మంగళగిరిలో లోకేశ్ ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి ఈ దఫా మారనున్నారా? అంటే…అధికార పార్టీ వర్గాలు ఔననే సమాధానం ఇస్తున్నాయి. మంత్రి హోదాలో నారా లోకేశ్ మంగళగిరి నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనే పట్టుదలతో లోకేశ్ ఉన్నారు. ఈ దఫా మళ్లీ ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మంగళగిరి నుంచే పోటీ చేసి, విజయాన్ని గిఫ్ట్‌గా ఇస్తానని ఆ మధ్య బహిరంగ సభలో లోకేశ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ దఫా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ …వై నాట్ 175/ 175 అనే నినాదంతో ముందుకెళుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో ఆయన తనయుడు నారా లోకేశ్‌ను ఓడించితీరాలనే పట్టుదలతో జగన్ ఉన్నారు. దీంతో ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నివేదికలను తెప్పించుకుంటూ, వ్యూహాలు రచిస్తున్నారు. మంగళగిరిలో పూర్తిగా రాజకీయ పంథా మార్చాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్టు వైసీపీ పెద్దల నుంచి సమాచారం అందుతోంది.
రాజధాని మార్పు వ్యవహారం మంగళగిరిలో అధికార పార్టీపై వ్యతిరేకత వ్యక్తమవుతోందని వైసీపీ పెద్దలు గ్రహించారు. దీంతో అక్కడి బలమైన సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా లోకేశ్‌కు మరోసారి చెక్ పెట్టొచ్చని సీఎం ఆలోచనగా చెబుతున్నారు. ఇందులో భాగంగా చేనేత వర్గానికి చెందిన నాయకుడిని బరిలో దింపనున్నట్టు తెలిసింది. అందుకే ఆ సామాజిక వర్గాలకు సంక్షేమ పథకాల్లోనూ, అలాగే రాజకీయంగా అధిక ప్రాధాన్యాన్ని జగన్ ఇస్తున్నారు.
ఆ నియోజకవర్గంలోని చేనేత ముఖ్య నాయకులను ఇప్పటికే వైసీపీ చేరదీసింది. ఎమ్మెల్సీ, అలాగే ఆ సామాజిక వర్గానికి చెందిన రాజకీయ పదవిని కూడా అదే నియోజకవర్గ నాయకుడికి ఇవ్వడం విశేషం. ఒకవైపు రాజధాని, పాలనాపరమైన వ్యతిరేకతను అధిగమించి, లోకేశ్‌ను ఓడించేందుకు రానున్న కాలంలో జగన్ పద్మవ్యూహం రచించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్న మాట.
జగన్ ఎప్పటికప్పుడు వేసే ఎత్తుగడలను తిప్పికొడితేనే లోకేశ్‌కు భవిష్యత్. పాదయాత్ర అంటూ తిరుగుతుంటే… మంగళగిరిలో ఏ విధంగా నెగ్గుకురాగలరో లోకేశ్ ఆలోచించుకోవాల్సి వుంటుంది. ప్రభుత్వంపై వ్యతిరేకతే తనను గెలిపిస్తుందని లోకేశ్ పగటి కలలు కంటే మాత్రం… 2019 ఎన్నికల ఫలితమే రిపీట్ అవుతుందని గ్రహించాల్సి వుంటుంది.