌ల‌పై కేంద్ర ప్ర‌భుత్వం వేసిన క‌మిటీ బోగ‌స్ అని ఆయ‌న విమ‌ర్శించారు. దాన్ని తాము బ‌హిష్క‌రిస్తున్నామ‌ని సీపీఐ నాయ‌కుడు నారాయ‌ణ ప్ర‌క‌టించ‌డం విశేషం. ఈ క‌మిటీని అంతా క‌లిసి నిర్వీర్యం చేయాలని ఆయ‌న పిలుపునిచ్చారు. మోదీ స‌ర్కార్ ఈ సారి ఎట్టి ప‌రిస్థితుల్లో రాద‌ని నారాయ‌ణ జోస్యం చెప్పారు. 

ఇందుకు ప్ర‌ధాన కార‌ణం బీజేపీ స‌ర్కార్ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను అవ‌లంబించ‌డ‌మే అని ఆయ‌న చెప్పారు.