జర్నలిజం విలువలు, పాత్రికేయ ప్రామాణికత పేరుతో ఉపన్యాసాలు దంచే చంద్రబాబు అనుకూల మీడియా (ముఖ్యంగా ఏబీఎన్-ఆంధ్రజ్యోతి) ఎంత దిగజారిందంటే వీథికుళాయి గొడవల స్థాయిలో వార్తలు వండి, చర్చలు పెడుతోంది. జగన్ మీద యుద్ధం చేయడానికి సినిమాలని, సినీ అభిమానుల్ని కూడా వాడుకుంటూ కుంపటి రగిలిస్తూ వుంది.
సినీ అభిమానం, అభిమానుల మధ్య ఘర్షణ, పంతాలు ఈ నాటివి కావు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలం నుంచి ఉన్నాయి. మద్రాస్‌లో వాళ్లిద్దరూ స్నేహితులే అయినా, అభిమానం హద్దులు మీర కూడదని హితవు చెప్పినా, కిందిస్థాయి అభిమానులకి అవి చెవికి ఎక్కవు. అప్పుడు కులం గోల లేదు. ఇద్దరూ కమ్మ అయినా గొడవలుండేవి. 1971 సంక్రాంతికి శ్రీకృష్ణ విజయం (ఎన్టీఆర్), దసరాబుల్లోడు (ఏఎన్ఆర్) విడుదలైతే ఆంధ్ర దేశంలో అనేక చోట్ల గొడవలు జరిగాయి. దసరాబుల్లోడు సూపర్ హిట్ అయితే, శ్రీకృష్ణ విజయం ప్లాప్. ఎన్టీఆర్ అభిమానులు భరించలేక అక్కినేని అభిమానులపై దాడులు చేసారు. అప్పటికి రాజకీయాలు లేవు. వాటికి రంగు పులిమే పత్రికలూ లేవు.
ఆ తర్వాత కూడా ఎంతో మంది అగ్రహీరో సినిమాలు ఒకేసారి (ముఖ్యంగా పండుగలకి) విడుదలయ్యాయి. ఒక హీరోది హిట్. ఇంకో హీరోది ప్లాప్ అయ్యేవి. ఇది చాలా కామన్. ఇదంతా చాలా కొత్తగా జరుగుతున్నట్టు, రెండు కులాల మధ్య జగన్ కుట్ర చేయడానికి సినిమాలు అడ్డు పెట్టుకుంటున్నట్టు కథనం అల్లడం పరాకాష్ట.
వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సంక్రాంతికి వస్తున్నాయి. బాలయ్యని, చిరంజీవిని అన్ని కులాల వాళ్లు అభిమానించి చూస్తేనే సినిమాలు ఇంత కాలం ఆడాయి. వాళ్లు హీరోలుగా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా బాలయ్య కమ్మ, చిరంజీవి కాపుగా మార్చి గొడవలు పెట్టడానికి పచ్చ మీడియా కృషి చేస్తూ ఆ బురద జగన్‌కి పూయడానికి రంగం సిద్ధం చేసింది.
సినిమాలో విషయం లేకపోతే వంద మంది యూట్యూబ్ చానల్స్‌లో కేకలు వేసినా, సమీక్షల్లో పది జాకీలు పెట్టి నిలబెట్టినా ఆడదు. విషయం వుంటే దాని విజయాన్ని ఎవరూ ఆపలేరు. కాంతారా మన భాష కాదు, మన నటులు లేరు. అయినా సూపర్ హిట్. ఇదే సూత్రం వీరసింహారెడ్డి, వీరయ్యలకి కూడా వర్తిస్తుంది.
వైసీపీకి మరేం పని లేనట్టు ఈ సినిమాల మధ్య గొడవ పెట్టి, కులాల చిచ్చు రగిలించడానికి ఐ-ప్యాక్ బృందాల్ని దింపిందట. దీని మీద డిబేట్లు కూడా. ఈ మధ్య జగన్ తనకి పత్రిక, చానల్ లేవని చెప్పారు. పొరపాటున అన్నా, తెలిసి అన్నా ఇది నిజం కూడా. సాక్షి నిద్రపోతూ వుంది. ఇది తెలిసే జగన్ మాట్లాడాడు.
జగన్ సూసైడ్ స్క్వాడ్ పని చేసేలా సోషల్ మీడియాని కూడా పని చేయకుండా చేసారు. రాబోవు రోజుల్లో దారిన పోయే ప్రతిదీ తెచ్చి జగన్ మెడకి చుడుతారు. యుద్ధం తీవ్రంగా వుంటుంది. జగన్ మీడియా, సోషల్ మీడియా నిద్రలోనే వుంటే లేచే సరికి జగన్ ప్రతిపక్షంలో వుంటాడు.