‘కర్రతో కొట్టడం, కర్రతో పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ ను పొడవడానికి ప్రయత్నించడం’ అనే సంఘటన జరిగినప్పుడు ఎలాంటి కేసు పెట్టాలి. క్షమించి వదిలేస్తే సరే.. కానీ.. అల్లరి మూకలకు బుద్ధి వచ్చేలాగా, రాజకీయ అండ చూసుకుని ఎలాగైనా చెలరేగిపోవచ్చునని అనుకునే వారికి చిన్న చెంపపెట్టులాగా చేయాలనుకుంటే మాత్రం కరెక్టయిన సెక్షన్ల కింద కేసులు పెట్టాల్సిందే. అలా చూసినప్పుడు కర్రతోనైనా సరే.. కడుపులో పొడవబోయిన ప్రయత్నానికి హత్యాయత్నం కేసుమాత్రమే నప్పుతుంది. పైగా ఆ హత్యాయత్నం కాస్తా పోలీసు సర్కిల్ ఇన్స్ పెక్టర్ మీద. ఆ కేసు పెడితే చంద్రబాబు విలపిస్తున్నారు ఎందుకు?
సీఐను చంపేయాలని తెలుగుదేశం కార్యకర్త కర్రతో దాడిచేసి ఉండకపోవచ్చు. హత్యాయత్నం కాకపోవచ్చు. కానీ కేసు పెట్టడం మీదనే నానా యాగీ చేయడం కరెక్టు కాదు. హత్యాయత్నం కేసును పోలీసులు కోర్టులో కూడా నిరూపించి.. అతనికి యావజ్జీవ శిక్ష వేయించి ఉంటే అప్పుడు చంద్రబాబు విలపించినా అర్థముంటుంది. కానీ ఆయన అదేపనిగా గోల చేస్తున్నారు.
కుప్పం సంఘటన జరిగి పదిరోజులు గడుస్తోంది.కేసు పెట్టి కూడా పదిరోజులు గడుస్తోంది. అయినా తెలుగుదేశం కార్యకర్తలమీద హత్యాయత్నం కేసు పెట్టారు.. అనేసంగతి ప్రతిరోజూ మీడియాలో ఉండేలాగా చంద్రబాబునాయుడు తన అతి తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. ఒకరోజు ప్రకటన, రెండో రోజు ఎస్పీకి ఫిర్యాదు. తర్వాత ప్రెస్ మీట్, తర్వాత ఇంకోరోజు డీజీపీకి లేఖ.. ఇలా ఒకే విషయం మీద రోజూ మీడియా కవరేజి వచ్చేలాగా.. జగన్ సర్కారు వేధిస్తున్నట్లుగా ప్రజలను నమ్మించేలాగా చంద్రబాబు డ్రామాలు నడిపిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ రాష్ట్రమంతా తమ పార్టీ కార్యకర్తలకు విచ్చలవిడిగా రెచ్చిపోవడం గురించి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా కనిపిస్తోంది.కార్యకర్తలకు ఏమైనా అయితే తాము చూసుకుంటాం అని వారికి ఏదో భరోసా ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. అందుకే కార్యక్రమం చిన్నదైనా సరే.. స్థానికంగా వాటిని నిర్వహించే సమయంలో తెలుగుదేశం దళాలు అతిగా రెచ్చిపోతున్నాయి.
వైసీపీతో గిల్లికజ్జాలు పెట్టుకోవడం మాత్రమే కాకుండా.. పరిస్థితుల్ని సద్దు మణిగేలా చేయడానికి వస్తున్న పోలీసుల మీదకు వారు రెచ్చిపోవడం చాలా చిత్రంగా కనిపిస్తోంది. పోలీసుల మీదనే దాడిచేసి.. ఇప్పుడు నంగి ఏడుపులు ఏడిస్తే కుదురుతుంది. వారి ఆగడాలు హత్యాయత్నాలు కాకుండాపోతాయా అని ప్రజలు అనుకుంటున్నారు.