కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిలో తీవ్ర ఒత్తిడి పెంచాయి. బాబు నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఇలాంటి భయాందోళనకు గురి కాలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. చంద్రబాబు అనేక సంక్షోభాలను ఎదుర్కొన్నారని, కానీ రాజకీయ చరమాంకదశలో కుప్పం మున్సిపాలిటీ కలవరపెడుతోందని అభిప్రాయపడుతున్నారు.
కుప్పం మున్సిపాలిటీలో ఢీ అంటే ఢీ అని ఇరు పార్టీల నాయకులు తలపడుతుండడంతో నిజమైన ఫలితం ఏంటో తెలిసి రానుంది. గత ఏడాదిన్నర క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడి, ఏకపక్షంగా ఏకగ్రీవాలు చేసుకుందని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శించాయి. కానీ తాజాగా అలాంటి వాతావరణం లేదు. నామినేషన్లను దిగ్విజయంగా వేసుకున్నారు. పోటాపోటీగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇక ప్రజాతీర్పే వెలువడాల్సి వుంది.
ఈ నేపథ్యంలో కుప్పం మున్సిపాలిటీ ప్రజల తీర్పు ఏ విధంగా ఉండనుందో అనే ఆందోళన బాబును వెంటాడుతోంది. దీంతో ప్రతిరోజూ మూడు పూటలా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఆయన తాను నియమించుకున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి అమర్నాథరెడ్డి, ఎమ్మెల్సీ దొరబాబు, జిల్లా పార్టీ అధ్యక్షుడు పులివర్తి నానితో ఫోన్లో మాట్లాడుతూ పర్యవేక్షిస్తున్నారని తెలిసింది. ముఖ్యంగా తనకు విద్యార్థి దశ నుంచి శత్రువైన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మకాం వేయడంతో చంద్రబాబు భయపడుతున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.
ఒక మున్సిపల్ ఎన్నిక కోసం చంద్రబాబు రోజులో మూడుసార్లు ఫోన్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందని టీడీపీ నేతలే చెబుతున్నారు. దీన్ని బట్టి కుప్పం మున్సిపాలిటీ గెలుపు టీడీపీకి ఎంత ప్రతిష్టాత్మకమో అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా వుండగా తన పార్టీ వ్యూహాల కంటే ప్రత్యర్థుల కదలికలపై బాబు పదేపదే ఆరా తీస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి కెపాసిటీ ఏంటో తనకు తెలుసునని, తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మి చేయగల సమర్థుడని, కావున ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చంద్రబాబు హెచ్చరిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మరోవైపు చంద్రబాబు వ్యూహాలు తెలిసిన మంత్రి పెద్దిరెడ్డి ఎప్పటికప్పుడు ప్రత్యర్థులను ఏమార్చుతూ పార్టీ శ్రేణుల్ని కదనరంగం వైపు దూసుకెళ్లేలా ప్లాన్ వేస్తున్నారని తెలిసింది. ఇలా చంద్రబాబు, మంత్రి పెద్దిరెడ్డిల ఎత్తులు పైఎత్తులతో కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి.
తమకు కంచుకోటైన కుప్పంలో విజయానికి ఢోకా ఉండదని టీడీపీ నమ్మకంగా ఉంది. మరోవైపు కంచు కోటల్ని బద్దలు కొట్టిన చరిత్ర తమకుందని, అదే కుప్పంలో పునరావృతం అవుతుందని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.