వందేభారత్ రైలును ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభిస్తున్నారు. సికింద్రాబాదు నుంచి విశాఖ దాకా వెళ్లడానికి రెండు నుంచి నాలుగువేల రూపాయల టికెట్ ధర ఉండబోతోంది. మామూలుగా ఈ ప్రయాణం చేయడానికి పట్టే సమయంలో ఓ గంటకు పైగా సమయం ఆదా అవుతుంది గానీ.. టికెట్ ధర రెట్టింపుగా ఉండబోతున్నది.
అలాగే ప్రధాని నరేంద్రమోడీ గంగావిలాస్ అనే నదీవిహార క్రూయిజింగ్ పడవను కూడా ప్రారంభించబోతున్నారు. ఇది ప్రపంచంలో తొలి నదుల పర్యాటక క్రూయిజ్ అట. ఈ క్రూయిజ్ 51 రోజుల పాటు ఉత్తరాదిలోని గంగ, బ్రహ్మపుత్ర, భాగీరథి, బిద్యావతి, మేఘన, పద్మ, జమున నదుల్లో విహరిస్తుందిట. యాభై ప్రాంతాలకుతీసుకు వెళుతుందిట. వారణాసి నుంచి దిబ్రుగఢ్ వరకు వెళుతుందట. ఇలాంటి విలాసవంతమైన క్రూయిజ్ ను కూడా ప్రధాని మోడీనే ప్రారంభించబోతున్నారు. ఇంతకీ దీని టికెట్ ధర ఎంతో తెలుసా.. ఒక రోజు ప్రయాణానికి రూ.25 వేలు మాత్రమే. 51 రోజుల టూరు గనుక.. మొత్తం 12.75 లక్షలరూపాయల ధర అన్నమాట.
ఈ వార్తలు చూసినప్పుడు.. దేశం కోసం ప్రధాని నరేంద్రమోడీ ఎంతగా పరితపించిపోతున్నారో.. ఎంతగా వందేభారత్ రైళ్లను, గంగావిలాస్ లాంటి క్రూయిజ్లను తీసుకువచ్చి అంతర్జాతీయంగా మన దేశం విలువ పెంచేస్తున్నారో అని మురిసిపోతూ బిజెపి దళాలు పండగలు సెలబ్రేట్ చేసే అవకాశం ఉంది.
కానీ మోడీ ఓపెనింగులు అన్నీ కేవలం ఖరీదైన ప్రజలకోసం మాత్రమే అనే సంగతిని గుర్తు పెట్టుకోవాలి. వందే భారత్ సామాన్యులు ప్రయాణించే రైలు కాదు. గంగావిలాస్.. సామాన్యులు ఊహించేది కూడా కాదు.
అయితే ఇప్పుడేమిటి? వందేభారత్ రైళ్లు మనదేశానికి వద్దా.. వెనుకబాటు ఆలోచనలతో విమర్శలు చేస్తారా? అని కమలదళ నాయకులు విమర్శలు చేయవచ్చు. కానీ.. ఇక్కడ పాయింట్ ఏంటంటే.. ఈ ఖరీదైన మనుషులకోసం కొన్ని ఓపెనింగులు చేస్తూ.. వాటితోనే దేశాన్ని ఉద్ధరించేస్తున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం గురించి. ఇంత ఖరీదైన వాటిని మోడీ ఓపెన్ చేయకపోయినా.. ఆ జాతి సంపన్నులు వాటిని వాడుకుంటారు. కానీ.. సామాన్యులకు, పేదలకు, ఈ దేశంలో హక్కుదారుల్లాగా ఉండే దరిద్ర నారాయణులకు ఏ కొత్త రైళ్లు తీసుకువచ్చారని ప్రజలు మురిసిపోవాలి.
నిరుపేదల కోసం కొత్తరైళ్లు తెస్తేనో, వారి విహార యాత్రలకు చవకైన పథకాలు తెస్తేనో.. అప్పుడు వాటిని మోడీ ప్రారంభిస్తే జనం కీర్తిస్తారు. అంతే తప్ప.. సంపన్నులు మాత్రమే అనుభవించగల వాటిని కూడా ప్రచారం యావతో.. తానే ప్రారంభించాలని ముచ్చటపడితే ఛీత్కరించుకుంటారు. ఆ విషయాన్ని, టీ అమ్ముకుంటూ ఎదిగివచ్చానని చెప్పుకునే ఈ నాయకుడు తెలుసుకుంటే మంచిది.