రానున్నదంతా ఎన్నికల సీజనే. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు గెలుపే లక్ష్యంగా బలమైన అభ్యర్థుల వేటలో పడ్డాయి. ఈ క్రమంలో ఓ ప్రముఖ దివంగత నాయకుడి కుమారుడు, పారిశ్రామికవేత్త వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఆ నాయకుడు బెంగళూరులో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. గతంలో ఆయన తండ్రి ఎంపీగా, టీటీడీ చైర్మన్‌గా పని చేశారు. ఆయన తల్లి ఎమ్మెల్యేగా సేవలందించారు. తల్లిదండ్రులిద్దరూ భౌతికంగా లేరు.
బలిజ సామాజిక వర్గానికి చెందిన ఆ పారిశ్రామికవేత్తను వైసీపీలోకి తీసుకుంటే పార్టీకి రాజకీయంగా ప్రయోజనం వుంటుందనే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం బలిజ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ ప్రజాప్రతినిధిని మార్చి, ఆయన స్థానంలో ఆ పారిశ్రామికవేత్తను బరిలో నిలబెట్టనున్నట్టు తెలిసింది. టీడీపీ, జనసేన పొత్తు వుంటుందని ముమ్మర ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ పారిశ్రామికవేత్తను వైసీపీలో చేర్చుకోవడం ద్వారా ప్రతిపక్షాల కూటమిని దెబ్బతీయొచ్చని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పావులు కదిపినట్టు తెలిసింది.
ఇటీవల సీఎం జగన్‌తో సదరు పారిశ్రామికవేత్తను కూచోపెట్టినట్టు తెలిసింది. ఎన్నికలకు 15 నెలల సమయం వుండడంతో పార్టీలో చేరేందుకు మరికొంత కాలం ఆగాలని పారిశ్రామికవేత్తకు జగన్ సూచించినట్టు సమాచారం. ఇప్పుడే చేరితే తన పార్టీ ఎమ్మెల్యేలో అసంతృప్తికి బీజం వేసినట్టు అవుతుందనే ఉద్దేశంతో హోల్డ్‌లో పెట్టినట్టు సమాచారం.
వైసీపీలో చేరనున్న ఆ పారిశ్రామికవేత్తకు అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని బలిజ సామాజిక వర్గంలో బాగా పలుకుబడి వుంది. తన సామాజికవర్గంతో పాటు ఇతరులకు కూడా ఆ కుటుంబం ఆర్థికదన్నుగా నిలిచిందనే పేరు వుంది. ఆ పారిశ్రామికవేత్త వైసీపీలో చేరితే మాత్రం జనసేన, టీడీపీ కూటమికి రాజకీయంగా భారీ దెబ్బ అని చెప్పక తప్పదు.