ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. జమిలి ఎన్నికలు వచ్చేస్తున్నాయన్న ప్రచారం ఊపందుకుంది. దీంతో రాజకీయ పార్టీలు అప్రమత్తం అవుతున్నాయి. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని నాయకులు, కార్యకర్తలకు అధిష్టానాలు ఆదేశాలు ఇచ్చాయి. దీంతో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కోడానికి నేతలు సిద్ధపడుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఎన్నికలపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జమిలి లేదా సాధారణ ఎన్నికలు వచ్చినా మళ్లీ సీఎం అయ్యేది జగనే అని ఆయన అన్నారు. ఒంటరిగా పోటీ చేసే సత్తా చంద్రబాబుకు లేదని వైవీ అన్నారు. అందుకే బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు. చంద్రబాబు ఎన్ని వేషాలు వేసినా, ఎంత మందితో కలిసి వచ్చినా మళ్లీ అధికారంలోకి వచ్చేది మాత్రం జగనే అని ఆయన తేల్చి చెప్పారు.
చంద్రబాబుకు అందిన ఐటీ నోటీసులపై కూడా వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. చంద్రబాబు అవినీతికి పాల్పడడం వల్లే ఐటీ నోటీసులు వచ్చాయన్నారు. తన పాలనలో రాష్ట్రాన్ని చంద్రబాబు అడ్డంగా దోచుకున్నారని ఆరోపించారు. టీటీడీ చైర్మన్ పదవీ కాలం ముగియడంతో వైవీ సుబ్బారెడ్డి పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి సారించారు.
ఉత్తరాంధ్రలో వైసీపీ కార్యకలాపాలను ఆయన చూస్తున్నారు. గతంలో ఆయన ఒంగోలు ఎంపీగా పని చేశారు. అయితే రాజకీయ సమీకరణల్లో భాగంగా వైవీని ప్రత్యక్ష రాజకీయాలకు సీఎం జగన్ దూరం పెట్టారు. దీంతో కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ, అధిష్టానం ఆదేశాలను పాటిస్తున్నారు.